Pawan Kalyan: పులుల సంఖ్య, అడవులపై ఫోకస్ పెట్టిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Deputy CM Pawan Kalyan : టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. భారతీయ సంస్కృతిలో ప్రతి ప్రాణి భాగమే అన్నారు.
Pawan Kalyan:మానవాళి మనుగడ, సర్వజీవుల సుఖజీవనానికి ప్రకృతి వనరులను రక్షించుకోవాలన్నది పెద్దల మాట. భారతీయ వేదాలు, పురాణాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. వృక్షాలను దేవతలుగా పూజించి.. ఆదరించే సాంప్రదాయం మనది. అలాగే అడవిలోని వన్యప్రాణులను కూడా కాపాడుకోవాలి. అడవిలో ఉండే పులులను కాపాడితే అవే అడవులను కాపాడుతాయి. తద్వారా పచ్చదనం పెరిగితే పర్యావరణ సమతౌల్యం అవుతుందని ఏపీ డిప్యూటీ సీఎం, పర్యావరణ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలోని టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. పులుల సంఖ్య పెంచే దిశగా సంరక్షణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గ్లోబల్ టైగర్ డే సందర్భంగా సోమవారం ఉదయం మంగళగిరిలోని అరణ్య భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్లోబల్ టైగర్ డే పోస్టర్ విడుదల చేశారు. బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్.వి.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) ఏర్పాటు చేసిన టైగర్స్ ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు. రాష్ట్రంలో పులుల సంఖ్య, అభయారణ్యంలో తీసుకోవలసిన భద్రత చర్యలపై పవన్ సమీక్షించారు.
అడవులు సంస్కృతితో భాగం
ఈ సందర్భంగా మంత్రి పవన్ మాట్లాడుతూ.. “భారతీయ సంస్కృతిలో ప్రతి ప్రాణి వసుదైక కుటుంబంలోకే వస్తుంది. అడవులు మన సంస్కృతిలో భాగం. అక్కడుండే ప్రాణులు కూడా మనకు ఎంతో అవసరం. వాటి సంరక్షణ బాధ్యతలు మనమే చేపట్టాలి. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ20 సమయంలో వసుదైక కుటుంబం గురించి మాట్లాడుతూ ప్రకృతిలో భాగమైన చెట్లు, జంతుజాలం, క్రిమికీటకాలు.. అన్నీ వసుదైక కుటుంబంలో భాగమే అన్నారు. వాటిని కూడా మనం కాపాడుకోవాలన్నారు. అటవీశాఖా మంత్రిగా రాష్ట్రంలోని అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు నేను పూర్తిగా కట్టుబడి ఉన్నాను. అధికారులు సైతం ఇదే లక్ష్యంతో పని చేయాలి. అరణ్యాల్లో బతికే వన్యప్రాణులు, వాటి రక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. అక్రమంగా పులుల్ని వేటాడే వారిపైనా, స్మగ్లింగ్ కి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
నా ఇళ్లే చిన్న పాటి అడవి
వన్య ప్రాణి పరిరక్షణ చట్టం, అటవీ పరిరక్షణ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. వసుధైక కుటుంబం అంటే మనుషులతోపాటు పశుపక్షాదులు, చెట్లు, జంతువులు కూడా ఉండాలి. నేను రాజకీయ నాయకుడి కంటే ముందు ప్రకృతి సంరక్షకుడిని. నా ఫాం హౌస్ లో నేను ఎటువంటి క్రిమి సంహారక మందులు వాడకుండా సహజంగా పెరిగే మొక్కలు, చెట్లు, కీటకాలు పెరిగేలా చర్యలు తీసుకున్నాను. హైదరాబాద్ లో నేను ఉండే 1400 చదరపు గజాల ఇంటి ఆవరణలోనూ సహజంగా పెరిగే ఏర్పాటు చేస్తే చిన్నపాటి అడవిలా తయారైంది.
నల్లమల శివ, చిగుళ్ల మల్లికార్జున్ ల మాటలు కదిలించాయి
నల్లమల అడవుల్లో చెంచులు పులులు వారి సంస్కృతిలో అంతర్భాగం అని పేర్కొంటారు. కొన్నేళ్ల కింద.. నల్లమల ప్రాంతానికి చెందిన చెంచు జాతికి చెందిన 16 ఏళ్ల శివ అనే కుర్రాడు హైదరాబాద్ లో మా ఆఫీస్ దగ్గరకి వచ్చాడు. అతనితో మాట్లాడినప్పుడు పర్యావరణ పరిరక్షణ మీద చెంచులకి ఉన్న నిబద్దత అర్థమైంది. అతను నా దగ్గరకు వచ్చిన పని నల్లమలలో యురేనియం మైనింగ్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే జరిగితే అడవులు పోతాయి. పులులు చచ్చిపోతాయి. నల్లమల విధ్వంసానికి గురవుతుంది. ఎవరికి చెప్పుకోవాలో.. నా మాట ఎవరు వింటారో తెలియక మీ దగ్గరకు వచ్చాను. ఏదైనా చేయండి అన్నారు. అప్పుడే కాంగ్రెన్ నాయకులు వి. హనుమంతరావుకి చెప్పి నల్లమలలో యురేనియం అన్వేషణపై అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాము. ఆ సమావేశంలో చిగుళ్ల మల్లికార్జున్ అనే చెంచుల ప్రతినిధి మాట్లాడిన మాటలు నన్ను కదిలించాయి. ‘నల్లమలలో ఉన్న చెట్లు, జంతువులు, వాగులు అన్నింటినీ మేము దేవతలుగా కొలుస్తాం. పెద్ద పులి అంటే పెద్దమ్మ దేవర, ఎలుగుబంటిని లింగమయ్యగా చూస్తాం. అడవి పందిని గూబల మస్సి, గారెల మస్సి, బంగారు మైసమ్మ అని పిలుచుకుంటాం. రేసు కుక్క మల్లికార్జునుడి భార్య మా బవరమ్మగా కొలుస్తాము. తేనెలో ఉండే తెల్లగడ్డను మల్లమ్మ అంటాం’ అని అక్కడ తమ ఆచార వ్యవహారాలను, జీవితాన్ని గురించి వివరించారు.
పని చేసిన అధికారులకు గుర్తింపు
అంతర్జాతీయ పులుల దినోత్సవం రోజు అధికారులకు మాటిస్తున్నాను. ఇక్కడ ఎంతో నిబద్దత కలిగిన అధికారులు ఉన్నారు. అద్భుతంగా పని చేసిన కొంత మంది అధికారులకు గుర్తింపు రాలేదన్న విషయం నాకు తెలిసింది. గుర్తింపు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు చేసిన పని పది మందికి తెలిస్తే అది భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుంది. అవసరం అయితే అధికారులు చెప్పిన విధంగా పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో జూ పార్కులు అభివృద్ధి చేద్దాం. ముఖ్యమంత్రితో మాట్లాడి అటవీ శాఖకు బడ్జెట్ పెంచే విధంగా, ఉద్యోగుల కొరత భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం.
శ్రీశైలం నుంచి శేషాచలం వరకూ అటవీ కారిడార్
పెద్ద పులుల సంఖ్యను పెంచేందుకు ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకుంటాం. నల్లమల, శ్రీశైలం నుంచి శేషాచలం వరకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేసి అడవులను పెంచేందుకు కృషి చేస్తాము. టైగర్ రిజర్వ్ పరిధిలో ఉన్న పులుల సంరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుందాం. అటవీ ప్రాంతాల్లో స్థానికులకు జంతుజాలం ఆవశ్యకతపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలి. అదే విధంగా శ్రీశైలం క్షేత్ర పరిసరాల్లోని అడవుల్లో ప్లాస్టిక్ వినియోగం పెరుగుతోందని అధికారులు నా దృష్టికి తీసుకువచ్చారు. పర్యావరణహితమైన ఆధ్యాత్మిక యాత్రలు చేసేలా భక్తులకు అవగాహన కల్పించాలి” అని అధికారుత సమావేశంలో పవన్ కళ్యాణ్ అన్నారు.