Viveka Murder Case : నిజాలు బయటపడే రోజు దగ్గర్లోనే, సీఎం జగన్ సహకరించి ఉంటే 10 రోజుల్లో విచారణ పూర్తి - దస్తగిరి
Viveka Murder Case : సీఎం జగన్ సీబీఐకి సహకరించి ఉంటే వివేకా హత్య కేసు విచారణ 10 రోజుల్లో పూర్తి అయ్యేదని దస్తగిరి అన్నారు.
Viveka Murder Case : వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో అప్రూవర్ గా మారిన వివేకా డ్రైవర్ దస్తగిరి... తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో నిజాలేంటో త్వరలో తెలుస్తాయని దస్తగిరి అన్నారు. హైదరాబాద్‌కు కేసు బదిలీ అవ్వడం మంచిదే అన్నారు. ఈ నెల 10న హైదరాబాద్ సీబీఐ కోర్టుకు హాజరు కావాలని నోటీసులు అందుకున్నట్లు ఆయన తెలిపారు. సీబీఐ అధికారులు పక్కా సమాచారంతో ఈ కేసులో సంబంధం ఉన్న వారిని విచారణకు పిలుస్తున్నారన్నారు. అందులో భాగంగానే వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా విచారణకు పిలిచారన్నారు. ఈ కేసులో ఎవరి పాత్ర ఏంటో సీబీఐ అధికారులు త్వరలోనే వెల్లడిస్తారని నమ్ముతున్నట్లు దస్తగిరి ఆదివారం అన్నారు.
సీఎం జగన్ సహకరించి ఉంటే
వివేకా హత్యకేసులో త్వరలో నిజాలు తెలనున్నాయని, వాస్తవాలు బయటపడే రోజు దగ్గర పడిందని దస్తగిరి అన్నారు. ఇప్పటి వరకూ దస్తగిరి చెప్పింది అబద్దమని అన్నారని, ఇకపై తాను చెప్పిన నిజాలు ఏంటో ప్రజలకు తెలుస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్ లో విచారణకు సీఎం జగన్ సహకరించి ఉంటే 10 రోజుల్లో కేసు విచారణ పూర్తి అయ్యేదన్నారు. తెలంగాణకు వివేకా హత్య కేసు బదిలీ అవ్వడం మంచిదేనన్నారు.
దూకుడు పెంచిన సీబీఐ
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు కడప సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్‌లో ఆరున్నర గంటల పాటు ఇద్దర్ని ఇటీవల ప్రశ్నించారు. సీఎం జగన్ ఓఎస్డీగా పని చేస్తున్న కృష్ణమోహన్ రెడ్డి, అలాగే తాడేపల్లిలో సీఎం క్యాంప్ ఆఫీసులో పని చేసే నవీన్ అనే వ్యక్తిని విచారణకు పిలిచింది సీబీఐ. ముందుగా కృష్ణమోహన్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరయ్యారు. నవీన్ విచారణకు వచ్చినట్లుగా స్పష్టత లేదు కానీ.. ఆయన సెంట్రల్ జైలుకు వచ్చారని..ఆయనను కూడా రహస్యంగా సీబీఐ ప్రశ్నించిందని చెబుతున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్ లో భారీ భద్రత నడుమ విచారణ జరిగింది. కృష్ణమోహన్ రెడ్డితో పాటు కడప సెంట్రల్ జైల్లో ఇప్పటికే రిమాండ్ లో ఉన్న దేవిరెడ్డి శంకర్ రెడ్డి, యాదాటి సునీల్, ఉమా శంకర్ రెడ్డి లను సీబీఐ విచారించే అవకాశం ఉంది.
ఎంపీ అవినాశ్ రెడ్డి కాల్ డేటాను పరిశీలించిన సీబీఐ
వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు.. ఎంపీ అవినాశ్ రెడ్డి కాల్ డేటాను సీబీఐ పరిశీలించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఆ తర్వాత విచారణలో వెల్లడైన అంశాలను బట్టి నవీన్ , కృష్ణమోహన్ రెడ్డిలకు నోటీసులను సీబీఐ జారీ చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి ఫోన్లను నవీన్ అటెండ్ చేస్తుంటారని చెబుతున్నారు. గతం నుంచి జగన్ వద్ద పనిచేస్తున్న కృష్ణమోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓఎస్డీగా నియమించారు. వీరిద్దరిని ఆరు గంటల పాటు ప్రశ్నించడంతో తర్వాత సీబీఐ ఎలాంటి అడుగు వేయబోతోందోనన్న ఆసక్తి మొదలైంది.