Kurnool District Ministers : కర్నూలు నుంచి మంత్రియోగం ఎవరికి ? సీనియార్టీకి ప్రాధాన్యం ఇస్తారా ?
Andhra News : కర్నూలు జిల్లా నుంచి మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయన్నదానిపై ఆసక్తి నెలకొంది. సీనియర్ నేతలకు చాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
TDP Kurnool News : తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. సీమ జిల్లాల్లో సైతం పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఊహించని స్థానాలు కూడా కూటమి అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. కందనవోలు లో తెలుగు తమ్ముళ్లు రాజకీయ కదనరంగంలో తెలుగుదేశం పార్టీ కి కనివిని ఎరుగని స్థానాలలో విజయం సాధించారు.
14 నియోజకవర్గాల్లో 12 స్థానాల్లో కూటమి విజయం
ఉమ్మడి కర్నూల్ జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో 12 స్థానాల్లో కూటమి అభ్యర్థులు తమ ఆధిపత్యాన్ని చూపారు. 11 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందగా ఒక స్థానంలో బిజెపి విజయం సాధించింది. మరో రెండు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది.
వైయస్సార్ కాంగ్రెస్ కి పట్టు ఉన్న జిల్లా కర్నూలు
ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా సామాజిక పరంగా రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి, విభజిత ఆంధ్రప్రదేశ్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన జిల్లా కర్నూలు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ హవా కొనసాగిన కర్నూలు జిల్లాలో మాత్రం వైఎస్ఆర్సిపి కే ఆ జిల్లా వాసులు పట్టం కట్టారు. 2019 ఎన్నికల్లో ఏకంగా 14 స్థానాలకు 14 వైసీపీకే దక్కాయి. ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం ఎవరు ఊహించని విధంగా కర్నూలు జిల్లా ఓటర్లు తెలుగుదేశం పార్టీ వైపు నిలిచారు. ఏకంగా 12 స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించారు.
కందనవోలు నుంచి క్యాబినెట్లోకి ఎవరు ?
ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందడంతో మంత్రి పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు జండా మోసిన సీనియర్లకు మంత్రులుగా అవకాశం ఇవ్వాలని ఇప్పటికే సీనియర్ నేతలు పార్టీకి సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లాలోని సీనియర్ నాయకులు ఎవరికి వారు మంత్రి పదవులకోసం ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు.
ముందు వరుసలో మాజీ మంత్రులు :
డోన్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి పై గెలుపొందిన కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ఈ సారి తనకు చంద్రబాబు క్యాబినెట్‌లో చోటు దక్కుతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. జిల్లాలో సీనియర్ నేత కావడంతో ఆయనకు మంత్రి పదవి దాదాపు ఖరారైనట్లేనని తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. తల్లి మరణంతో అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన భూమా అఖిలప్రియ అనతి కాలంలోనే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. లేడీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కూడా ఈ ఎన్నికల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తనకి చంద్రబాబు క్యాబినెట్లో మరోసారి మంత్రిగా అవకాశం వస్తుందని ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు.
రేసులో పలువురు ఆశావహులు
వీరితోపాటు జిల్లాలో మొదటిసారి ఎన్నికైన వారు కూడా తమకు క్యాబినెట్లో చోటు దక్కుతుందని ఆశాభవం వ్యక్తం చేస్తున్నారు ఇందులో మొదటిగా కర్నూల్ సిటీ నుంచి గెలుపొందిన టీజీ భరత్, నంద్యాల అసెంబ్లీ నుంచి గెలుపొందిన ఎస్ఎండి ఫరూక్, ఎమ్మిగనూరు నుంచి గెలుపొందిన జై నాగేశ్వర్రెడ్డి, బనగానపల్లె నుంచి పొందిన బీసీ జనార్దన్ రెడ్డి, పత్తికొండ నుంచి గెలుపొందిన కేఈ శ్యాం బాబు కూడా తమకు అధినేత చంద్రబాబు క్యాబినెట్లో అవకాశం కల్పిస్తారని ఎదురుచూస్తున్నారు.