Pawan Kalyan Tour: పవన్ కల్యాణ్ పర్యటనపై టెన్షన్.. టెన్షన్.. అక్కడ నో ఎంట్రీ అని చెప్పిన పోలీసులు
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి, అనంతపురం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. అయితే పవన్ పవన్ పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది.
పవన్ కల్యాణ్ పర్యటనపై సందిగ్ధత నెలకొంది. పర్యటనకు అనుమతిలేదని అధికారులు చెబుతున్నారు. నేడు పవన్ తూర్పు గోదావరి జిల్లా పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది.. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర పవన్ బహిరంగ సభ జరగాల్సి ఉంది. అయితే పోలీసులు పవన్ సభను అనుమతి నిరాకరణతో బహిరంగ సభ జరిగే ప్రాంతాన్ని మార్చినట్లు తెలుస్తోంది. ఇదే హుక్కంపేట-బాలాజీపేట రోడ్డులో పవన్ శ్రమధానం చేస్తాని ప్రకటించారు జనసేన నేతలు. ఇప్పటికే అధికారులు ఆ గుంతలను పూడ్చివేశారు.
ధవళేశ్వరం ఆనకట్ట రహదారిని పోలీసులు మూసివేశారు. రాజమహేంద్రవరానికి వచ్చే అన్ని మార్గాల్లో పోలీసుల మోహరించారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వాహనాలు తనిఖీ చేసి పంపుతున్నారు. రాజమహేంద్రవరంలో శ్రమదానంలో పాల్గొనడం చట్టవ్యతిరేకమంటూ నోటీసులు జారీ చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో జనసేన పార్టీ శ్రేణులకు పోలీసుల ముందస్తు నోటీసులు ఇచ్చారు. శాంతిభద్రతల దృష్ట్యా అనుమతి లేదని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఏపీలో రోడ్డు మరమ్మతుల కోసం పోరాటం చేసిన జనసేన పార్టీ.. వైసీపీ సర్కార్ కు డెడ్ లైన్ చెప్పిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వానికి జనసేన రోడ్డు మరమ్మతు పనులకు డెడ్లైన్ విధించినప్పటికీ పనులు చేయించకపోవడంతో గాంధీ జయంతి నాడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రోడ్ల మరమ్మతుల కోసం రంగంలోకి దిగుతున్నట్లుగా ప్రకటించారు. ఇవాళ రాజమండ్రిలో ధవళేశ్వరం బ్యారేజ్ పై గుంతలను పూడ్చే శ్రమదానం కార్యక్రమంలో పవన్ పాల్గొంటారని, అలాగే అనంతపురం జిల్లా కొత్తచెరువు లోనూ పవన్ శ్రమదానం నిర్వహిస్తారని ప్రకటించారు. అయితే ధవళేశ్వరం బ్యారేజీ ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో ఉంటుందని, దానిపైన గుంతలను పూడ్చడానికి అనుమతి లేదని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో ధవళేశ్వరం బ్యారేజ్ పైన గుంతలను రాత్రికి రాత్రి పూడ్చడం మొదలుపెట్టారు.
పవన్ కళ్యాణ్ శ్రమదానం కార్యక్రమంలో పాల్గొంటానని ప్రకటించిన రోడ్ల మరమ్మతులకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్న జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లకుండానే, రోడ్ల మరమ్మతు పనులు చేయిస్తున్నారని చెబుతున్నారు. జనసేనాని రాకను అడ్డుకోవడం కోసం ఒకవైపు పోలీసులు అనుమతి ఇవ్వకుండా చేసి మరోవైపు ప్రభుత్వం పరువు గోదారిలో కలవకుండా రక్షించడం కోసం ఆగమేఘాలమీద నాసిరకం పనులతో ధవళేశ్వరం బ్యారేజ్ పై గుంతలు పూడ్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జనసేన పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.
Also Read: Weather Updates: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచన