Kurnool SI : "ఏయ్ కళ్లు నెత్తికెక్కాయా? నా ముందే నడుంపై చేయి వేసుకుని నిలబడతావా?"-అంగన్వాడీ నాయకురాలిపై రెచ్చిపోయిన ఎస్సై
Kurnool SI : ఏయ్ కళ్లు నెత్తికెక్కాయా, నా ముందే నడుంపై చెయ్యి వేసి మాట్లాడతావా?" అంటూ ఓ మహిళా ఎస్సై రెచ్చిపోయారు. అంగన్ వాడీ నాయకురాలిపై ప్రతాపం చూపారు.
Kurnool SI : "ఏయ్ కళ్లు నెత్తికెక్కాయా, నడుంపై చెయ్యి తీయ్, నన్నే ప్రశ్నిస్తావా? మీరు చెప్పినట్టు కాదు నేను చెప్పినట్టు వినాలి. నేను మండలి అధికారిని, నవ్వు స్టేషన్ కు రా ఏం తప్పు చేశావో చెప్తా. ఎవరితో మాట్లాడుతున్నావో కనబడడం లేదా? ముందు జీపు ఎక్కు స్టేషన్‌కు వెళ్లాక అన్నీ చెబుతాం’ అంటూ అంగన్‌వాడీ(Anganwadi) నాయకురాలిపై ఓ మహిళా ఎస్‌ఐ(SI) దౌర్జన్యం ప్రదర్శించారు. పొలంలో పనిచేసుకుంటున్న ఓ మహిళపై ఎస్సై మాట్లాడిన తీరు సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఏ తప్పు చేయలేదంటూనే అంగన్ వాడీ నాయకురాలిని పోలీసులు బలవంతంగా పోలీసు స్టేషన్ కు తరలించారు.
(అంగన్వాడీ నాయకురాలు హరిత)
అసలేం జరిగిందంటే?
కర్నూలు జిల్లా కొత్తపల్లి(Kottapalli) మండలం సింగరాజపల్లెలో ఆదివారం ఈ ఘటన జరిగింది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఈ నెల 15 నుంచి మూడు రోజుల పాటు అంగన్‌వాడీలు విజయవాడలో రిలే నిరాహార దీక్షలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా పోలీసు నిర్బంధాలు మొదలయ్యాయి. కర్నూలు(Kurnool) జిల్లా సింగరాజపల్లెలో అంగన్‌వాడీ యూనియన్ దళిత నాయకురాలు హరిత తన పొలంలో పనులు చేసుకుంటుండగా కొత్తపల్లి ఎస్‌ఐ ముబినా తాజ్ అక్కడికి వెళ్లి హరితను స్టేషన్ రావాల్సిందిగా హెచ్చరించారు. ఏం తప్పు చేశానని, స్టేషన్‌కు ఎందుకు రావాలని హరిత ప్రశ్నించగా, నన్నే ప్రశ్నిస్తావా? అంటూ ఎస్సై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎస్సైపై ఆత్మకూరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు
‘నా ముందే నడుంపై చేయి వేసుకుని నిలబడతావా? కళ్లు నెత్తికెక్కాయా? ఎవరితో మాట్లాడుతున్నావో కనబడడం లేదా? ముందు జీపు ఎక్కు స్టేషన్‌కు వెళ్లాక అన్నీ చెబుతాం' అని ఎస్సై అంగన్ వాడీ నాయకురాలని హెచ్చరించారు. ‘వాడెవడో వీడియో తీస్తున్నాడు. వాడిని కూడా స్టేషన్‌కు లాక్కెళ్లండి’ అంటూ సిబ్బందిని ఎస్‌ఐ ఆదేశించారు. ఇదేమీ దౌర్జన్యం అంటూ అడ్డుపడిన హరిత తండ్రిని కూడా స్టేషన్‌కు లాక్కెళ్లి నాలుగు గంటలకుపైగా నిర్బంధించారు. సాయంత్రం ఇద్దరినీ వదిలి పెట్టారు. దీంతో ఎస్‌ఐని సస్పెండ్ చేయాలంటూ సీఐటీయూ నాయకులు ఆత్మకూరులో ధర్నా చేశారు. ఎస్‌ఐపై ఆత్మకూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే అంగన్‌వాడీ యూనియన్ నాయకులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ ముబినా తాజ్ తెలిపారు. హరితను తాను దుర్భాషలాడలేదని, ఎవరిపైనా చేయి చేసుకోలేదని చెప్పారు.
ఎస్సై చెయ్యి చేసుకున్నారు : బాధిత మహిళ
ఎస్ఐ ముబీనా తాజ్ ను తక్షణమే సస్పెండ్ చేయాలంటూ ఆత్మకూరు పోలీస్ స్టేషన్(Atmakur Police Station) ఎదుట సీఐటీయూ నాయకులు ఇవాళ ఆందోళన చేపట్టారు. సింగరాజు పల్లె గ్రామానికి చెందిన హరిత అనే దళిత అంగన్వాడీ టీచర్ పొలంలో పని చేస్తున్న సమయంలో అక్కడికి వచ్చి అనవసరంగా మహిళ ఎస్ ఐ చేయి చేసుకుందంటూ బాధితురాలు హరిత ఆరోపించాకరు. ఎస్సై తనపై దాడి చేస్తున్న సమయంలో వీడియోను చిత్రీకరిస్తున్న తన తండ్రి పైన కూడా ఎస్ ఐ చెయ్యి చేసుకుని ఇద్దరినీ పోలీస్ స్టేషన్ కు తరలించి చిత్రహింసలకు గురిచేస్తూ నోటికి చెప్పలేనిది పదజాలంతో దూషించిందంటూ బాధిత మహిళ ఆరోపించారు. ఈ విషయంపై వివరణ కోరేందుకు మీడియా ప్రతినిధులు ఎస్సై ముబీనా తాజ్ కు ఫోన్ చెయ్యగా ఆమె అందుబాటులోకి రాలేదు. దళిత మహిళపై చెయ్యి చేసుకున్న ఎస్ఐని తక్షణమే చర్యలు తీసుకోకపోతే కలెక్టరేట్ ను ముట్టడిస్తామని బాధితులు హెచ్చరించారు.