కోలుకున్న అవినాష్ రెడ్డి తల్లి- హైదరాబాద్ తరలింపు
మే 19న ఉదయం 10 గంటల సమయంలో సీబీఐ విచారణకు బయలుదేరారు. అదే సమయంలో తల్లి అనారోగ్యంతో బాగాలేదని పులివెందుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది.
వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అవినాష్ తల్లి ఆరోగ్యం కుదట పడింది. ఆమె కోలుకున్నట్టు అవినాష్ రెడ్డి మీడియాకు తెలిపారు. తన తల్లి ఆరోగ్యం కుదట పడిందని ప్రకటించారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. ఆమెను డిశ్చార్జ్ చేసి హైదరాబాద్ తీసుకెళ్తున్నట్టు వివరించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తున్నట్టు వెల్లడించారాయన.
తన తల్లిని తీసుకొని అవినాష్ రెడ్డి కర్నూలు నుంచి హైదరాబాద్ బయల్దేరారు. వారం రోజులుగా కర్నూలు కేంద్రంగా సాగుతున్న హైడ్రామాకు నేటి తెరపడింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి మే 19న సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉంది. తన తల్లి ఆరోగ్యం బాగాలేదని సీబీఐకు లెటర్ రాసి పులివెందుల బయల్దేరి వెళ్లిపోయారు.
మే 19న ఉదయం 10 గంటల సమయంలో సీబీఐ విచారణకు బయలుదేరారు. అదే సమయంలో తల్లి అనారోగ్యంతో బాగాలేదని పులివెందుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. పులివెందుల ఆస్పత్రిలో చేరారన్న సమాచారం తెలుసుకున్న అవినాష్ హైదరాబాద్ నుంచి పులివెందుల బయల్దేరి వెళ్లారు.
అవినాష్ తల్లి పరిస్థితి సీరియస్‌గా ఉందని హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ తరలిస్తున్న క్రమంలో పరిస్థితి మరింత సీరియస్ గా ఉందని కర్నూలుకు తరలించారు. అక్కడే వారం రోజుల పాటు చికిత్స అందించారు.
ఈ వారంలో చాలా నాటకీయ పరిణామాలు జరిగాయి. అవినాష్‌కు సోమవారం విచారణకు సీబీఐ పిలిచింది. అయితే తన తల్లి ఆరోగ్యం బాగాలేనందున 27వ తేదీ వరకు తాను రాలేనని చెప్పేశారు అవినాష్. సుప్రీంకోర్టులో కూడా ముందస్తు బెయిల్ పై నిరాశే ఎదురైంది. దీంతో ఆయన అరెస్టు ఖాయమంటూ వార్తలు వచ్చాయి. సీబీఐ అధికారులు కూడా కర్నూలు వెళ్లారు. పోలీసు అధికారులతో మాట్లాడి అవినాష్ లొంగిపోయేలా ప్రయత్నాలు చేశారు. అయినా అవేవీ సాధ్యపడలేదు.
సీబీఐ అధికారులు కర్నూలు వరకూ వచ్చారు. తర్వాత వెనుదిరిగి వెళ్లిపోయారు. విచారణకు సహకరించకపోతూండటంతో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అవినాష్ రెడ్డి విషయంలో సీబీఐ అధికారులు కీలక నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. తీర్పును బట్టి సీబీఐ ఓ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇంతలో శ్రీలక్ష్మిని డిశ్చార్జ్ చేసి హైదరాబాద్ తరలించారు.
హైకోర్టు వెకేషన్ బెంచ్ నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు
అవినాష్ రెడ్డి ముంందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో జస్టిస్ జె కే మహేశ్వరి, జస్టిస్ పి. నరసింహ ధర్మాసనం విచారణ జరిపి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేయాలని రెండు రోజుల కిందట ఆదేశించింది. తన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ కోరే హక్కు పిటిషనర్‌కు ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అవినాష్ రెడ్డి తన పిటిషన్‌లో ముందస్తు బెయిల్‌పై హైకోర్టు విచారణ జరిపే వరకు కస్టడీ నుంచి రక్షణ కల్పించాలని కోరారు. లేదంటే, ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరిపి పరిష్కరించే వరకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని పిటిషన్‌లో అభ్యర్థించారు.