Nandyala Boy Suicide: హెయిర్ కటింగ్ నచ్చలేదని బాలుడి ఆత్మహత్య- నంద్యాల జిల్లాలో విషాదం
Nandyala Latest News: చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. జుట్టు సరిగా కట్ చేసుకోలేదని మళ్లీ చేయించినందుకు ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డి పల్లెలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అంకిరెడ్డిపల్లెకు చెందిన 7వతరగతి విద్యార్థి సిద్ధిక్ బాషా(13) కు హెయిర్ కటింగ్ నచ్చలేదని ఆత్మహత్య చేసుకున్నడాు. మనస్తాపంతో ఫ్యానుకు ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నాడు.
జుత్తు ఎక్కువైందని క్షవరం చేయించుకోమని ఇంట్లోని పెద్దమ్మ, పెదనాన్న చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా..కాస్త స్టైల్గానే కటింగ్ చేసుకున్నానని భావించి ఆ కుర్రాడు ఇంటికి వెళ్లాడు. అది నచ్చని పెదనాన్న, పెద్దమ్మ సగం జుత్తు కత్తిరించుకుని వచ్చావేంటని ప్రశ్నించారు. ఇదేం క్షవరం అని మందలించి మళ్లీ క్షవరం చేపించారు.
ఇలా తనకు నచ్చినట్టు కటింగ్ చేయించలేదని మనస్తాపం చెందిన సిద్ధిక్ బాషా (13) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన సిద్దిక్ బాషా చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. దీంతో కొలిమిగుండ్ల అంకిరెడ్డిపల్లెలోని పెద్దమ్మ, పెద్దనాన్న వద్ద ఉంటున్నాడు. తాడిపత్రిలో శ్రీ చైతన్య పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు.
జుట్టు ఎక్కువైందని పాఠశాల సిబ్బంది సిద్ధిక్ బాషా కుటుంబానికి ఫిర్యాదు చేశారు. జుట్టు ఎక్కువైందని క్షవరం చేపించుకోవాలని బాషాను పెద్దమ్మ పెదనాన్న చెప్పారు. సరిగ్గా క్షవరం చేసుకోలేదని వారు మందలించి బాషాకు మళ్ళీ చేపించడంతో ఈ ఘటన జరిగింది.
సిద్ధిక్ బాషా మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుమ్ముకున్నాయి. అనాథైన సిద్ధిక్ బాషాను పెంచి పెద్ద చేసి ప్రయోజకుడు అవుతాడని అనుకుంటే ఇలా చేశాడని వాపోతున్నారు. చిన్నపాటి మందలింపునకే ఉరి వేసుకొని మృతి చెందడం ఏంటని ఆ కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. సమాచారం తెలుసుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సిద్దిక్ బాషా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Also Read: బాపట్లలో కదులుతున్న కాలేజీ బస్సులో మంటలు- తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డ 30 మంది విద్యార్థులు