Kadapa Pedda Dargah: ముమ్మరంగా కడప పెద్ద దర్గా ఉర్సు ఏర్పాట్లు, అంజాద్ బాషా ఏం చెప్పారంటే!
Kadapa Pedda Dargah: కడప అమీన్ పీర్ దర్గా (పెద్ద దర్గా) ఉర్సు మహోత్సవానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉత్సవ ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పరిశీలించారు.
Kadapa Pedda Dargah: కడప అమీన్ పీర్ దర్గా (పెద్ద దర్గా) ఉర్సు మహోత్సవానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. నవంబర్ 25 నుంచి నాలుగు రోజుల పాటు ఉర్సు జరగనుంది. ఈ సందర్భంగా ఉత్సవ ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పరిశీలించారు. ఉత్సవాలకు సంబంధించి జిల్లా కలెక్టర్, ఎస్పీలతోపాటు వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వాల్ పోస్టర్లను అధికారులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవంబర్ 25 నుంచి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించనున్నట్లు చెప్పారు.
ఈ ఉర్సు ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని డిప్యూటీ సీఎం తెలిపారు. నవంబర్ 26వ తేదీ గంధం, 27 ఉర్సు, 28 ముషాయిరా ఉంటాయని ఆయన వెల్లడించారు. ఉర్సు ఉత్సవాలకు వేల సంఖ్యలో భక్తులు వస్తారని, ఈ నేపథ్యంలో వారందరికీ కావలసిన అన్ని రకాల ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. కులాలు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా కడప పెద్ద దర్గా ఉర్సు ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఉర్సు సందర్భంగా నిర్వాహకులు అవసరమైన వాటి గురించి అధికారులు, తనకు వివరించారని అంజాద్ బాషా తెలిపారు. వాటిని సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఉర్సు ఉత్సవం కులాలు, మతాలకు అతీతంగా జరుగుతుందని, ఉర్సు అందరి పండుగ అన్నారు. ఈ పండుగను ద్విగ్విజయంగా నిర్వహించుకుందామని పిలుపునిచ్చారు. ఏటా దర్గాకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోందని, గత ఏడాది లోటు పాట్లను అధికమిస్తూ ఈ ఏడాది ఉత్సవాలను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఉర్సు సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు సైతం సహకరించాలని కోరారు.
ప్రత్యేకం ఈ దర్గా
కడప జిల్లాలో అమీర్ పీర్ దర్గా ప్రముఖ దర్శనీయ ప్రదేశం. ఈ దర్గాను పెద్ద దర్గా అని కూడా అంటారు. కడప నగరంలోని నకాష్ వీధిలో ఈ అమీన్ పీర్ దర్గా ఉంటుంది. సుమారు రెండెకరాల విస్తీర్ణంలో నిర్మించబడి పర్యాటకులను ఆకర్షిస్తుంది. ప్రశాంత వాతావరణంలో, కర్జూర వంటి చెట్లతో నిండి అందమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నిండి ఉంటుంది. ఇక్కడికి ప్రపంచం నలు మూలల నుంచి, భక్తులు వస్తుంటారు. వీరిలో ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినిమా తారలు, క్రీడాకారులు ఉంటారు. రంగాలకి చెందిన వారు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తుంటారు. పర్యాటకులు కుల, మత, భాష ప్రాంతం అనే తారతమ్యం లేకుండా తరించి, స్మరించి అక్కడ ఉన్న దైవం ఆశీస్సులు అందుకోవడాన్ని అదృష్టంగా భావిస్తారు.
పెద్ద దర్గాను ఇప్పటి వరకు చాలా మంది ప్రముఖులు దర్శించుకున్నారు. ఇందిరాగాంధీ, పీవీ . నరసింహారావు, సుశీల్ కుమార్ షిండే, నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, నందమూరి తారకరామారావు, మజ్జి తులసీ దాస్, గాయకుడు మహమ్మద్ రఫీ, పంకజ్ ఉదాస్, నారా చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖరరెడ్డి, రాష్ట్ర, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, ఏఆర్ రెహమాన్, ఆమిర్ ఖాన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, అక్షయ్ కుమార్, రజనీకాంత్‌తో పాటు పలువురు దర్గాను దర్శించి పీఠాధిపతుల ఆశీస్సులను పొందారు.