Minister Gherao: మంత్రి జయరాంను అడ్డుకునేందుకు జనసేన, సీపీఐ లీడర్ల యత్నం- సత్యసాయి జిల్లాలో కబ్జాదారులపై చర్యలకు డిమాండ్
సత్యసాయి జిల్లాలో కబ్జాదారులు రెచ్చిపోతున్నారని ఆరోపణలు తీవ్రం అవుతున్నాయి. కబ్జాలను అడ్డుకొని, కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో ఉజ్వల్ ఫౌండేషన్ వ్యవహారం తీవ్ర దూమారం రేపుతోంది. కబ్జాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని జనసేన, సీపీఐ నాయకులు ఆందోళన బాట పట్టారు. వైసీపీ కార్యాలయం ఎదుట నిరనసకు దిగారు. మంత్రి గుమ్మనూరు జయరాంను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
సత్యసాయి జిల్లాలో కబ్జాదారులు రెచ్చిపోతున్నారని ఆరోపణలు తీవ్రం అవుతున్నాయి. కబ్జాలను అడ్డుకొని, కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా పుట్టపర్తిలో సీపీఐ, జనసేన నాయకులు ఆందోళన చేపట్టారు. ఇదే రోజు జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి మంత్రి గుమ్మనూరు జయరాం హాజరయ్యారు.
మంత్రి వచ్చారన్న సంగతి తెలుసుకొని ఆందోళనకారులు వైసీపీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. పుట్టపర్తి వైసీపీ కార్యాలయం ఎదుట మంత్రి గుమ్మనూరు జయరాంను అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. పుట్టపర్తిలో భూ అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు.
ఆందోళనకారులను పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు పక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎంత చెప్పినా శాంతించని ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నాయకులను పుట్టపర్తి అర్బన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
సత్యసాయి జిల్లాగా ప్రకటన వెలువడిన అనంతరం ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. అమాంతం భూముల రేట్లు పెరగడంతో పలుకుబడి ఉన్న రాజకీయ నాయకుల కళ్ళు ఖాళీ జాగాలపై పడింది. ఆలస్యం చేయకుండా అక్రమార్కులు భూములను కబ్జా చేస్తూ యథేచ్ఛగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా కబ్జాకు గురైనదే ఉజ్వల ఫౌండేషన్.
1992లో ఉజ్వల ఫౌండేషన్ ఆధ్వర్యంలో 6.30 ఎకరాల్లో కాటేజీలు నిర్మించి భక్తులకు విక్రయించారు. పుడా (పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ ఆధారిటీ) రాక ముందు సుడా (సత్యసాయి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) ఉండేది. సుడా నియమాల ప్రకారం అన్ని అనుమతులు పొంది కాటేజీలు నిర్మించి అప్పట్లో విక్రయించారు. అయితే భవిష్యత్ అవసరాల దృష్టిలో ఉంచుకొని 10 శాతం స్థలాలను లైబ్రరీ, పార్కులు, ఆలయ నిర్మాణాలకు రిజర్వ్ చేసి వదిలిపెట్టారు.
ప్రస్తుతం ఖాళీగా ఉన్న రిజర్వ్ స్థలాలపై కన్నువేసిన కబ్జాదారులు వాటిని ఆక్రమించి అక్రమంగా విక్రయిస్తున్నారు. ఏకంగా బేస్మెంట్‌లు సైతం నిర్మిస్తున్నారు. దీంతో నమిత అనే ఓ మహిళ అందరికీ సంబంధించిన ఉమ్మడి జాగాలను విక్రయిస్తున్నారని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.
ఫిర్యాదు దారులపై దౌర్జన్యాలకు సైతం కబ్జాదారులు వెనకాడటం లేదు. ఈ వ్యవహారంలో ప్రముఖ రాజకీయ పార్టీల నాయకుల హస్తం ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి స్థానిక ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, పుడా వైస్ ఛైర్మన్‌లతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించారు. వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలంటూ కాల పరిమితి విధించారు. ప్రస్తుతం ఉజ్వల ఫౌండేషన్ భూముల వ్యవహారం పుట్టపర్తిలో హాట్ టాపిక్‌గా మారింది.