Milk Products: పాల పేనీలే జీవనాధారం, వందల కుటుంబాలకు ఇదే ఉపాధి మార్గం
ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని వారు ఎదురు చూడలేదు. ఎవరిపైనా ఆధారపడకుండా సొంత కష్టాన్నే నమ్ముకున్నారు. పాల పేనీలు తయారీలో నైపుణ్యం సాధించారు. కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు.
పాల పేనీలు ఉపాధి ఇచ్చాయి. సరదాగా నేర్చుకున్న వంటకం ఇప్పుడు ఫేమస్ చేసింది. అనంతపురం జిల్లా గుంతకల్లులో హంపయ్య కాలనీ అంటే ఇప్పుడు చాలా ఫేమస్. కేవలం పేనీల తయారీ కారణంగా అందరికీ పరిచయమైందీ కాలనీ.
ఇళ్లలోనే కుటీర పరిశ్రమలుగా పేనీలు తయారీ చేసి ఆర్థికంగా చేయూత పొందుతున్నారు హంపయ్య కాలనీ మహిళలు. తయారుచేసిన పాల పేనీలను ముంబై, బెంగళూరు, హైదరాబాద్, పుణె తరలిస్తున్నారు. గుంతకల్లు రైల్వే డివిజన్ కావడంతో అన్ని వేళలో రైళ్లు ఉంటాయి. ఇదే వాళ్ల వ్యాపారానికి బాగా కలిసి వచ్చింది. రవాణా చాలా సులభమైంది. తమ ఎదుగుదలకు తామే మెట్లు నిర్మించుకుంటున్నాం అంటున్నారు గుంతకల్లు హంపయ్య కాలనీ మహిళల.
సేమియాలాగా తీగలు తీగలుగా ఉండి గుండ్రటి ఆకారంతో డాల్డాలో వేయించిన తిను బండారాన్నే పాల పేనీలు లేదా పాల సేమియా అని అంటారు. తయారీ సమయంలోనే వేడి డాల్డాలో డీప్ ఫ్రై చేయడం మూలాన ప్రత్యేకంగా ఉడికించాల్సిన పనిలేదు. వేడిపాలలో కలుపుకొని తినడానికి సిద్ధం అన్నమాట. ముంబై తదితర ప్రాంతాలలో ఈ తినుబండారానికి భలే క్రేజ్ ఉంది. 40 ఏళ్ల క్రితం భాషా అనే వ్యక్తి ఈ వంటకం రెసిపీ బొంబాయి నుంచి నేర్చుకున్నాడు. మొట్టమొదటిసారిగా గుంతకల్లులోని హంపయ్య కాలనీలో తయారు చేశాడు.
మొదట్లో తయారు చేసిన ఈ వంటకాన్ని గుంతకల్ పరిసర ప్రాంతాల‌్లో విక్రయించేవారు. కాలానుగుణంగా డిమాండ్ ఎక్కడుందో తెలుసుకుని అక్కడికి పంపించడం నేర్చుకున్నారు. ఇలా ఒకరి వద్ద నుంచి అనేక మంది ఈ వంటకాన్ని తయారు చేయడం అలవర్చుకున్నారు. ప్రస్తుతం గుంతకల్లు పట్టణంలో ఓ వీధి మొత్తం ఈ పాల పేనీలు తయారు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. మైదా పిండిలో డాల్డా కలిపి తీగలు తీగలుగా చేసి అనంతరం వేడి డాల్డాలో వీటిని డీప్ ఫ్రై చేస్తారు. అనంతరం ఆరబెట్టి కేజీల ప్రకారం విక్రయిస్తారు.
అసలే కరవు ప్రాంతం.. ఉపాధి లేక దిన కూలీలకు వెళ్లే పరిస్థితి నుంచి ఇంటి వద్దే కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా బలపడుతున్న గుంతకల్లు హంపయ్య కాలనీ మహిళల విజయమిది. ఓ వీదిలోని మహిళలంతా పాల పేనీలు తయారీలో నిమగ్నమై ఉంటారు. తెల్లవారు జామున నాలుగు గంటలకు లేచి పిండిని తడుపుకుని అందులో డాల్డా కలుపుకుంటారు. ఈ మిశ్రమాన్ని మాలిష్ చేస్తారు. దీంతో అనేక పాయలుగా విడిపోతుంది. వీటిని చిన్న చిన్న చుట్టలుగా చుడతారు. మూడు రకాల సైజుల్లో కూడా చేస్తారు. అలా నాలుగైదు గంటలు వదిలిన తర్వాత బట్టీ పైన డాల్డాను వేడి చేస్తారు. చుట్టిన ఈ చిన్న చిన్న పిండి చుట్టలను అరచేతితో వెడల్పుగా వత్తుకొని వేడి డాల్డాలో వేయిస్తారు.
వినియోగదారుల అభిరుచి మేరకు కొన్ని ఎర్రగా, మరికొన్ని తెల్లగా కాల్చుకుంటారు. కడాయిలో నుంచి తీసిన వీటన్నిటిని ఓ క్రమపద్ధతిలో పేర్చుకుంటారు. రెండు మూడు గంటలు ఆరిన తర్వాత వీటిని కేజీల ప్రకారం ప్యాక్ చేసి రవాణాకు సిద్దం చేస్తారు. కొంతమంది వీధుల‌్లో వ్యాపారం చేసే వారు అక్కడికే వచ్చి కొనుగోలు చేస్తారు. హోల్ సేల్ గా అయితే కేజీ 150 రూపాయలు గాను రీటైల్ గా అయితే కేజీ 200 గాను విక్రయిస్తారు.
ఏడాది పొడువునా ఉపాధి కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని తమ పిల్లల చదువులు, కుటుంబపోషణ సాగిస్తున్నామని ఆనందంగా చెబుతారు ఇక్కడి మహిళలు.
ప్రస్తుతం పాలపేనీల తయారీదారులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గతంలో ఒక డబ్బా డాల్డా పన్నెండు వందల యాభై రూపాయలు ఉండేదని ప్రస్తుతం 2250 రూపాయలకు పెరిగిందని తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా ఒక వెయ్యి రూపాయలు పెరిగితే తాము ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. తమలాంటి పేద వారిని దృష్టిలో ఉంచుకుని నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని ప్రభుత్వాలని వేడుకుంటున్నారిక్కడి మహిళలు.
ప్రభుత్వం నుంచి రుణాలు మంజూరు చేస్తే వ్యాపారాన్ని విస్తరించేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రభుత్వ అధికారులు మాత్రం తమ వైపు కన్నెత్తి చూడడం లేదని విమర్శిస్తున్నారు. తమ కాళ్లపై తాము నిలబడి వ్యాపారం చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్న గుంతకల్ హంపయ్య కాలనీ మహిళలు అందరికీ ఆదర్శం.