Kakinada Konam Fish : జాక్ పాట్ కొట్టిన ఉప్పాడ జాలర్లు, వలలో చిక్కిన కోటి విలువైన కోనాం చేపలు
Kakinada Konam Fish :కాకినాడ జిల్లాలో గంగపుత్రుల పంట పండింది. ఉప్పాడ తీరంలో జాలర్ల వలలకు కోటి రూపాయల విలువైన 12 టన్నుల కోనా చేపలు పడ్డాయి.
Kakinada Konam Fish : కాకినాడ జిల్లాలో గంగపుత్రుల పంట పండింది. ఉప్పాడ తీరంలో ఏకంగా రూ. కోటి విలువైన మత్స్య సంపద దొరికింది. 12 టన్నుల కోనాం చేపలు వలలకు చిక్కాయి. వేట నిషేధ సమయంలో దిగాలుగా కూర్చుని తీరంలోనే కాలక్షేపం చేసిన గంగపుత్రులను గంగమ్మ కరుణించిందంటున్నారు అక్కడి వారంతా. సముద్రంలో వేటకు వెళ్లిన గంగపుత్రుల పంట పండింది. ఒక్కరోజులోనే ఏకంగా 12 టన్నుల మత్స్య సంపదను కూడగట్టుకుని సంతోషంతో తీరానికి తిరిగి వచ్చారు మత్స్యకారులు. ఈ మధ్య కాలంలో ఎన్నడూలేని విధంగా ఒక్క రోజులోనే కోటి రూపాయల విలువచేసే కోనాం చేపలు పట్టారు. దీంతో మత్స్యకారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
12 టన్నుల కోనాం చేపలు
కొత్తపల్లి మండలం ఉప్పాడకు చెందిన నీలపల్లి సత్తిరాజు 20 మంది మత్స్యకారుల బృందం రెండు ఫైబర్ బోట్లలో రెండు రోజుల క్రితం ఉప్పాడ తీరం నుంచి సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు. అనూహ్యంగా వారి వలలకు భారీ స్థాయిలో కోనాం చేపలు పడుతుండడంతో గమనించిన మత్స్యకారులు రెట్టింపు ఉత్సాహంతో వేట సాగించారు. అప్పటికే వారు వెళ్లిన రెండు పైబర్ బోట్లు మత్స్య సంపదతో నిండిపోయాయి. దీంతో మరో చిన్న మర బోటుకు సమాచారం అందించారు. ఫైబర్ బోట్లలో నిండిపోయిన సరుకును మరో బోటులోకి కొంత బదిలీ చేసి మెత్తం మీద బోట్లును నిండు కుండలా తీరానికి చేర్చారు. అప్పటికే 10 టన్నులు పైబడిన సరుకు దాటి ఉంటుందని అంచనాకు వచ్చిన మత్స్యకారుల బృందం తీరంలో తూకం వేయిస్తే ఏకంగా 12 టన్నులు కోనాం సరుకు తూగింది.
ఒక్క రోజులో రూ. కోటి ఆదాయం
మత్స్యకారుల వలలకు చిక్కిన 12 టన్నుల కోనాం చేపలను కాకినాడ హార్బర్‌కు తీసుకువచ్చి వ్యాపారులకు విక్రయించగా కిలో రూ. 9 వందల చొప్పున కోటి రూపాయల ఆదాయం లభించింది. డీజిల్, ఇతర నిర్వహణ ఖర్చులు తీసివేయగా ఒక్కో మత్స్యకారుడికి రూ.2 లక్షలకు పైగా వచ్చాయని సంతోషంతో తెలిపారు. ఈ స్థాయిలో కోనాం చేపలు దొరకడం ఇదే మొదటిసారి అని ఆనందం వ్యక్తం చేశారు.
Also Read : Tiger Footprint: కాకినాడలో టైగర్ ఈజ్ బ్యాక్, మళ్లీ కనిపించిన బెంగాల్ టైగర్ పాదముద్రలు - అధికారులు అలర్ట్
Also Read: Kakinada Tiger Fear : సీసీ కెమెరాలకు చిక్కదు, అధికారులకు దొరకదు-ఎత్తుకు పై ఎత్తు