Mangalagiri NRI Hospital : మంగళగిరి ఎన్నారై ఆస్పత్రిలో ఐటీ శాఖ సోదాలు - ఆ ఆస్పత్రి ఎవరిదంటే ?
మంగళగిరి ఎన్నారై మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మెడికల్ సీట్ల కేటాయింపులో అవకతవకలకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
Mangalagiri NRI Hospital : గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్ఆర్‌ఐ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో ఆదాయపు పన్నుశాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన నాలుగు ప్రత్యేక బృందాలు ఈ సోదాలు చేస్తున్నాయి. ఈ సంస్థకు చెందిన డైరక్టర్ల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సోదాల విషయం రాష్ట్ర పోలీసులుక కూడా తెలియనివ్వలేదు. కేంద్ర బలగాల భద్రత ఏర్పాటు చేసుకున్నారు. ఈ దాడుల అంశం సంచలనాత్మకంగా మారింది. ఆస్పత్రిలో మెడికల్ సీట్ల కేటాయింపులో భారీ వసూళ్లు చేశారన్న ఆరోపణలురావడంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఎన్నారై ఆస్పత్రి డైరక్టర్ల మధ్య చాలా కాలంగా వివాదం
ఈ ఆస్పత్రి యాజమాన్యం విషయంలో ఏర్పడిన వివాదం కారణంగా రెండు వర్గాలుగా ఏర్పడి పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. గత ఏడాది జూన్‌లో ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి డైరెక్టర్లు ముక్కామల అప్పారావు, నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్ వర్గాలుగా విడిపోయారు. ఎవరికి వారే తమకు మెజార్టీ డైరెక్టర్ల మద్దతు ఉందంటూ కొత్త కమిటీలను ప్రకటించుకున్నారు. 19 మంది డైరెక్టర్ల మద్దతు ఉందంటూ ముక్కామల.. కొత్త కమిటీ ఏర్పాటు చేయగా, 17 మంది డైరెక్టర్ల మద్దతు ఉందంటూ మరో కమిటీని ఉపేంద్రనాథ్ ఏర్పాటు చేశారు. వీరిలో ముక్కామల అప్పారావు ఆస్పత్రిని ఓ ప్రముఖ కంపెనీకి అమ్మేయాలన్న ప్రతిపాదన పెట్టారు. అయితే ఈ వివాదాల కారణంగా ఆ డీల్ కుదరలేదని తెలుస్తోంది.
నలుగు డైరక్టరలపై నిధుల దుర్వినియోగంలో చార్జిషీట్ దాఖలు చేసిన పోలీసులు
ఆ తర్వాత ఎన్ఆర్ఐ ఆస్పత్రి నిధుల దుర్వినియోగం కేసులో డైరక్టర్లపై పలు కేసులు నమోదయ్యాయి. ఆస్పత్రి డైరెక్టర్లు నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, డాక్టర్ మణి అక్కినేని, ఛీప్ కో ఆర్డినేటింగ్ ఆఫీసర్ ఉప్పల శ్రీనివాసరావు, చీఫ్ పైనాన్సింగ్ ఆఫీసర్ నళిని మోహన్... భారీ మోసానికి పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ ఇన్వాయిస్‌లను తయారు చేసి ఎన్‌ఆర్‌ఐకి చెందాల్సిన నిధులు స్వాహా చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిపై ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి అంతర్గత విచారణ చేపట్టిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఈ అవకతవకలపై ఛార్జిషీటు దాఖలు చేశారు. అయితే ఈ కేసులన్నీ ఆస్పత్రిలో వర్గాల మధ్య ఏర్పడిన వివాదం కారణంగా పలుకుబడితో పెట్టించినవేనని ఇతర వర్గాలు ఆరోపిస్తున్నాయి.
మెడికల్ సీట్ల కేటాయింపులో అవకతవకలపైనా ఆరోపణలు
ఇప్పటికీ ఆస్ప్తరి యాజమాన్యం మధ్య వివాదాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయినప్పటికీ మెడికల్ కాలేజీలో సీట్ల కేటాయింపులో భారీగా అవకతవకలు జరిగినట్లుగా ఫిర్యాదులు రావడంతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలే హైదరాబాద్‌లోని మల్లారెడ్డి కి చెందిన మెడికల్ కాలేజీల్లో సోదాల సందర్భంగా మెడికల్ సీట్ల విషయంలో పెద్ద ఎత్తున డొనేషన్లు స్వీకరించినట్లుగా ఐటీ అధికారులు ఆధారాలు గుర్తించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగా ఐటీ సోదాలు మరోసారి కలకలం రేపాయి.
చంద్రబాబుకు వెంకటేశ్వరస్వామి శాపం, ఆయన్ని చంపాల్సిన అవసరం మాకేంటి? - పేర్ని నాని వ్యాఖ్యలు