Viral News: మెడలో ఎర్ర టవల్, ముఖానికి మాస్కుతో హాస్పిటల్‌కు వెళ్లిన వ్యక్తి.. కలెక్టర్ అని తెలిసి సిబ్బంది షాక్
Andhra Pradesh News | జిల్లా కలెక్టర్ ఓ సామాన్యుడిలా వెళ్లి హాస్పిటల్ తనిఖీ చేసి వచ్చారు. అయితే తిరిగి వెళ్లిపోయే వరకు ఆయన ఎవరో హాస్పిటల్ సిబ్బందికి, డాక్టర్లకు తెలియదు.

Anantapur News | అనంతపురం: జిల్లా కలెక్టర్ సామాన్యుడిలా వెళ్లి గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఆయన వెళ్లిపోయే వరకు కలెక్టర్ వచ్చి పరిశీలించిన విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. ఈ విషయంలో ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఉన్నతాధికారులు ఈ విధంగా హాస్పిటల్స్, ప్రభుత్వ కార్యాలయాలు, గవర్నమెంట్ స్కూల్స్ లాంటి వాటిని ఆకస్మిక తనిఖీ చేస్తే ప్రయోజనం ఉంటుందని ప్రజలు కోరుతున్నారు.
వ్యక్తిగత కార్యక్రమం నుంచి తిరిగి వెళ్తూ..
అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. జిల్లా అధికారులు ఇలా ఆసుపత్రిని పరిశీలించే విషయం మామూలే.. ఇందులో కొత్త ఏముంది అనుకుంటున్నారా... అక్కడే అసలు విషయం ఉంది. నిన్న అనంతపురం జిల్లా కలెక్టర్ గుంతకల్లు పట్టణంలో ఓ వ్యక్తిగత కార్యక్రమానికి హాజరై తిరిగి వెళుతూ అర్ధరాత్రి 11 గంటల సమయం తన వాహనాన్ని దూరంగా ఆపివేసి సిబ్బందిని దూరంగా ఉంచి ముఖానికి మాస్కు ధరించి, మెడలో ఓ టవల్ వేసుకొని సామాన్యుడిలా గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలోకి వెళ్లారు అనంతపురం జిల్లా కలెక్టర్.

సామాన్యుడిలా ఆసుపత్రి అంతా కలియతిరిగారు జిల్లా కలెక్టర్. అక్కడ ఉన్న వారితో మాట్లాడారు. తిరిగి వెళ్లేటప్పుడు సెక్యూరిటీ గార్డ్ తో కూడా మాట్లాడారు. అయితే అతను ఎవరితో ఏం మాట్లాడారు, ఏ అంశాలు పరిశీలించారు అన్న విషయం ఇప్పటివరకు వెల్లడికాలేదు. ప్రభుత్వ అధికారులు ఆకస్మికంగా ఏ సమయంలోనైనా తనిఖీ చేస్తారు అన్న భయంతోనైనా వ్యవస్థ సక్రమంగా జరుగుతుందని కలెక్టర్ ఇలా చేశారా లేక తన ఆకస్మిక తనిఖీతో ఏవైనా లోపాలు గుర్తించారా అన్నది ఇంకా తెలియ రాలేదు.
ఇంతకీ కలెక్టర్ ఏం లోపాలు గుర్తించారు..
ఒకవేళ ఏమైనా లోపాలు గుర్తించి ఉంటే శాఖపరమైన చర్యలు తీసుకున్న తర్వాత కలెక్టర్ పరిశీలించిన అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద కలెక్టర్ ఇలా అర్ధరాత్రి ఆకస్మికంగా ఆసుపత్రిని పరిశీలించి వెళ్లడం జిల్లాలో హాట్ టాపిక్ అవుతోంది. ఇలా ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీ చేయడం ద్వారా ఆసుపత్రి సిబ్బంది, డాక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండి సేవలు అందించడానికి వీలుంటుందని స్థానికులు చెబుతున్నారు.





















