CPI Rama Krishna: అర్ధరాత్రి రోడ్డుపైనే పడుకున్న సీపీఐ రామకృష్ణ, పోరు గర్జనకు రాకుండా ఎక్కడికక్కడ అరెస్టులు
Anantapur: పోలీసులు తమ ధర్నాను ఆపేందుకు ప్రయత్నించారని, వారు వ్యవహరించిన తీరు ఆక్షేపణీయమని రామకృష్ణ అన్నారు.
రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం మరుగున పడి జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగమే అమలవుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. రాష్ట్రంలో పెరిగిన ధరలు, విద్యుత్ చార్జీలను నిరసిస్తూ ఆయన అనంతపురంలో నిరసన చేపట్టారు. అందులో భాగంగా ఆయన గత రాత్రి అంబేడ్కర్ విగ్రహం వద్దే పడుకున్నారు. అయితే, పోలీసులు తమ ధర్నాను ఆపేందుకు ప్రయత్నించారని, వారు వ్యవహరించిన తీరు ఆక్షేపణీయమని రామకృష్ణ అన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో విజయవాడలో తలపెట్టిన పోరుగర్జన కార్యక్రమానికి వెళ్తున్న రామకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలువురు నాయకులు, వందలాది మందితో ర్యాలీగా రైల్వేస్టేషన్‌కు వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని, అరెస్టు చేసి, కూడేరు పోలీసుస్టేషన్‌కు తరలించారు. దీంతో ఉరవకొండ ఎమ్మెల్యే పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ అక్కడికి చేరుకొని ఆయన్ను పరామర్శించారు.
ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో విపరీతంగా పెరిగిన ధరల నియంత్రణ కోసం శాంతియుతంగా పోరాటాలు చేస్తే నోటీసులు, అరెస్టులు చేస్తూ ఎలా నిర్బంధిస్తారంటూ మండిపడ్డారు. ‘‘విజయవాడకు 25 కిలో మీటర్ల దూరంలో అసెంబ్లీ ఉంటే నగరంలో ధర్నా చేసుకుంటే ఏమైంది? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలి.. అందరూ గొంతెత్తి అడగాలని కోరుతున్నా. ఈ రాష్ట్రంలో పార్టీలు, సంస్థలు, ప్రముఖులు నిలదీయాలి. రాష్ట్రంలో సభ పెట్టుకునేందుకు అవకాశం ఉందా లేదా? తేలాలి. అలాగే పెంచిన ఆర్టీసీ, కరెంటు ఛార్జీలు తగ్గించాలి. గ్యాస్ పైన కూడా 50 రూపాయలు పెంచారు. మా పోరాటాన్ని మరింతగా పెద్దఎత్తున తీసుకెళ్తాం. కేంద్రంలోని మోదీ, రాష్ట్రంలోని జగన్ ఆగడాలు తగ్గాలి’’ అని అన్నారు.
పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. ‘‘పోరు గర్జనకు హాజరు కాకుండా ఎక్కడికక్కడ వామపక్ష నేతల్ని అరెస్టు చేయడం అప్రజాస్వామికమైన చర్య.’’ అని పయ్యావుల కేశవ్ అన్నారు.