Tadipatri JC Prabhakar : దిండు దుప్పటితో వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి - టెన్షన్ పడుతున్న తాడిపత్రి అధికారులు !
తాడిపత్రి మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న పనులను ఆపాలని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళనకు దిగారు. పనులు ఆపేంత వరకూ కదలనని ఆయన దిండు, దుప్పటి కూడా తెచ్చుకున్నారు.
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్లతో కలిసి అనంతపురం మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. తాడిపత్రి మున్సిపలిటీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మురుగునీటి కాలువ పనులను తక్షణమే ఆపాలని జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. నిర్మాణ పనులు ఆపేంతవరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. అవసరమైతే ఇక్కడే నిద్రపోతా అంటూ చాప , దిండు ను తెప్పించుకున్నారు. నిజానికి గత రెండు రోజులుగా తెలుగుదేశం కౌన్సిలర్లు తాడిపత్రి మున్సిపల్ కార్యాలయం లో వంటావార్పు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ అధికారులు స్పందించ లేదు.
దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యూహం మార్చి అనంతపురం మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ప్రారంభించారు. తాడిపత్రి మున్సిపలిటీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మురుగునీటి కాలువ పనులను ఆపాలని డిమాండ్ చేయడానికి కారణం... వెడల్పు తగ్గించడమే. డ్రైనేజీ సిస్టం కోసం తాడిపత్రిలో ఎంత జనాభా పెరిగినా.. ఇబ్బంది లేకుండా ఉండేలా.. యాభై ఏళ్ల అవసరాలకు తగ్గట్లుగా మురుగునీటి కాల్వ నిర్మాణాన్ని ప్రతిపాదించారు. అయితే ప్రతిపాదించిన దాని కంటే... తక్కువ వెడల్పుతో అధికారులు పనులు ప్రారంభించారు.
ఎక్కువ వెడల్పుతో నిర్మిస్తే.. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి తోడల్లుడు ఆస్తులు పోతాయన్న ఉద్దేశంతో ఇలా చేస్తున్నారని... జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే బంధువుల కోసం తాడిపత్రి మున్సిపాలిటీ ప్రజలను ఇబ్బంది పెడతారా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. పైగా సరైన పత్రాలు కూడా లేకుండా నిర్మాణాలు చే పడుతుండటం దుర్మార్గమని ఆయన అంటున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన చేస్తూండటంతో.. మున్సిపల్ అధికారులు ఎందుకైనా మంచిదని భద్రత కోసం పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వారు పెద్ద ఎత్తున అనంతపురం మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు కూడా కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పనులు ఆపేంత వరకూ తాను అక్కడ్నుంచి కదలబోనని.. అక్కడే పడుకుంటానని జేసీ ప్రభాకర్ రెడ్డి చెబుతూండటంతో ఏం చేయాలా అని అధికారులు చర్చలు జరుపుతున్నారు.
వాస్తవానికి తాడిపత్రి మున్సిపాలిటీ లో టీడీపీ అధికారంలో ఉంది. మున్సిపాలిటీ కౌన్సిల్ తీర్మానం మేరకు పనులు చేపట్టాలి. కానీ అందుకు భిన్నంగా పనులు చేపడుతున్నారు. మున్సిపల్ చైర్మన్ ఆమోదం లేకుండా కాలువ వెడల్పును తగ్గించి పనులు చేస్తున్నారు. అందుకే.. జేసీ ప్రభాకర్ రెడ్డి చైర్మన్ హోదాలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.