Dussehra 2023: ఇంద్రకీలాద్రిపై 2 రూపాల్లో దుర్గమ్మ దర్శనం - చివరి అంకానికి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం
Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి. చివరి రోజు అమ్మవారు మహిషాసుర మర్దిని, రాజరాజేశ్వరి రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు సోమవారంతో ముగియనున్నాయి. ఉత్సవాల చివరి రోజైన ఈ రోజు అమ్మవారు రెండు రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆదివారం దుర్గాదేవి రూపంలో అమ్మ భక్తులకు అభయమివ్వగా, ఉదయం నుంచే భారీగా భక్తులు తరలివచ్చారు. సోమవారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది.
2 రూపాల్లో దర్శనం
ఉత్సవాల చివరి రోజైన సోమవారం అమ్మవారు ఉదయం మహిషాసురమర్దనిగా, మధ్యాహ్నం నుంచి రాజరాజేశ్వరీ దేవి రూపంలో భక్తులకు అభయమివ్వనున్నారు. ఒకే రోజు రెండు తిథులు రావడంతో 2 అవతారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని అర్చకులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు.
తెప్పోత్సవానికి ఏర్పాట్లు
మరోవైపు, కృష్ణా నదిలో దుర్గామల్లేశ్వరుల తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. అటు, దసరా ఉత్సవాలు ముగుస్తుండడంతో భవానీ మాలలు ధరించిన భక్తుల రాక పెరిగింది. దసరా ముగిసిన తర్వాత కూడా 2 రోజులు పాటు భవానీలు తరలిరానున్నారు.
తుది అంకానికి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
అటు, తిరుమలలోనూ శ్రీవారి బ్రహ్మోత్సవాలు తుది అంకానికి చేరుకున్నాయి. దీనిలో భాగంగా చివరి రోజైన సోమవారం వరాహ పుష్కరిణిలో స్వామి వారి చక్ర స్నానం వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి ప్రతినిధిగా చక్రత్తాళ్వార్ కు అర్చకులు స్నపన తిరుమంజనం, అభిషేకం నిర్వహించారు. చక్రస్నానం తర్వాత ఆనంద నిలయానికి స్వామిని చేర్చారు. అనంతరం భక్తులు శ్రీవారి పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించారు. అంతకు ముందు తెల్లవారుజామున వెంకటేశునికి పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ముద్రించిన 6 పేజీల ప్రత్యేక క్యాలెండరును ఛైర్మన్ భూమన, ఈవో ధర్మారెడ్డి అశ్వ వాహనం ఎదుట ఆవిష్కరించారు. రూ.450 విలువైన ఈ క్యాలెండరునును 50 వేల కాపీలను టీటీడీ ముద్రించింది. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మలయప్ప స్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వర్ణ రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. మాఢ వీధుల్లో స్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
సర్వ దర్శనానికి 8 గంటల సమయం
దసరా పండుగ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శ్రీవారి సర్వ దర్శనానికి 12 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 77,187 మంది భక్తులు దర్శించుకోగా, 29,209 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.06 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.