Janasena Party: పవన్ కళ్యాణ్ నిర్ణయమే ఫైనల్, వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవన్న నాగబాబు
Andhra Pradesh Elections 2024: జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయమే అంతిమం అని పార్టీ ప్రధాన కార్యదర్శి కె నాగబాబు పేర్కొన్నారు.

అమరావతి: జనసేన అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయమే అంతిమం అని జనసేన ప్రధాన కార్యదర్శి కె నాగబాబు తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జనసేన ప్రధాన కార్యవర్గంతో చర్చించిన అనంతరం పవన్ కళ్యాణ్ అభ్యర్థుల విషయంపై ఒక నిర్ణయానికి వస్తారు. ఈ విషయం పార్టీ శ్రేణులు అందరూ అర్థం చేసుకోవాలని నాగబాబు సూచించారు. అధ్యక్షులు ఒకసారి నిర్ణయం తీసుకున్న తరవాత అందుకు విరుద్ధంగా బహిరంగ వేదికలు, మీడియా, సామాజిక మాధ్యమాలలో మాట్లాడితే అది పార్టీ వ్యతిరేక చర్యగా పరిగణిస్తామన్నారు. ఇటువంటి అంశాలపై పార్టీ కాన్ ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ విభాగం బాధ్యులతో చర్చించి, సంబంధిత వ్యక్తులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో నాగబాబు హెచ్చరించారు.





















