Guntakal Railway Station: గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో పెచ్చులు ఊడిపడి పదేళ్ల బాలుడు మృతి
Guntakal Railway Station:అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో గోడ పెచ్చులు ఊడి పడి కర్నూలు జిల్లాకు చెందిన పదేళ్లబాలుడు మృతి చెందాడు.

Guntakal Railway Station: అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో పదేళ్ల బాలుడు మృతి చెందాడు. ఏడో నంబరు ప్లాట్ఫారంలో నిద్రిస్తున్న టైంలో ప్రమాదం జరిగింది. బాలుడిపై గోడ పెచ్చులు ఊడి పడడంతో ఘటన జరిగింది.
కర్నూలు జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు శ్రీవాణి కుమారుడు మణికంఠ. తల్లిదండ్రులతో కలిసి మణికంఠ వేసవి సెలవులు కావడంతో తీర్థయాత్రలకు బయలుదేరారు. కర్నూలు నుంచి గుంతకల్లు రైల్లో చేరుకున్నారు. గుంతకల్లు నుంచి రామేశ్వరం వెళ్లవలసిన ట్రైన్ కోసం ఏడో నెంబరు ప్లాట్ఫారంలో వేచి ఉన్నారు. ట్రైన్ రావడానికి ఇంకా సమయం ఉండడంతో ఏడో నెంబర్ ప్లాట్ఫారంలోని వెయిటింగ్ హాల్ వద్ద పడుకున్నారు.
వెయిటింగ్ హాల్‌లో పడుకున్న టైంలో ప్రమాదం జరిగింది. గోడ పైపెచ్చులు ఊడి నిద్రిస్తున్న బాలుడు మణికంఠపై పడ్డాయి. గోడ విరిగిపడటంతో తల చిధ్రమైపోయింది. హుటాహుటిన అక్కడ ఉన్న స్థానికులు రైల్వే సిబ్బంది స్పందించారు. అంతా కలిసి మణికంఠను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి ప్రాథమిక చికిత్స అందించిన డాక్టర్ల మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు.
వైద్యులు సూచనల మేరకు బాలుడిని అనంతపురం తరలించారు. తరలిస్తుండగా మార్గమధ్యంలోని బాలుడు మృతి చెందాడు. దీంతో విహారయాత్రలకు వెళ్లేందుకు వచ్చి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో మణికంఠ తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి.
గత దశాబ్ద కాలంగా రైల్వే స్టేషన్‌లో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోలేదు. అయితే ఏడో నెంబర్ ప్లాట్ఫారంలో ఉన్న వెయిటింగ్ హాల్ వద్ద ఊడిపోవడంతో ఇది ఎలా పడింది నాణ్యత లోపమా లేక ఇంకా ఏదైనా లోపం ఉందా అని రైల్వే అధికారులు విచారణ చేపట్టారు.





















