kadiri Registrar: ఏపీలో రోడ్డెక్కిన రిజిస్ట్రేషన్లు - టీ షాపులో కూర్చుని రిజిస్ట్రార్ సంతకాలు, కదిరిలో ఘటన
Andhra News: ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగిన క్రమంలో ఓ అధికారి కార్యాలయంలో కాకుండా టీ దుకాణంలో దస్త్రాలపై సంతకాలు చేయడం విమర్శలకు తావిచ్చింది. ఈ ఘటన కదిరిలో చోటు చేసుకుంది.

Kadiri Sub Registrar Registered Lands In Tea Shop: ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు శనివారం నుంచి పెరిగిన నేపథ్యంలో శుక్రవారం భారీగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఓ సబ్ రిజిస్ట్రార్ ఏకంగా ఓ టీ షాపులోనే దస్త్రాలపై సంతకం చేయడం విమర్శలకు తావిచ్చింది. భూముల క్రయ, విక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ పనులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చేయాల్సి ఉండగా.. సత్యసాయి జిల్లా కదిరి సబ్ రిజిస్ట్రార్ (Kadiri Sub Registrar) శ్రీనివాసులు టీ కొట్టునే రిజిస్ట్రార్ ఆఫీసుగా మార్చుకున్నారు. సదరు అధికారి టీ దుకాణంలో దస్త్రాలపై సంతకాలు చేస్తోన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సబ్ రిజిస్ట్రార్‌పై ఆరోపణలు
కాగా, ఏపీలోని భూముల మార్కెట్ విలువను ప్రభుత్వం సవరించింది. ఇది శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్న క్రమంలో శుక్రవారమే భూముల రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని అంతా భావించారు. దీంతో అధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పరుగులు తీశారు. ఆ ఒక్కరోజే కదిరి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 130కి పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. అయితే, కదిరి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసులు శుక్రవారం సెలవులో ఉన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సెలవులో ఉంటూనే దళారుల ద్వారా దస్త్రాలను తెప్పించుకుని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ సమీపంలోని టీ దుకాణంలో సంతకాలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మరుసటి రోజు ఆఫీసుకు వచ్చిన ఆయన మధ్యాహ్నమే వెళ్లిపోయారు. దీంతో ఆయన వ్యవహారశైలి ఆ శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది.
భారీగా ఆదాయం
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా పెరిగిన క్రమంలో అంతకంటే ముందే రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకునేందుకు ప్రజలు త్వరపడ్డారు. జనవరి 31 ఒక్కరోజే అనంతపురం జిల్లా నుంచి రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.5.19 కోట్ల ఆదాయం వచ్చింది. అటు, రాష్ట్రవ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో భారీగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 1,184, ఎన్టీఆర్ జిల్లాలో 946, ప్రకాశం జిల్లాలో 944 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.
కాగా.. రాష్ట్రంలో ఎక్కడ గ్రోత్ కారిడార్లు ఉన్నాయో అక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి. విజయవాడ, విశాఖతో పాటు కోనసీమ, ప్రకాశం జిల్లాల్లోని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి. మరికొన్ని చోట్లు ఛార్జీలు తగ్గించారు. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచకూడదని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇక్కడ పాత ఛార్జీలే కొనసాగనున్నాయి. మార్కెట్ విలువకు అనుగుణంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలు సవరించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఏడాది ఆగస్ట్ 1న, గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకు ఓసారి రిజిస్ట్రేషన్, స్ట్రక్చర్ విలువలు సవరించాలి. కానీ, గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేక రివిజన్ పేరుతో వీటిని మార్చగా.. వీటిపై సమీక్షించిన కూటమి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విలువలను సవరించాలని నిర్ణయించింది.
Also Read: Vijayasai Reddy: నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

