బుధవారం అనంతపురంలో జగన్ పర్యటన- వసతి దీవెన డబ్బులు విడుదల
వాయిదా పడుతూ వస్తున్న వసతి దీవెన నిధుల విడుదల బుధవారం జరగనుంది. అనంతపురం జిల్లా నార్పలలో జరిగే కార్యక్రమానికి సీఎం జగన్ హాజరుకానున్నారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అనంతపురంలో బుధవారం పర్యటించనున్నారు. శింగనమల నియోజకవర్గం నార్పల మండలంలో నిర్వహించే జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొంటారు. కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు.
వారం రోజుల క్రితం ఈ వసతి దీవెన నిధులు విడుదల కావాల్సి ఉన్నప్పటికీ ఖజానాలో నిధుల కొరత అంటూ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఇప్పుడు షెడ్యూల్ ఖరారు చేసింది ప్రభుత్వం. బుధవారం ఉదయం 9.45 నిమిషాలకు సీఎం జగన్ సత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో పది గంటలకు అనంతపురం జిల్లా నార్పలలోని ప్రభుత్వం బాలుర పాఠశాలకు చేరుకుంటారు. 10.20కి చేరుకోనున్న సీఎం జగన్ 10.30 వరకు స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడాతారు.
పదిన్నర తర్వాత నార్పల క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటోగ్యాలరీని సందర్శించారు. 11 గంటలకు సభా వేదికపై చేరుకుంటారు. అక్కడ వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తారు.
11గంటలకు వసతి దీవెన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అక్కడే ఉన్న విద్యార్థులతో జగన్ మాట్లాడతారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. తర్వాత వసతి దీవెన నిదులు విడుదల చేస్తారు. మధ్యాహ్నం 12.35 నిమిషాలకు అక్కడ నుంచి బయల్దేరి 1.40 నిమిషాలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
ఈ కార్యక్రమానికి 1200 మందితో పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్ గౌతమి, డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. ఇప్పటికే సీఎం పర్యటన రూట్ పరిశీలించినట్టు తెలిపారు.