Nujiveedu TDP Incharge : పార్టీలో చేరకుండానే కొలుసు పార్థసారధికి బాధ్యతలు - రెండు చోట్ల చాన్సిచ్చిన టీడీపీ !
Kolusu Parthasaradhi : కొలుసు పార్థసారధికి ఏలూరు లోక్ సభ, నూజివీడు ఇంచార్జ్ పదవుల్ని టీడీపీ ఇచ్చింది. నూజివీడు టీడీపీ ఇంచార్జ్ వైసీపీ నేతల్ని కలవడంతో వెంటనే నిర్ణయం తీసుకున్నారు.
Nujiveedu TDP Incharge Kolusu Parthasaradhi : వైసీపీకి చెందిన పెనుమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి ఇంకా టీడీపీలో చేరలేదు. అయితే ఆయనను ఏలూరు పార్లమెంట్, నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ గా నియమిస్తూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటన విడుదల చేశారు. దీంతో ఆయనకు ఈ రెండు స్థానాల్లో ఒక సీటు ఖరారు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పార్థసారధి.. నూజివీడులో టీడీపీ క్యాడర్ ను కలుస్తూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. కానీ టీడీపీ ఇంచార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు తనకే సీటివ్వాలని కోరుతున్నారు. చంద్రబాబు పిలిచించి మాట్లాడినా ఆయన తగ్గలేదు. ఈ క్రమంలో ఆయన వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. సీఎం క్యాంప్ ఆఫీస్ లో సజ్జల రామకృష్ణారెడ్డితో ఆయన సోమవారం సమవేశం అయ్యారు. దీంతో తెలుగుదేశం పార్టీ ఆయనను ఇక పట్టించుకోవాల్సిన అవసరం లేదని భావించి.. వెంటనే పార్థసారధిని ఇంచార్జ్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.
ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వైసీపీలో చేరినా ఆయనకు నూజివీడు టిక్కెట్ కేటాయించరని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మైలవరం టిక్కెట్ కేటాయిస్తారని అంటున్నారు. మంత్రి జోగి రమేష్‌తో విభేదాల కారణంగా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీని వీడారు. వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరనుండటంతో ఆయన స్థానంలో జడ్పీటీసీ సభ్యుడు స్వర్ణాల తిరుమలరావు పేరును వైసీపీ అధిష్టానం ఖారారు చేసింది. అయితే స్వర్ణాల తిరుమలరావు అభ్యర్థిత్వంపై సొంత పార్టీలోనే విమర్శలు తలెత్తడంతో మైలవరం నియోజకవర్గం అభ్యర్థి విషయంలో జగన్ పునరాలోచనలో పడ్డారు. మారుతున్న రాజకీయ పరిణామాలతో దృష్ట్యా సీఎం జగన్ మైలవరం నియోజకవర్గంపై కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతుంది.
మైలవరం అభ్యర్థిగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే , నూజివీడు టీడీపీ ఇంచార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పేరును పరిశీలిస్తున్నారు. సోమవారం జగన్‌ను సీఎం క్యాంపు కార్యలయంలో కలిశారాయన. దీంతో ముద్దరబోయిన టీడీపీని వీడి వైసీపీలో చేరడం దాదాపు ఖారారైంది.నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావుతో చర్చించిన తరువాతే ముద్దరబోయిన వెంకటేశ్వరరావును వైసీపీలోకి ఆహ్వానించడం జరిగిందని పార్టీ వర్గాలు తెలిపాయి. తాజాగా సీఎం జగన్ సూచన మేరకు ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు మైలవరం నియోజకవర్గ బాధ్యతలను అప్పగించాలని చూస్తోంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
పెనమలూరు ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారధి టీడీపీలో చేరి.. నూజివీడు నుంచి పోటీ చేస్తున్నారు. నూజివీడుకు చెందిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వైసీపీలో చేరి.. మైలవరం నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సారి కృష్ణా జిల్లాలో నేతలు అటూ ఇటూ మారిపోవడం చాలా ఎక్కువగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.