Allu Arjun: అల్లు అర్జున్‌పై కేసు నమోదు, వైసీపీ ఎమ్మెల్యే కోసం నంద్యాల పర్యటన వివాదాస్పదం
Nandyal News: అల్లు అర్జున్ నంద్యాలలో ర్యాలీలో వేలాది మందితో పాల్గొన్నందునే కేసు నమోదు చేసినట్లుగా ఎన్నికల అధికారులు తెలిపారు. రిటర్నింగ్ అధికారి పర్మిషన్ లేకుండా ఇలా చేయడం వివాదానికి దారి తీసింది.
Case on Allu Arjun: హీరో అల్లు అర్జున్ పై నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా జన సమీకరణ చేశారని రిటర్నింగ్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్, వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిపై కేసు నమోదైంది. అయితే, కాగా శిల్పా రవికి మద్దతుగా ప్రచారం చేసేందుకు బన్నీ శనివారం నంద్యాలలో పర్యటించారు. దీంతో భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పర్మిషన్ లేకుండా జన సమీకరణ చేయడం వివాదానికి దారి తీసింది. సినీ నటుడు అల్లు అర్జున్ నంద్యాలలో ర్యాలీలో వేలాది మందితో పాల్గొన్నందునే ఈ కేసు నమోదు చేసినట్లుగా ఎన్నికల అధికారులు తెలిపారు. నంద్యాల టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో Cr. No.71/2024.U/s 188IPC. కేసు రిజిస్టర్ చేశారు.
నంద్యాలలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున స్పెషల్ డిప్యూటీ తాసిల్దార్ పి. రామచంద్రరావు ఫిర్యాదు మేరకు నంద్యాల టూ టౌన్ పీఎస్ లో, నంద్యాల వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసానికి సినీ నటుడు అల్లు అర్జున్ వచ్చారు. ఆయన్ను చూడడానికి ప్రజలు వేలాదిగా తరలి వచ్చారు. ఎలక్షన్ కోడ్, 31 ఏపీ యాక్ట్ , సెక్షన్ 144 అమలులో ఉన్నందున నంద్యాల నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పర్మిషన్ ముందస్తుగా తీసుకోవాల్సి ఉంది. అలా లేకుండా వేలాదిమందిని కలవడం నేరమని స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్ రామచంద్రరావు ఫిర్యాదు చేశారు.
అయితే, వైసీపీ శ్రేణులు నంద్యాల శివారు నుంచే భారీ వాహనాలు, మోటారు సైకిళ్లతో ప్రదర్శనగా పట్టణంలోకి అల్లు అర్జున్ ను తీసుకువచ్చాయి. ఆయన పర్యటనకు అధికారిక అనుమతులూ లేకపోయినా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని కొందరు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నంద్యాలలో ఉంది. అంతేకాక, అదే సమయంలో హీరో అల్లు అర్జున్ పర్యటన ఉండటంతో జిల్లా కేంద్రంలో కొంతసేపు ఉత్కంఠ నెలకొంది.
జనసేన జెండాలు
మరోవైపు, అల్లు అర్జున్ పర్యటనలో జనసేన జెండాలు కూడా కనిపించాయి. ఇంకా కొంత మంది పవన్ కల్యాణ్‌కు అనుకూలంగా నినాదాలు కూడా చేశారు. చంద్రబాబు పర్యటనకు ముందస్తు అనుమతి తీసుకున్న సమయంలో అల్లు అర్జున్ నంద్యాలలో ఎలా పర్యటిస్తారని టీడీపీ నేతలు కూడా ప్రశ్నించారు.