What About Three Capitals Bill : ఇవన్నీ సరే.. మూడు రాజధానుల బిల్లు ఉందా ? లేదా ?
మూడు రాజధానుల బిల్లుపై జగన్ వెనుకడగు వేసినట్లేనా ?. లేదా తన స్టైల్లో చివరి రోజైనా బిల్లు పెట్టి పాస్ చేసేస్తారా?
What About Three Capitals Bill : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల తొలి రోజు మూడు రాజధానులపై స్వల్ప కాలిక చర్చ జరిగింది. సీఎం జగన్ మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు ? అవి అతిశయోక్తులా ? నిజాలా ? వైఎస్ఆర్‌సీపీ నేతల వాదనలేంటి ? తెలుగుదేశం పార్టీ వాల్ల విమర్శలేంటి అన్న విషయాలను పక్కన పెడితే ..క్లారిటీ రాని అంశం మాత్రం ఒక్కటి ఉండిపోయింది. అదే మూడు రాజధానుల బిల్లు పెడుతున్నారా లేదా అనేది. అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు పెట్టి తీరుతామని మంత్రి గుడివాడ అమర్నాథ్ చాలా సార్లు చెప్పారు. పెట్టబోతున్నామని ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. కానీ స్వల్పకాలిక చర్చ అనుకున్నప్పుడు కానీ.. ముగిసినప్పుడు కానీ బిల్లు పెడుతున్నామని చెప్పలేదు. కానీ వికేంద్రీకరణే మా విధానమని చెప్పారు. అందుకే సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది.
మూడు రాజధానులు ఎలా ? హౌ ?
మూడు రాజధానుల బిల్లు పెట్టాలని ప్రభుత్వం గట్టిగా అనుకున్నట్లుగా ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి బిల్లు డ్రాప్ట్ కూడా రెడీ అయిందని చెబుతున్నారు. కానీ బిల్లు మాత్రం అసెంబ్లీలో పెట్టలేదు. కానీ ప్రభుత్వం మాత్రం మూడు రాజదానులు తమ విధానం అని.. వికేంద్రీకరణ తమ లక్ష్యం అని నేరుగానే చెప్పారు. కానీ ఎలా అన్నది మాత్రం చెప్పలేక పోయారు. వ్యూహాత్మకంగా చెప్పలేదని అనుకోవచ్చు. ఎందుకంటే మూడు రాజధానులు చేయాలంటే అనేక సమస్యలు ఉన్నాయి. అన్నీ చెప్పి చేయలేరు. వీలైనంత రహస్యంగానే చాలా వరకూ పనులు పూర్తి చేస్తున్నారు. మూడు రాజధానుల విషయంలో గతంలో ప్రభుత్వం వ్యవహరించిన విధానం అంతే ఉంది. చివరి క్షణం వరకూ ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియనివ్వలేదు. అందుకే ఇప్పుడూ అలాగే చేస్తున్నారని అనుకోవచ్చు.
రాజ్యాంగ, న్యాయపరమైన చిక్కులు వస్తాయని వెనక్కి తగ్గారా ?
సాంకేతికంగా, న్యాయపరంగా చూస్తే మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో పెట్టడం అసాధ్యం. ఇప్పటికే రెండు సార్లు బిల్లు పెట్టారు. ఓ సారి శాసనమండలి సెలక్ట్ కమిటీకి పంపినా ఆ విషయాన్ని లెక్కలోకి తీసుకోకుండా మరోసారి బిల్లు పెట్టి ఆమోదించారు. గవర్నర్ ఆమోదించినా న్యాయపరమైన చిక్కులు రావడంతో చివరికి హైకోర్టులో రోజువారీ విచారణ జరుగుతూండగా వెనక్కి తీసుకున్నారు. కానీ ఆ బిల్లుపై పిటిషన్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. అదే సమయంలో రాజధాని రైతులు వేసి పిటిషన్‌లో స్పష్టమైన తీర్పు ఇచ్చిన హైకోర్టు రిట్ ఆఫ్ మాండమస్ ప్రకటించింది. అంటే రాజదాని విషయంలో చట్టసభలకు కూడా మార్చే అధికారం లేదని తేల్చేసిది. ఈ తీర్పు ప్రకారం అసెంబ్లీలో బిల్లు పెట్టడం న్యాయవ్యవస్థ తీర్పును ఉల్లంఘించడం. అదే జరిగితే రాజ్యంగ సంక్షోభం వచ్చినట్లేనని నిపుణుల వాదన.
చివరి రోజైనా పంతం నెగ్గించుకుంటారా ?
సీఎం జగన్ పట్టుదల .. పాలనా శైలి చూసిన ఎవరికైనా.. ఎలాంటి అడ్డంకులు వచ్చినా తర్వాత సంగతి ముందుగా మూడు రాజధానుల బిల్లు పాస్ చేసుకుంటారన్న అభిప్రాయం కలుగుతుంది. ఇప్పుడు కూడా అదే కలుగుతుంది. తర్వాత కోర్టుల్లో తేలిపోతుందా నిలబడుతుందా అన్న సంగతి తర్వాత ముందుగా శానసవ్యవస్థకు.. బిల్లు చేసే అధికారం ఉందని జగన్ నిరూపించే అవకాశం ఉందంటున్నారు. గతంలో ఇదే అంశంపై అసెంబ్లీలో జగన్ ప్రత్యేక చర్చ నిర్వహించారు. న్యాయవ్యవస్థ.. శాసన వ్యవస్థలోకి చొచ్చుకు వస్తుందని దీనికి అంగీకరించబోమని తీర్మానం కూడా చేశారు. ఇప్పుడు చివరి రోజు అసెంబ్లీ సమావేశాల్లో అయినా దీన్ని నిజం చేస్తారేమో చూడాలి. మొత్తానికి మూడు రాజధానుల బిల్లు అనేది ఇంకా లైవ్‌లోనే ఉంది. ఎప్పుడు ఎలాంటి మలుపులైనా తిరగవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.