Lokesh On CM Jagan : ప్యాలెస్ పిల్లి పెట్టే కేసులకు భయపడం, భయం టీడీపీ బయో డేటాలో లేదు- లోకేశ్
Lokesh On CM Jagan : ఏపీలో జంగిల్ రాజ్యం నడుస్తోందని లోకేశ్ ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
Lokesh On CM Jagan : కడప సెంట్రల్ జైలు వద్దకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేరుకున్నారు. సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ప్రవీణ్ రెడ్డిని పరామర్శించేందుకు లోకేశ్, టీడీపీ నాయకులు కారాగారం వద్దకు చేరుకున్నారు. సెంట్రల్ జైల్ వద్ద లోకేశ్ మీడియాతో మాట్లాడారు. ఏపీలో జంగిల్ రాజ్యం నడుస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో జగన్ పినల్ కోడ్ నడుస్తుందన్నారు. జగన్ ప్యాలస్ పిల్లి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. సమస్యలపై మాట్లాడితే జగన్ పారిపోతున్నారని మండిపడ్డారు. ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ రివర్స్ లో నడుస్తుందన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 2019లో జగన్ సీఎం అయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా 5000 మంది టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టారన్నారు. అశోక్ జగపతి రాజుపై కేసులు పెట్టారని, చెత్త పైన పన్ను వేశారని విమర్శించిన అయ్యన్నపాత్రుడుపై కేసులు పెట్టారన్నారు.
అక్రమ హత్యాయత్నం కేసులో కడప సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డిని కలిసి, పరామర్శించిన అనంతరం విలేఖరులతో మాట్లాడిన శ్రీ నారా లోకేష్, జగన్ రెడ్డి పాలనలో రివర్స్ పోలీసింగ్ నడుస్తుంది అని, బాధితుల పైనే కేసులు పెడుతున్నారని అన్నారు. pic.twitter.com/0EvgIKHg7V
— Telugu Desam Party (@JaiTDP) October 18, 2022
వైసీపీని దింపే వరకు టీడీపీ నేతలు నిద్రపోరు
"ప్యాలస్ పిల్లి జగన్ ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదు. దళితులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టిన ఘనత సీఎం జగన్ ప్రభుత్వానిది. బీటెక్ రవిని అర్ధరాత్రి అరెస్ట్ చేసిన వైసీపీ ప్రభుత్వం. టీడీపీ ప్రొద్దుటూరు ఇన్ ఛార్జ్ ప్రవీణ్ చేసిన తప్పు ఏంటి. ప్రవీణ్ ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు పేరు బెట్టింగ్ రెడ్డి అని మార్చుకోవాలి. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. జైల్లో పెట్టినా టీడీపీ కార్యకర్తలు, నాయకులు భయపడరు. భయం అనేది టీడీపీ బయో డేటాలో లేదు. ప్యాలెస్ పిల్లి జగన్ పెట్టే కేసులకు భయపడం. జగన్ తో పాటు 151 మంది ఎమ్మెల్యేలను గద్దె దింపే వరకు టీడీపీ శ్రేణులు నిద్రపోరు. ప్రొద్దుటూరు లో రాచమల్లు ఓటమికి వీరోచితంగా ప్రవీణ్ పోరాడతారు. 1990 తర్వాత ప్రొద్దుటూరులో ఫ్యాక్షన్ పోయింది."- నారా లోకేశ్
ఎమ్మెల్యే రాచమల్లు ఫ్యాక్షన్ రాజకీయాలు
ఎమ్మెల్యే రాచమల్లు ప్రొద్దుటూరులో ఫ్యాక్షన్ ను పెంచి పోషిస్తున్నారని నారా లోకేశ్ విమర్శించారు. నందం సుబ్బయ్యను హత్య చేసిందేవరో అందరికి తెలుసన్నారు. సొంత చిన్నాన్న హత్య కేసులో ముద్దాయిల్ని ఇంకా పట్టుకోలేకపోయారన్నారు. నిన్న పవన్ కల్యాణ్ ని వైజాగ్ లో అక్రమంగా నిర్బంధించారన్నారు. సొంత నియోజకవర్గంలో బస్టాండ్ కట్టలేని దద్దమ్మ సీఎం జగన్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధితులను వైసీపీ ప్రభుత్వం ఆదుకోలేదని ఆరోపించారు. వరద బాధితులను తన తల్లి భువనేశ్వరి అండగా నిలబడ్డారన్నారు. అమరావతి ఏపీ రాజధాని అని చెప్పిన జగన్ తర్వాత మాట మార్చారన్నారు. ఇప్పుడు జగన్ ఎందుకు యూ టర్న్ తీసుకుని మూడు రాజధానులు అంటున్నారని మండిపడ్డారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేసింది వైసీపీ నేతలే అన్నారు. కానీ టీడీపీ శ్రేణులపై కేసులు పెట్టారన్నారని ఆరోపించారు.