Nandyal Politics: ఈసారి నంద్యాల అడ్డా ఎవరిది? అందరూ తలపండినవారే!
AP News: టికెట్స్ వచ్చినవారు పోటీలో ఉంటే మిగతా అభ్యర్థులు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా.. లేక పార్టీకి విధేయులుగా మిగులుతారా? అనేది ఆసక్తిగా మారింది.
Nandyal Parliament Seat: నూతనంగా ఏర్పడిన నంద్యాల జిల్లాలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైఎస్ఆర్ సీపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నంద్యాల జిల్లాలో తలపండిన నాయకులు ఇరు పార్టీలలో ఉన్నారు. వారిలో టికెట్స్ ఎవరిని వరిస్తాయో తెలియదు. టికెట్స్ వచ్చినవారు పోటీలో ఉంటే మిగతా అభ్యర్థులు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా.. లేక పార్టీకి విధేయులుగా మిగులుతారా? అసలు నంద్యాల పార్లమెంటు చరిత్ర ఏమిటి అనేది తెలుసుకుందాం.
2024 పార్లమెంటు బరిలో నిలిచేది ఎవరు..
అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏ పార్టీ బలం ఎంత.. ఫ్యాన్ గాలి ముందు సైకిల్ నిలబడుతుందా..? ఇప్పటివరకు నంద్యాల పార్లమెంటు స్థానంలో పీవీ నరసింహారావు, నీలం సంజీవ రెడ్డి, పెండే కంటి వెంకట సుబ్బయ్య, వెంగల్ రెడ్డి లాంటి మహామహులు నంద్యాల పార్లమెంటు నుంచి గతంలో ఎన్నికయ్యారు. నంద్యాల పార్లమెంటు దేశానికీ రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని అందించిన నియోజకవర్గంగా గుర్తింపు పొందింది. ఇక్కడి నుంచి పెండెకంటి వెంకట సుబ్బయ్య ఐదు సార్లు గెలుపొంది సిల్వర్ జూబ్లీ పార్లమెంటీరియన్ గా గుర్తింపు పొందారు. 2019 ఎన్నికల్లో పోచ బ్రహ్మానందరెడ్డి వైసీపీ తరఫున గెలవగా.. టీడీపీ నుంచి పోటీ చేసిన మాండ్రా శివానంద రెడ్డి ఓటమి చవి చూశారు. పోచ బ్రహ్మానందరెడ్డి, మండ్రా శివనంద రెడ్డి ఇద్దరు వారి ఉద్యోగాలకు రాజీనామా చేసి రాజకీయాలలోకి వచ్చారు. నంద్యాల లో్సభ 1952 నుంచి ఇప్పటివరకు మొత్తం 17 సార్లు పార్లమెంటు ఎన్నికల్లో జరగగా కాంగ్రెస్ పదిసార్లు, టిడిపి మూడుసార్లు, వైసీపీ రెండుసార్లు విజయం సాధించాయి.
ప్రస్తుతం ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి పనితీరుపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గాల అభివృద్ధికి కేంద్రం నిధులు తీసుకొని రావడంలో విఫలం అయ్యారని ప్రజలు భావిస్తున్నారు. వైసీపీ చేసినటువంటి సర్వేల్లో పోచ బ్రంహనంద రెడ్డి కి నెగటివ్ ఫలితాలు వచ్చాయని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ వైసిపి తరఫున కొత్త అభ్యర్థిని నిలపాలని పార్టీ భావిస్తుంది. మాజీ మంత్రి శిల్ప మోహన్ రెడ్డి, టీటీడీ ఈఓ ధర్మారెడ్డి, కాటసాని రామభూపాల్ రెడ్డి, సిని నటుడు ఆలీ, బైరెడ్డి సిద్దార్థ రెడ్డి పలువురిని పరిశీలిస్తుంది. టీడీపీ తరుపున మాండ్రా శివనంద రెడ్డి బరిలో నిలవవచ్చు మరో వైపు రాయలసీమ పరిరక్షణ అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా పార్టీలో చేరితే నంద్యాల ఎంపీ టికెట్ పై కన్నేసే అవకాశం ఉంది. అంతే కాకుండా బీజేపీ తరుపున బైరెడ్డి శబరి కూడా పోటీ కోసం ఆసక్తి చూపిస్తున్నది.
నంద్యాల పార్లమెంట్ పరిధిలో నంద్యాల అసెంబ్లీ తో పాటు, పాణ్యం, బనగానపల్లె, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, డోన్, శ్రీశైలం సెగ్మెంట్లు ఉన్నాయి. ఇక్కడ ముస్లింలు, బలిజలు, వైశ్యులు ఓటర్లు గెలుపును ప్రభావితం చేస్తారు. నంద్యాల పార్లమెంటు వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులే ఎక్కువగా ఉన్నారు. వారంతా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు ముగ్గు చూపుతుండడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు రెండుసార్లు నంద్యాల ఎంపీ స్థానాన్ని వైసిపి కవచనం చేసుకుంది. ప్రస్తుతం వైఎస్ఆర్సిపి ఎంపీగా ఉన్న పోచ బ్రహ్మానంద రెడ్డి పై వ్యతిరేకత ఉండడంతో ఈసారి టీడీపీ ఆ వ్యతిరేకత ఓటు బ్యాంకును తమ వైపు ఎలా తిప్పుకుంటుంది అన్నదానిపైనే అందరి ఆసక్తి నెలకొంది. పార్లమెంట్ వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాల్లో టిడిపికి బలమైన అభ్యర్థులు ఉండడం.. తెలుగుదేశం పార్టీకి కలిసివచ్చే అంశం. ప్రస్తుత అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత ను తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అనుకూల మలుచుకుంటుందో అన్న దానిపైనే నంద్యాల పార్లమెంటు గెలుపు ఆధారపడి ఉంది.