Tiger Roaming Video : కాకినాడ జిల్లాలో పులి సంచారం, బోను వద్ద తచ్చాడిన దృశ్యాలు రికార్డ్
Kakinada News: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో పెద్ద పులి సంచారం స్థానికులను భయపెడుతోంది. శరభవరంలో ఏర్పాటు చేసిన బోను వద్దకు పులి వచ్చి కాసేపు తచ్చాడిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
Kakinada News : కాకినాడ జిల్లా ఒమ్మంగి పరిసర గ్రామాల ప్రజలను పులి భయం వెంటాడుతోంది. పెద్దపులి పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు బోను ఏర్పాటు చేశారు. పులి బోను వద్దకు వచ్చి వెనక్కి వెళ్లిపోయింది. ఆ దృశ్యాలు అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాల్లో రికార్డు అయ్యాయి. కొన్ని నిమిషాల పాటు పులి బోను ముందు తచ్చాడింది. రాజమండ్రి సీసీఎఫ్, కాకినాడ డీఎఫ్ఓ, ఇద్దరు రెంజర్లు, ఫారెస్ట్ అధికారులు, వెటర్నరీ డాక్టర్లు పర్యవేక్షణలో శనివారం రాత్రి పులిని బంధించేందుకు చర్యలు చేపట్టారు. అధికారుల ప్రయత్నాలు విఫలమవ్వడంతో స్థానిక గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఈసారి పక్కా వ్యూహంతో పులిని బంధిస్తామని అధికారులు చెబుతున్నారు. పులి భయంతో పనులకు వెళ్లలేక పోతున్నామని ఐదు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటి వరకు పెద్ద పులి దాడిలో 9 పశువులు మృతి చెందాయి. పులి ఎక్కువగా సంచరిస్తున్న పొదురుపాక దగ్గర నాలుగు బోన్లు అధికారులు ఏర్పాటుచేశారు. ఈ గ్రామం సమీపంలోని నీటి చెరువుల వద్ద మరో రెండు బోన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
రెండు వారాలుగా పులి సంచారం
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో దాదాపు రెండు వారాలుగా పెద్ద పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. తాజాగా పులి సంచరించిన దృశ్యాలు మరోసారి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అటవీ సిబ్బంది పొదురుపాక, శరభవరం, ఒమ్మంగిలో మూడు బోన్లు ఏర్పాటు చేశారు. పులికి పశు మాంసం ఎరగా వేశారు. శనివారం అర్ధరాత్రి తర్వాత పులి శరభవరంలో ఏర్పాటు చేసిన బోను వద్దకు వచ్చి కాసేపు అక్కడే తిరిగి వెనుదిరిగినట్లు సీసీ కెమెరా దృశ్యాల్లో రికార్డు అయింది. పొదురుపాక, శరభవరం, ఒమ్మంగి, పాండవులపాలెం, పోతులూరు పరిసర ప్రాంతాల్లో పులి వేట, వసతి సౌకర్యంగా ఉండటంతో అక్కడే తిరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. పులికి నాలుగైదేళ్ల వయసు ఉందని, దూకుడుగా ఉన్నట్లు తెలిపారు. పెద్ద పులిని పట్టుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్న అటవీ అధికారులు మరో రెండు బోన్లు ఏర్పాటుచేస్తున్నారు.
రాత్రుళ్లు బయటకు రావొద్దు
కాకినాడ జిల్లాలో పెద్దపులి సంచారం స్థానికులను భయపెడుతోంది. మే 26 నుంచి ప్రత్తిపాడు మండలంలో పులి కదలికలను స్థానికులు గుర్తించారు. పోతులూరులో ఓ పశువుని పులి చంపింది. దీంతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమై బోన్ లు ఏర్పాటు చేశారు. ఫారెస్ట్ అధికారులు అమర్చిన కెమెరాల్లో పులి సంచరిస్తున్న ఫొటోలు పడ్డాయి. గురువారం పాండవుల పాలెంలో పెద్దపులి ఆవును చంపేసింది. పోతులూరు, పాండవులపాలెం, వొమ్మంగి, శరభవరం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల సాయంత్రం 5 నుంచి ఉదయం 7 వరకు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని పోలీసులు ప్రకటన చేశారు. పశువుల్ని పొలాల్లో కాకుండా ఇళ్ల వద్ద కట్టేయాలని సూచించారు.