Kurnool bus accident update: కర్నూలు బస్సు ప్రమాదంలో కీలకమలుపు - ముందే బైక్ ప్రమాదం - డ్రైవర్ చెప్పిన సంచలన విషయాలు ఇవిగో
Kurnool bus Fire: కర్నూలు బస్సు ప్రమాదంలో కీలక విషయాలను డ్రైవర్లు చెప్పారు. బైక్ ప్రమాదం ముందే జరిగిందని..రోడ్డుపై ఉన్న బైక్ ను బస్సు ఈడ్చుకెళ్లిందని తెలిపారు.

Kurnool bus accident Drivers Version: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేశారు. వారు కీలక విషయాలను వెల్లడించినట్లుగా తెలుస్తోంది. బస్సు.. బైక్ ను ఢీకొట్టలేదని.. బస్సు అక్కడికి రాక ముందే బైక్ యాక్సిడెంట్ అయిందని డ్రైవర్లు పోలీసులకు తెలిపినట్లుగా తెలుస్తోంది. రోడ్ పై బైక్ పడి ఉందని ..భారీ వర్షం కారణంగా సరిగ్గా చూసుకోలేదని.. ఆ సమయంలో బైక్ పైకి బస్సు ఎక్కిందని.. ఈడ్చుకుని వెళ్లిందన్నారు. బైక్ లో ఉన్న పెట్రోల్ ట్యాంక్ నుంచి పెట్రోల్ లీక్ అయి స్పార్క్ వచ్చి మంటలు అంటున్నాయని డ్రైవర్లు తెలిపారు.
డ్రైవర్లు తెలిపిన ప్రకారం.. ఆ బైక్ యాక్సిడెంట్ అంతకు ముందు జరిగింది. కానీ ఆ ప్రమాదాన్ని ఎవరూ పట్టించుకోలేదు. దాంతో బైక్ నడిపిన శివకుమార్ రోడ్డు పక్కన పడిపోయారు. బైక్ రోడ్డు మీద పడిపోయింది. ఆ బైక్ ను బస్సు ఈడ్చుకెళ్లడంతో ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్దారించారు. బైక్ రైడర్ కూడా మరణించడంతో పోలీసులు అసలేం జరిగిందన్నదానిపై పూర్తి వివరాలు వెలికి తీసేందుకు దర్యాప్తు చేస్తున్నారు.
ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉన్నతాధికారుల్ని సంఘటనా స్థలానికి పంపించి.. సహాయ కార్యక్రమాలు చేపడుతోంది. బస్సులో ఉల్లంఘనలు ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. మరోవైపు గాయపడిన వారికి పూర్తి స్థాయిలో చికిత్స అందించే ఏర్పాట్లు చేశారు. కోలుకున్న వారిని బెంగళూరుకు పంపే ఏర్పాట్లు చేశారు.
బస్సులో ఉండిపోయిన మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కోసం డీఎన్ఏలు సేకరించారు. ఆ మృతదేహాల ఆనవాళ్లను ఆస్పత్రికి తరలించారు. బస్సును రోడ్డు నుంచి పక్కకు జరిపే ప్రయత్నంలోనూ మరో ప్రమాదం జరిగింది. బస్సును లాగుతున్న క్రేన్ ఒక్క సారిగా కిందకు పడిపోవడంతో.. క్రేన్ ఆపరేటర్ కు తీవ్ర గాయాలయ్యాయి.
హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళుతున్న మల్టీ యాక్సిల్ బస్సు.. కర్నూలు నగరానికి సమీపంలోని చిన్న టేకూరు వద్ద ప్రమాదానికి గురై పూర్తిగా తగులబడిపోయింది. 40మందికిపైగా ఉన్న బస్సులో సగం మందే ప్రాణాలు కాపాడుకోగలిగారు. . ఈ ఘటనలో 20 మంది సజీవ దహనం కాగా, మరో 20 మంది వరకు గాయపడ్డారు. వీరిలో కొందరు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్లీపర్ బస్సు సీట్లలోనే 20మంది సజీవంగా దహనం అయిపోయారు. ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
బస్సుల డిజైన్, వేగ నియంత్రణ, ఫిట్‌నెస్, ఎస్కేప్ ప్లాన్ వంటి విషయాలపై చర్చకు దారితీస్తున్నాయి. బస్సుల్లో అగ్ని కీలలు రాగానే క్షణాల్లోనే కాలిపోతున్నాయని బస్సుల తయారీకి వాడుతున్న మెటీరియల్ మంటలను వేగంగా వ్యాప్తి చేస్తోందని దీనిపై చర్చించాల్సిన అవసరం ఉందని నిపుణులు వ్యాఖ్యనిస్తున్నారు.





















