AB Venkateswar Rao : సస్పెన్షన్ ముగిసింది , పూర్తి జీతం ఇవ్వండి - ఏపీ సీఎస్‌కు ఏబీవీ లేఖ !
సస్పెన్షన్ కాలం ముగిసినందున పూర్తి జీతం ఇవ్వాలని ప్రభుత్వానికి ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు లేఖ రాశారు. లేఖలో సస్పెన్షన్ నిబంధనలను గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు లేఖ రాశారు. నిబంధనల ప్రకారం తన సస్పెన్షన్ కాలం ముగిసిందని... తనకు పూర్తి జీతం వెంటనే ఇవ్వాలని ఆ లేఖలో కోరారు. ఏబీ వెంకటేశ్వరరావు టీడీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ గా పని చేశారు. ఆయనకు ప్రస్తుతం డీజీపీ హోదా ఉంది. గత రెండేళ్లుగా ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారు. అంతకు ముందు ఆరేడు నెలల పాటు ఆయనకు పోస్టింగ్ లేదు. తాను సస్పెన్షన్‌లో రెండేళ్లుగా ఉన్నానని .. తన సస్పెన్షన్ కాలం ముగిసిందని ... అందుకే తనకు పూర్తి జీతం ఇవ్వాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.
ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారం మేరకు సస్పెన్షన్ విధించారని ఇక ప్రభుత్వానికి అధికారం లేదని ఏబీవీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. సస్పెన్షన్‌కు 2022 ఫిబ్రవరి 8తో రెండేళ్లు పూర్తైన కారణంగా.. రూల్ ప్రకారం సస్పెన్షన్ ఆటోమేటిక్‌గా తొలగిపోయినట్టేనన్నారు. తన సస్పెన్షన్‌పై పొడిగింపు జనవరి 27తోనే ముగిసిందని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రెండేళ్లకు మించి సస్పెన్షన్‌ను కొనసాగించాలంటే.. కేంద్ర హోంశాఖ అనుమతి తప్పనిసరి అని ఏబీవీ వెంకటేశ్వరరావు గుర్తు చేశారు. గడువులోగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అనుమతి తీసుకోలేదని వెల్లడించారు. 31 .7 .2021న చివరిసారిగా తన సస్పెన్షన్‌ను పొడిగిస్తూ ఇచ్చిన.. జీవోను రహస్యంగా ఉంచారని.. తనకు కాపీ కూడా ఇవ్వలేదని లేఖలో తెలిపారు. ఏమైనప్పటికీ ఫిబ్రవరి 8తో తన సస్పెన్షన్ ముగిసినట్టేనని ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును డిస్మిస్ చేయాలని గత ఆగస్టులో కేంద్రానికి సిఫార్సు చేసంది. నిఘా పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో పాటు కొందరు అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడి సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయనపై ప్రభుత్వం అభియోగాలు మోపింది. ఎంక్వైరీస్ ఆఫ్ కమిషనర్ నేతృత్వంలో విచారణ కూడా పూర్తయింది. ఆ రిపోర్టును సుప్రీంకోర్టుకు సమర్పించారు. ఇవన్నీ విచారణలో ఉండగానే.. ఏబీవీపై మేజర్ పెనాల్టీ అంటే డిస్మిస్ చేయాలని ఆయన సర్వీసులో కొనసాగేందుకు అనర్హుడని, ఆయన్ను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫార్సును, అభియోగ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాక... యూపీఎస్‌సీ అభిప్రాయాన్ని కూడా తీసుకుని కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. ఇప్పటి వరకూ అలాంటి నిర్ణయం రాలేదు. దీంతో ఇప్పుడు ఏబీవీ లేఖపై ప్రభుత్వం ఏం చేస్తుందనే ఆసక్తి అధికారవర్గాల్లో ఏర్పడింది.