Kurnool News: భూమి అమ్మిన డబ్బులను చూసి స్నేహితుడిని డ్రమ్ములో పడుకోబెట్టేశారు- కర్నూలు జిల్లాలో జరిగిన క్రైమ్ గురించి తెలిస్తే వణుకే
Crime News: నిందితులతో స్నేహం చేస్తే ఎలా ఉంటుందో తెలిపే ఘటన. తోటి స్నేహితుడిని చంపి డ్రమ్ములో పెట్టి మాయం చేయాలని చూసే బ్యాచ్ కథ ఇది.
Andhra Pradesh: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిన్న హోతూరు గ్రామంలో గత నెల 28న డ్రమ్ములో శవం లభ్యమైంది. ఈ హత్యఆస్పరి పోలీసులకు సవాల్‌గా మారింది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి డ్రమ్ము పడేసి పోయారన్న సమాచారంతో తీగలాగినన పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవి పోలీసులకే షాక్ ఇచ్చాయి.
ప్రాణ స్నేహితుడిని ఎందుకు చంపాలనుకున్నాడు ?
ఎమ్మిగనూరు మండలం మసీదుపురం గ్రామానికి చెందిన పేటయ్య, నరసింహుడు ఇద్దరు స్నేహితులు. పేటయ్య తనకున్న స్థలం అమ్మి 7,50,000 రూపాయలు తన దగ్గర ఉంచుకున్నాడు. ఎలాగైనా ఆ సొమ్మును కొట్టేయాలని నరసింహుడు ఆలోచించాడు. పేటయ్యకు మాయ మాటలు చెప్పి దొంగ నోట్లు ఇప్పిస్తానని హోలెబీడు గ్రామానికి చెందిన హనుమంతు, పంపన్న దగ్గరకు తీసుకెళ్లాడు.
అందరూ అప్పటికే భారీ స్కెచ్ వేశారు. అనుకున్నట్టుగానే గత నెల 25న పేటయ్యకు సైనేడ్ కలిపిన మద్యం బలవంతంగా తాగించి హత్య చేశారు. ఆ తర్వాత ఆ శవాన్ని పంపన్న పొలంలో ఉన్న షెడ్ దగ్గర పూడ్చిపెట్టారు. అక్కడ దుర్వాసన రావడంతో ఆ శవాన్ని బయటకు తీసి ఓ ప్లాస్టిక్ డ్రమ్ములొ పెట్టి చిన్న హోతురు గ్రామ సమీపంలో ఉన్న వంకలో పడేసి పోయారు.
పోలీసులకు ఎలా చిక్కారు..?
డ్రమ్ములో నుంచి వాసన వస్తుండడంతో స్థానిక ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రమ్మును ఓపెన్ చేసి చూడగా అందులో శవం కనిపించింది. ఆశ్చర్యపోయిన పోలీసులు అది మర్డర్‌గా అనుమానించి విచారణ చేపట్టారు. విచారణలో తన ప్రాణ స్నేహితుడే పేటయ్యను కిరాతకంగా చంపి ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.
నేర చరిత్ర ఉన్న నిందితుడు :
పేటయ్య హత్యకు పాల్పడిన నరసింహుడు, హనుమంతు, పంపన్నను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా గతంలో నరసింహుడు తండ్రినే చంపిన కేసులో నిందితుడు. తండ్రి ఉద్యోగం కోసం ఈ పని చేశాడని తేలింది. మాజీ నక్షలైట్ అని జనాన్ని హనుమంతు బెదిరించిన డబ్బులు దండుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. వారి నుంచి 7 లక్షల 50 వేల రూపాయలు రికవరీ చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు.