Janasena On CM Jagan : రైతులను కులాల పేరిట విభజించిన ఘనత వైసీపీదే, చిత్తశుద్ధి ఉంటే ఆ నిబంధన తొలగించండి : నాదెండ్ల మనోహర్
Janasena On CM Jagan : సీఎం జగన్ విమర్శలపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఘాటుగా స్పందించారు. ఆ 200 మంది కౌలు రైతుల కాదని సీబీఐ దత్తపుత్రుడు చెప్పగలరా అని ప్రశ్నించారు.
Janasena On CM Jagan : గణపవరం రైతు భరోసా భలో సీఎం జగన్ వ్యాఖ్యలపై జనసేన ఘాటుగా స్పందించింది. ఈ మేరకు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటన జారీ చేశారు. రైతులను మోసం చేయడంలో సీబీఐ దత్తపుత్రుడు జగన్ ను మించినవాళ్లు లేరని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిధులను కలుపుకొంటే ప్రతి రైతుకు రూ.19,500 రావాలని, కానీ కేవలం రూ.13,500 మాత్రమే రైతులకు ఇస్తున్నారన్నారు. ఒక్కో రైతుపై రూ.6 వేలు జగన్ సర్కార్ మిగుల్చుకుంటుందని ఆరోపించారు. రాష్ట్రంలో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం స్పందించిన దాఖలాలు లేవన్నారు. సీఎం జగన్ రైతుల బిడ్డ కాదన్నారు. ఆయన చంచల్‌గూడ బిడ్డ అని అందరికీ తెలుసన్నారు. గణపవరంలో సీఎం హోదాలో సీబీఐ దత్తపుత్రుడు చేసిన ప్రసంగం జనసేన కౌలు రైతు భరోసా యాత్రపై విమర్శలు చేయడానికే అన్నారు. పరిహారం అందని రైతులు ఎందరో ఉన్నారని, సీఎం జగన్ అవగాహనా లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఆ 200 మంది కౌలు రైతుల కాదా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనంతపురం, పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లాల్లో పర్యటించి 200 మంది కౌలు రైతు కుటుంబాలకు అండగా నిలిచారన్నారు. ఆ 200 మంది కౌలు రైతులు కాదని జగన్ రెడ్డి చెప్పగలరా అని ప్రశ్నించారు. పోలీసు రికార్డుల్లో కౌలుకి భూమి తీసుకొని అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నారని క్లియర్ గా నమోదు చేశారన్నారు. అలాంటప్పుడు జీవో 102, 43లను అనుసరించి రూ.7 లక్షల పరిహారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. చాలా కేసుల్లో త్రిసభ్య కమిటీ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నవారి కుటుంబాలను పరామర్శించడంలేదన్నారు. బాధిత కుటుంబాలకు కేవలం రూ.లక్ష పరిహారం ఇచ్చి సరిపెడుతున్నారన్నారు. జనసేన పార్టీ ఆర్థిక సాయం చేసినవారికి సంబంధించిన వివరాలు, పోలీసు రికార్డుల్లో ఏం రాశారో చూపిస్తుందని, తమ దగ్గర అన్ని ఆధారాలున్నాయని నాదెండ్ల మనోహర్ అన్నారు. అప్పుడు సీబీఐ దత్తపుత్రుడు ఏంచేస్తారన్నారు.
చిత్తశుద్ధి ఉంటే ఆ నిబంధన తొలగించండి
వైసీపీ ప్రభుత్వం గత మూడేళ్లుగా రైతులను పట్టించుకోకుండా పరిపాలన సాగిస్తుండడంతో రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారని నాదెండ్ల మనోహర్ అన్నారు. కౌలు రైతు చట్టం ప్రకారం కౌలుకి సాగు చేసుకునే పేదలకు రుణాలు కూడా రాకుండా చేస్తోందని విమర్శించారు. కౌలు రైతులకు అర్హత కార్డులు కూడా రాకుండా చేస్తున్నారన్నారు. దీంతో వారికి బ్యాంకు రుణాలు, పంట నష్ట పరిహారం, బీమా పథకాలు వర్తించడంలేదన్నారు. రైతులను కులాలవారీగా విభజించి లబ్ధి పొందాలనే ఆలోచన చేసిన ఏకైక ప్రభుత్వం వైసీపీది అన్నారు. పవన్ కల్యాణ్ తన కష్టార్జితంలో బాధిత కుటుంబానికి రూ.లక్ష ఇస్తున్నారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. సీఎం జగన్ రైతులపట్ల చిత్తశుద్ధి ఉంటే రైతులను కులాలవారీగా విభజిస్తూ చేసిన నిబంధనను తొలగించారన్నారు.