Kodali Nani : కేసినో పెట్టామని నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటా.. కొడాలి నాని సవాల్ !
గుడివాడ కేసినో వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే మంత్రి కొడాలి నాని మాత్రం కేసినో పెట్టామని నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని .. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని సవాల్ చేశారు.
గుడివాడలో మంత్రి కొడాలి నానికి చెందిన కల్యాణమండపంలో కేసినో పెట్టాలని వీడియోలు హల్ చల్ చేశాయి. ఈ అంశం రాజకీయ దుమారం రేపుతోంది. టీడీపీ నిజనిర్ధారణ కమిటీ అక్కడకు వెళ్లిన ఘటనలోనూ ఉద్రిక్తత ఏర్పడింది. అయితే మంత్రి కొడాలి నాని మాత్రం ఇప్పుడు తన కన్వెన్షన్ సెంటర్‌లో అలాంటివేమీ జరగలేదని... జరిగాయని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. పెట్రోల‌్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని సవాల్ చేశారు. నిరూపించకపోతే చంద్రబాబు, లోకేష్ లు ఏం చేస్తారో చెప్పాలన్నారు.
Also Read: ఫిబ్రవరి 7 లేదా 8 నుంచి నిరవధిక సమ్మె.. ఏపీ ఉద్యోగ సంఘాల నిర్ణయం !
గుడివాడలో డ్యాన్సులు జరుగుతున్నాయని తెలిసి తానే స్వయంగా డీఎస్పీకి తెలియచేయడం జరిగిందన్నారు. కరోనా వచ్చిన తర్వాత 14 రోజుల తర్వాత కేబినెట్ లో పాల్గొనడం జరిగిందని, కేవలం తనపై దుష్ర్పచారం చేస్తున్నారని కొడాలి నాని విమర్శించారు. ఎవరు వచ్చినా తనను ఎవరూ ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మూడురోజుల పాటు గుడివాడలో జరిగిన కేసినో వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. కేసినోల్లో ఉండే అన్ని రకాల సామాగ్రితో పెద్ద ఎత్తున జూదం నడిచిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. అన్ని చోట్లా వైఎస్ఆర్‌సీపీ రంగులను పోలిన అలంకరణ చేశారు.
చీకోటి ప్రవీణ్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఇది మొత్తం నడిచిందని .. మూడు రోజుల్లో దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపణలు వచ్చాయి.అయితే పోలీసులు పట్టించుకోలేదు. టీడీపీ నేతలు ఎస్పీకి ఫిర్యాదు చేసిన తర్వాత డీఎస్పీని విచారణాధికారిగా నియమించారు. ప్రస్తుతానికి డీఎస్పీ విచారణ జరుపుతున్నారు. నివేదికను ఇంకా ఇవ్వలేదు. ఇలాంటి సమయంలో అసలు తన కల్యాణ మండపంలో ఎలాంటి కేసినోలు పెట్టలేదని.. డాన్సులు జరుగుతూంటే ఆపాలని తానే చెప్పానని ఆనడం ఆసక్తి రేపుతోంది. పోలీసుల నివేదిక తర్వాత రాజకీయంగానూ కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.