BJP Janasena : బీజేపీతో కలిసి జనసేన పంచాయతీ పోరు - ఇక కలసి పోరాటాలు చేస్తారా ?
తిరుపతిలో జనసేనతో కలిసి బీజేపీ పంచాయతీ పోరులో పాల్గొంది. చాలా కాలం తర్వాత రెండు పార్టీలు కలిసి ఆందోళనల్లో పాల్గొనడం ఇదే మొదటి సారి.
BJP Janasena : ఏపీలో బీజేపీ, జనసేన మధ్య పొత్తులు ఉన్నా రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నది లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. జనసేన నేతలు కూడా బీజేపీ ధర్నాల్లో పాల్గొంటున్నారు. సర్పంచ్‌లకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించి నిధుల దుర్వినియోగానికి పాల్పడటంపై బీజేపీ మహాధర్నాకు దిగింది. తిరుపతిలో బీజేపీ మహాధర్నాలో జనసేన నేతలు పాల్గొన్నారు. చాలా కాలం తర్వాత మొట్ట మొదటిసారి బీజేపీతో కలిసి నిరసనలో జనసేన పాల్గొంంది. గురువారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డితో పాటు, ఉభయ పార్టీల నేతలు తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన చేస్తూ రాస్తారోకో చేసేందుకు ప్రయత్నించారు. ధర్నాలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోలా ఆనంద్‌తో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన సహా మరో పలువురు పాల్గొన్నారు.
జనసేన - బీజేపీ కలిపి తిరుపతి ఉపఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. అయితే అనుకున్న ఫలితం రాలేదు. ఆ తర్వాత నుంచి రెండు పార్టీలు ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాయి. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ పోటీ చేసినప్పటికీ..త జనసేన పార్టీ బహిరంంగంగా మద్దతు ప్రకటించలేదు. అదే సమయంలో జనసేన పార్టీ.. ఓట్లు చీలనివ్వబోమని ఇతర పార్టీలతో కూటమి ఏర్పాటు చేస్తామని చెబుతూ వస్తోంది. మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో ఇటీవల పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి చర్చించారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నందున రెండు పార్టీలు కలిసి ప్రభుత్వంపై పోరాటం చేయాలని బీజేపీ అగ్రనేతలు సూచించారు. ఈ మేరకు జనసేన అగ్రనాయకత్వం నుంచి కింది స్థాయి నేతలకు సూచనలు అందినట్లుగా తెలుస్తోంది.
బీజేపీ కొత్త అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన పురందేశ్వరి జనసేనతో సమన్వయం చేసుకుంటామని చెబుతూ వస్తున్నారు. ఇప్పటి వరకూ ఢిల్లీ పెద్దలు తప్ప.. రాష్ట్ర బీజేపీ నాయకులతో పెద్దగా సంబంధాలు లేవని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదేపదే చెబుతుంటారు. అంతేకాదు బీజేపీ-జనసేన కలిసి రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనలేదు. ఒక్క తిరుపతి ఉపఎన్నికల్లో తప్ప.. ఆ తర్వాత రెండు పార్టీలు కలిసి నిర్వహించిన కార్యక్రమాలు కూడా లేవు. కానీ ఇకపై అలా ఉండదని ఇటీవల ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రకటించారు.
జనసేన తమకు మిత్రపక్షమని.. ఆపార్టీతో ఇకపై రెగ్యులర్ గా సంప్రదింపులు, ఉమ్మడి కార్యాచరణ కూడా ఉంటుందని పురంధేశ్వరి స్పష్టంచేశారు. ఏపీ బీజేపీ చీఫ్ గా ఇప్పటికే బాధ్యతలు చేపట్టిన తర్వాత.. పవన్ కళ్యాణ్ తో ఫోన్లో మాట్లాడానని చెప్పిన పురంధేశ్వరి.. త్వరంలో నేరుగా భేటీ అవుతానని అన్నారు. అయితే, ప్రభుత్వంపై పోరాటాల విషయంలో ఎవరికి వారు విడివిడిగా ఉద్యమాలు చేసినప్పటికీ.. సమయానుసారం కలిసి ముందుకెళ్తామన్నారు. వేర్వేరుగా ప్రజా ఉద్యమాల ద్వారా పార్టీలు బలోపేతం చేసుకోవల్సి ఉందన్నారు. ఆ ప్రకారం ఇప్పుడు జనసేన పార్టీ బీజేపీతో కలిసి పోరాటాల్లో పాల్గొంటోందని అంచనా వేస్తున్నారు.