Julakanti Brahma Reddy: "నన్ను కాపాడేందుకు టీడీపీ కార్యకర్తలు చూపిన తాపత్రయం మరువలేను"
Julakanti Brahma Reddy: టీడీపీ శ్రేణులు చూపించిన పట్టుదల, పౌరుషం ఇకపైనా కొనసాగించాలని టీడీపీ ఇంఛార్జీ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అన్నారు. తనను కాపాడేందుకు చూపించిన తెగువ మరవలేనిదన్నారు.
Julakanti Brahma Reddy: మాచర్లలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు చూపించిన పట్టుదల, పౌరుషం ఇకపైనా కొనసాగించాలని నియోజకవర్గ ఇంఛార్జీ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అన్నారు. పార్టీ కార్యకర్తలకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యలకు కాలమే సమాధానం చెబుతుందన్నారు. పోలీసులు పెట్టే కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. శుక్రవారం నాటి ఘటనల్లో టీడీపీ కార్యకర్తలు తనను కాపాడేందుకు చూపిన తాపత్రయం జీవితంలో మర్చిపోలేదని అన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో కార్యకర్తలకు నేరుగా అందుబాటులో ఉండలేకపోతున్నానని.. ఏదైనా ఇబ్బంది ఉంటే రాష్ట్ర పార్టీకి తెలియజేయాలని సూచించారు.
పౌరుషం అంటే ఎదుటి వారి మీద దాడి చేయడం కాదు..
"ప్రజలు చాలా డిసైడెడ్ గా ఉన్నారు. మీ అరాచకాలకు, అన్యాయాలకు స్వస్తి పలకాలి. రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అరాచకాలు లేవు అని చెబుతున్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా. మాచర్ల నియోజక వర్గంలో కానీ, గురజాల నియోజక వర్గంలో కానీ మీ ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని హత్యలు జరిగాయి, ఎన్ని కేసులు పెట్టారు, ఎంత మందిని మీరు వేధించారు.. వీటిపై మాట్లాడేందుకు మీరు సిద్ధమేనా. మాచర్ల నియోజక వర్గంలోని ప్రతీ తెలుగుదేశం కార్యకర్తకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా పట్ల, పార్టీ పట్ల మీకున్న కమిట్ మెంట్ కి అలాగే నిన్న మీరు చూపించిన పట్టుదల, పౌరుషం భవిష్యత్తులో కూడా కొనసాగాలి. పౌరుషం అంటే ఎదుటి వారి మీద దాడి చేయడం కాదు పార్టీ కోసం ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మీరు పౌరుషంగా, ఓపికగా పని చేశారు. నా కోసం, నా ప్రాణాలు కాపాడడం కోసం మీరు పడిన తాపత్రయాన్ని కూడా నేను జీవితాంతం మర్చిపోలేను. మీరు ఎటువంటి భయాందోళనకు గురవ్వాల్సిన అసరం లేదు" అని టీడీపీ పార్టీ మాచర్ల ఇంఛార్జీ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి వ్యాఖ్యానించారు.
"పల్నాడులో పుట్టిన ప్రతీ బిడ్డ ఏదో ఒకరోజు పోలీస్ స్టేషన్ కు పోయి వచ్చినోళ్లే. మనకు ఇన్నీ కొత్తేమీ కాదు. తప్పుడు కేసులు పెట్టినంత మాత్రాన మనం బెదరాల్సిన అవసరం ఏమీ లేదు. భవిష్యత్తు అన్నిటికీ సమాధానం చెబుతుంది. జిల్లా పార్టీతో పాటు రాష్ట్ర పార్టీ కూడా మన పట్ల చాలా కేర్ ఫుల్ గా ఉంది. కచ్చితంగా ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వారిని ఓదార్చడానికి, నష్టాన్ని కూడా పూడ్చడానికి చంద్రబాబు గారు ఉన్నారు. మీరు వైసీపీ తప్పుడు కేసులకు గురైతే భయపడొద్దు. మిమ్మల్ని పోలీస్ స్టేషన్ లో చిత్ర హింసలకు గురి చేస్తే మీరు కోర్టులో హాజరుపరిచినప్పుడు కచ్చితంగా ఆ విషయాన్ని మేజిస్ట్రేట్ కు తెలపండి. మీకు జరిగిన అన్యాయం ఏంటో, మిమ్మల్ని ఏ విధంగా టార్చర్ చేశారో వివరించండి " అని సూచించారు.
మాచర్ల అల్లర్లపై రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు
పల్నాడు జిల్లా మాచర్ల అల్లర్లపై పోలీసులు రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. టీడీపీ మాచర్ల నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బ్రహ్మారెడ్డితో సహా 9 మందిపై సెక్షన్ 307 కింది కేసు నమోదు చేశారు. చల్లా మోహన్ అనే రేషన్ డీలర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసులో బ్రహ్మారెడ్డిని ఏ1 గా చేర్చారు. బ్రహ్మారెడ్డి, బాబూఖాన్ తమపై రాడ్లతో దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారని బాధితులు ఫిర్యాదులో తెలిపారు. వైసీపీ నేత, మాజీ మున్సిపల్ ఛైర్మన్ తురక కిషోర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి, ఇళ్లు, కార్ల ధ్వంసంపై ఎర్రం అన్నపూర్ణమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో కిషోర్ సహా 10 మందిపై సెక్షన్ 323, 448, 143, 147 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.