Jc Prabhakar Reddy : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన వేళ జేసీ సంచలన నిర్ణయం, మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా..!
Andhra Pradesh News: తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేసేందుకు జెసి ప్రభాకర్ రెడ్డి సిద్ధపడుతున్నారు. నెల రోజుల్లో రాజీనామా చేస్తున్నట్టు స్వయంగా ప్రకటన చేశారు.
Tadipatri News: అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేసేందుకు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు రాజీనామా చేస్తున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. నెల రోజుల్లో చైర్మన్ పదవికి రాజీనామా చేస్తామని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ఈ నిర్ణయం రాజకీయంగా ఆసక్తిని కలిగిస్తోంది.
సార్వత్రిక ఎన్నికల్లో ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు. ఈ క్రమంలో ఆయన రాజీనామా చేస్తానని ప్రకటించడం ఆసక్తిని కలిగిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 74 చోట్ల వైసిపి అధికారాన్ని కైవసం చేసుకుంటే, తాడిపత్రిలో మాత్రం జెసి ప్రభాకర్ రెడ్డి టిడిపి జెండాను ఎగురువేశారు. మున్సిపల్ చైర్మన్ గా ఆయనే బాధ్యతలు చేపట్టారు.
అనూహ్యంగా ఆయన రాజీనామా చేసేందుకు సిద్ధపడుతుండడం గమనార్హం. దీనికి వేరే కారణం ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. మున్సిపల్ చైర్మన్ గా పదవి బాధ్యతలను ప్రభాకర్ రెడ్డి స్వీకరించినప్పుడు.. ఒక మాటను చెప్పారు. నాలుగు సంవత్సరాలలో మున్సిపల్ కౌన్సిలర్లను సంవత్సరానికి ఒకరు చొప్పున మున్సిపల్ చైర్మన్ గా, మరి కొంతమంది కౌన్సిలర్లను మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎంపిక చేస్తామన్నారు. ఈ మేరకే ఆయన రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారని చెబుతున్నారు.
నెల రోజుల్లో మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తామని ఆయనే స్వయంగా ప్రకటించారు. గడచిన ఐదేళ్లలో తాడిపత్రిలో అభివృద్ధి కుంటుపడిందని, వచ్చే ఐదేళ్లలో ఇక్కడ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని ఆయన స్పష్టం చేశారు. తాడిపత్రి మున్సిపాలిటీని దేశంలోనే ఆదర్శంగా చేస్తామని ఆయన స్పష్టం చేశారు.