సీమ కష్టాలు తెలిసే హంద్రీనీవా ప్రాజెక్టు త్వరగా పూర్తి చేశాం: జగన్
గత ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల కష్టాలను పట్టించుకోలేదని విమర్శించారు. ఎన్నికలకు 4 నెలల ముందు చంద్రబాబు జీవోలు, శంకుస్థాపనలతో హడావుడి చేశారే తప్ప చిత్తశుద్ధితో పని చేయలేదని ఆరోపించారు.
హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు సీఎం జగన్. ఈసందర్భంగా హంద్రీనీవా ప్రధాన కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. అనంతరం డోన్ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాయలసీమ నీటి కష్టాలు తనకు తెలుసు అన్నారు. ఇక్కడ వర్షపు నీటితోనే పంటలు పడుతున్నాయని వేరే ఆధారం లేదన్నారు. ఈ ప్రాంత ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా సాగునీటి కోసం చర్యలు చేపట్టామన్నారు. గతంలో డోన్‌లో ఒక్క ఎకరం కూడా ప్రత్యేక ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా పండే పరిస్థితి లేకుండేదన్నారు.
గత ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల కష్టాలను పట్టించుకోలేదని విమర్శించారు. ఎన్నికలకు 4 నెలల ముందు చంద్రబాబు జీవోలు, శంకుస్థాపనలతో హడావుడి చేశారే తప్ప చిత్తశుద్ధితో పని చేయలేదని ఆరోపించారు. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు వల్ల డోన్, పత్తికొండ నియోజకవర్గాల్లో ప్రజలకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం కనీసం భూసేకరణ కూడా చేయకుండా వదిలేసిన ఈ ప్రాజెక్టు కోసం తమ ప్రభుత్వం రూ. 253 కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేసిందని వివరించారు. నీటి విలువ, సీమ కష్టాలు తెలిసిన ప్రభుత్వంగా చిత్తశుద్ధితో ప్రాజెక్టు జాతికి అంకితం చేశామన్నారు.
హంద్రీనీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి మెట్ట ప్రాంతాలకు తాగునీరు, సాగు నీరు అందించే కార్యక్రమం అని సీఎం జగన్ అన్నారు. లక్కసాగరం వద్ద పంప్ హౌస్ ఏర్పాటు చేసి ఈరోజు ఈ 77 చెరువులు నింపే కార్యక్రమం ఉంటుందని చెప్పారు. దాదాపు రోజుకు 160 క్యూసెక్కుల చొప్పున 90 రోజుల్లో 1.24 టీఎంసీల నీళ్లు నింపేట్లుగా కార్యక్రమం మొదలవుతోందని అన్నారు.
పక్కనే శ్రీశైలం ఉన్నా కూడా ఈ మెట్ట ప్రాంతాలకు పత్తికొండ, డోన్ మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందని దుస్థితి ఉందని వివరించారు. డోన్‌లో అయితే ఒక్క ఎకరా కూడా ఇరిగేషన్ లో లేని పరిస్థితి ఉందని వివరించారు. ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నా గతంలో ఎవరూ పట్టించుకున్న పరిస్థితులు లేవని వివరించారు.
గతంలో 2019 మార్చిలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగితే, 2018 నవంబర్ అంటే ఎన్నికలకు కేవలం నాలుగైదు నెలల ముందు మాత్రం ఒక జీవో ఇచ్చారని చంద్రబాబును ఉద్దేశించి ప్రసంగించారు. అటువంటి దారుణమైన మోసాలు, పరిస్థితుల మధ్య మీ బిడ్డ అయిన తన ప్రభుత్వం ఏర్పడిందని సీఎం జగన్ అన్నారు.
8 మండలాలకు సాగునీరు
అత్యంత కరువుతో కూడిన 8 మండలాలకు 10,130 ఎకరాలకు సాగునీరు అందిస్తూ, ఈ ప్రాంతంలో ఉన్న గ్రామాలకు తాగునీరు అందిస్తూ, 253 కోట్లతో ఈ ప్రాజెక్టుకు పనులు చేపట్టి పూర్తి చేశామని సీఎం జగన్ వివరించారు. ఈ ప్రాజెక్టు వల్ల డోన్, పత్తికొండ రెండు నియోజకవర్గాలకు చాలా మంచి జరుగుతుందని అన్నారు. ఆలూరు, పాణ్యం నియోజకవర్గాలకు కూడా మంచి జరుగుతుందని అన్నారు.
‘‘వెల్దుర్తి, కల్లూరు మండలాల్లో 22 చెరువులకు హంద్రీ నీవా కాలువ నుంచి పైప్ లైన్ కనెక్టివిటీ పూర్తియింది. ట్రయల్ రన్స్ కొనసాగుతున్నాయి. క్రిష్ణగిరి, తుగ్గలి, పత్తికొండ, మద్దికెర, దేవరకొండ మండలాల్లోని 14 చెరువులకు కూడా పైపు లైన్ కనెక్టివిటీ పూర్తయి పైప్ లైన్ కనెక్టివిటీ కొనసాగుతోంది. ప్యాపిలి బ్రాంచ్ కింద ప్యాపిలి, డోన్ మండలాల్లో 19 చెరువులకు పైప్ లైన్ పూర్తయి, ట్రయల్ రన్ కొనసాగుతోంది. జొన్నగిరి బ్రాంచ్ కింద డోన్, తుగ్గలి మండలాల్లో మరో 7 చెరువులకు కూడా కనెక్టివిటీ పూర్తి చేసి ట్రయల్ రన్ కూడా నిర్వహిస్తున్నాం. ఈ ప్రాజెక్టులో కొత్తగా డోన్ నియోజకవర్గంలో అదనంగా అవసరాన్ని బట్టి మరో 8 చెరువులకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మొత్తంగా 77 చెరువులకు సంబంధించిన ఈ ప్రాజెక్టు పనులన్నింటికీ 253 కోట్లతో పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు ఇవ్వబోతున్నాం’’ అని సీఎం జగన్ వివరించారు.