CM Jagan: కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ - రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు
Contract Employees: కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వైద్య, విద్యా శాఖలోని కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించింది.
Andhra Pradesh News: ఎన్నికల వేళ జగన్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో అమలు చేయని వాటిపై దృష్టి పెట్టింది. అప్పట్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు సిద్దమవుతోంది. ఈ క్రమంలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం శుభవార్త అందించింది. fవిద్య, వైద్యశాఖలోని కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు దీనికి సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేసింది. ఈ నిర్ణయంతో 2014 కంటే ముందు నుంచి వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మినెంట్ కానున్నారు. 2014 కంటే ముందు నుంచి ఈ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు దాదాపు 2146 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరందరినీ రెగ్యూలరైజ్ చేశారు. దీనికి సంబంధించి వైద్యశాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు ఇవాళ జీవో జారీ చేశారు.
ఏ విభాగంలో ఎంతమంది?
మొత్తం 2146 కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో 2025 మంది పని చేస్తుండగా.. డీఎంఈ పరిధిలో 66 మంది సేవలు అందిస్తున్నారు. ఇక కుటుంబ సంక్షేమ డిపార్ట్‌మెంట్‌లో 55, ఆయుష్, యునాని విభాగంలో 4 కాంట్రాక్ట్ ఉద్యోగుల పనిచేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో వీరి ఉద్యోగాలు పర్మినెంట్ అయ్యాయి. 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో తాము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామంటూ జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చాలని కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఎన్నికల వేళ వారికి ఇచ్చిన హామీని జగన్ నెరవేర్చారు. జగన్ ప్రభుత్వం నిర్ణయం పట్ల కాంట్రాక్ట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమకు ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు సంతోషంగా ఉందని చెబుతున్నారు.
10,117 కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ
జగన్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా గవర్నమెంట్ ఆఫీసుల్లో దాదాపు 10,117 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీళ్లు కూడా తమను రెగ్యూలరేజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తొలుత కొత్త రాష్ట్రం ఏర్పడిన 2014 జూన్ 2 నాటికి ఐదు సంవత్సరాలు విధుల్లో ఉన్నవారిని రెగ్యూలరైజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆ నిబంధనను ఎత్తివేయాలని, తమను కూడా క్రమబద్దీకరించాలంటూ మిగతా ఉద్యోగులు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం పన:పరిశీలన చేపట్టింది. వీలైనంత మంది ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేయాలనే ఉద్దేశంతో ఐదేళ్ల నిబంధన ఎత్తివేయాలని కేబినెట్‌లో తీర్మానం చేశారు. 2014 జూన్ కంటే ముందు నుంచి డ్యూటీలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ క్రమబద్దీకరించాలని నిర్ణయించారు.
స్పీడ్ పెంచిన జగన్
ఎన్నికల నేపథ్యంలో సంక్షేమ పథకాల అమలుపై జగన్ స్పీడ్ పెంచారు. ఎన్నికల షెడ్యూల్ నాలుగైదు రోజుల్లో రానుందని తెలుస్తోంది. ఈసీ షెడ్యూల్ విడుదల చేసిన మరుక్షణం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ఎలాంటి సంక్షేమ పథకాల నిధులు అకౌంట్లలో జమ చేయడానికి వీలు కాదు. దీంతో గత కొద్ది రోజులుగా వివిధ సంక్షేమ పథకాల నిధులను లబ్ధిదారుల అకౌంట్లలో జగన్ జమ చేస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ వైఎస్సార్ చేయూత నిధులను మహిళల అకౌంట్లలో జమ చేశారు. అనకాపల్లిలో జరిగిన కార్యక్రమంలో కంప్యూటర్ బటన్ నొక్కి డబ్బులను రిలీజ్ చేశారు.