Jagan plan B : ప్లాన్ బీ అమలు యోచనలో మాజీ సీఎం జగన్ - ఇక ఢిల్లీ కేంద్రంగానే రాజకీయమా ?
YSRCP : జగన్ రాజకీయ వ్యూహాల్లో ప్లాన్ బిని అమలు చేయాలని ఆలోచిస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా వెళ్లాలనుకుంటున్నట్లుగా ప్రచారం ఊపందుకుంది.
Jagan is thinking of implementing plan B : అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజకీయంపై సస్పెన్స్ నెలకొంది. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన ఆయన మళ్లీ అసెంబ్లీకి హాజరవుతారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఇప్పటి వరకూ వైసీపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశాన్ని కూడా నిర్వహించలేదు. వైసీపీ ఎల్పీ నేతగా ఆయన అధికారికంగా ఎన్నిక కాలేదు. ప్రతిపక్ష నేత హోదాను స్పీకర్ ఇస్తే ఆయన అసెంబ్లీకి వద్దామనుకుంటన్నారని లేకపోతే లేదని గతంలో విడుదల చేసిన లేఖ ద్వారా రాజకీయవర్గాలు ఓ అంచనాకు వచ్చాయి.
ప్లాన్ బీ అమలులో జగన్
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ బీ అమలు చేస్తున్నారని వైసీపీ వర్గాలు అంటున్నారు. ప్రతిపక్ష నేత హోదా లేకుండా అసెంబ్లీలో పెద్దగా సంఖ్యాబలం లేకుండా అవమానాలకు గరవడం తప్ప ప్రయోజనం ఏమీ ఉండదని ప్రస్తుత పరిస్థితుల్లో డిల్లీలో రాజకీయం చేయాలని ఆయన అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. అందుకే ఎంపీగా వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. రాజ్యసభ సభ్యుల ఎవరైనా జగన్ కోసం రాజీనామా చేసినా ప్రయోజనం ఉండదు. ఉపఎన్నిక వస్తే టీడీపీనే ఆ స్థానం గెల్చుకుంటుంది.
ఎంపీగా ఢిల్లీ నుంచి రాజకీయాలు చేసే ఆలోచన
అందుకే జగన్ ఎంపీగా వెళ్లాలంటే ఖచ్చితంగా లోక్ సభకే ఎన్నిక కావాలి. ఇప్పుడు ఉపఎన్నికలు రావాలంటే వైసీపీకి ఉన్న నాలుగు సీట్లలో ఒకరు రాజీనామా చేయాలి. రెండు రిజర్వుడు సీట్ల నుంచి గెలిచిన ఎంపీ సీట్లు ఉన్నాయి కాబట్టి.. కడప, రాజంపేట సీట్లలో ఎవరైనా రాజీనామా చేస్తే జగన్ పోటీ చేసే అవకాశం ఉంది. కడప నుంచి అవినాష్ రెడ్డితోనే రాజీనామా చేయించి..తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి రెండింటికీ ఒకే సారి ఉపఎన్నికలు వచ్చేలా చేయాలని జగన్ అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
విజయమ్మను మళ్లీ గౌరవాధ్యక్షురాలిగా చేస్తారా ?
కాంగ్రెస్ నుంచి జగన్ బయటకు వచ్చిన తర్వాత అలా ఉపఎన్నికలు వచ్చాయి. అప్పుడు రికార్డు మెజారిటీలతో గెలిచారు. ఇప్పుడు మరోసారి గెలవ వచ్చని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా మూడు నెలల తర్వాత అయినా ఇదే వ్యూహాన్ని అమలు చేయాలనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. పులివెందులలో ఎమ్మెల్యేగా అవినాష్ రెడ్డిని కాకుండా తల్లి విజయలక్ష్మిని నిలబెట్టాలని.. అంతే కాక పార్టీ గౌరవాధ్యక్షురాలిగా కూడా నియమించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై ప్రాథమిక స్థాయిలో చర్చలు పూర్తి చేశారని.. ప్లాన్ బీ అమలుకు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అలాంటి చర్చలేమీ జరగలేదంటున్న వైసీపీ వర్గాలు
అయితే ప్రస్తుతం అలాంటి చర్చలేమీ జరగడం లేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతిపక్ష నేత హోదా లేకపోయినా జనం కోసం జగన్ ఎదురునిలబడతారని ఇప్పటికే ప్రకటించారని అంటున్నారు. ఏదైనా ప్రజలకు మేలు చేసేలా సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.