Vangalapudi Anitha: '3 నెలల్లోనే నిందితునికి కఠిన శిక్ష పడేలా చేస్తాం' - తిరుపతి బాధిత చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి అనిత
Tirupati News: తిరుపతి జిల్లా వడమాలపేటలో హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబాన్ని హోంమంత్రి అనిత పరామర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల ఆర్థికసాయాన్ని అందజేశారు.
Home Minister Anitha Visited Tirupati Victim Family: తిరుపతి జిల్లా వడమాలపేటలో చిన్నారిని హత్యాచారం చేసిన నిందితునికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి 3 నెలల్లోనే కఠిన శిక్ష పడేలా చేస్తామని రాష్ట్ర హోంమంత్రి అనిత (Vangalapudi Anitha) స్పష్టం చేశారు. బాధిత కుటుంబాన్ని ఆమె ఆదివారం పరామర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల ఆర్థికసాయాన్ని వారికి అందజేశారు. అంతకుముందు చిన్నారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. చిన్నారి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
'బుద్ధున్న వారు రాజకీయం చేయరు'
'చిన్నపిల్లకు అన్యాయం జరిగింది. తాగిన మత్తులో తల్లి, చెల్లికి తేడా తెలియదా.?. పండుగ అని ఇంటికి వస్తే అడుకునే చిన్నారిని ఇలా చేశారు. తొలుత చిన్నారి కనిపించడం లేదని 100కు ఫోన్ వచ్చింది. వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. కానీ చిన్నారిని ప్రాణాలతో రక్షించలేకపోయారు. ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసి 3 నెలల్లోనే నిందితునికి కఠిన శిక్ష పడేలా చేస్తాం. ఇలాంటి సమయంలో బుద్ధి ఉన్న వారు ఎవరూ రాజకీయం చేయరు. ఇటీవల పుంగనూరులోనూ డబ్బుల విషయంలో చిన్నారిని చంపేశారు. చిన్నపిల్లల మరణాలను రాజకీయంగా వాడుకునే రాబందులు ఉన్నారు. గత ఐదేళ్లలో ప్రతీ 8 గంటలకు ఓ దాడి జరిగింది. దిశ చట్టం యాప్ ఉంటే ఇలాంటివి జరగవని వైసీపీ నేతలు అంటున్నారు. మేము మహిళా యాప్ వృద్ధిలోకి తెచ్చాం.' అని తెలిపారు.
'వైసీపీ గత ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థను ఐదేళ్లుగా నిర్వీర్యం చేశారు. కనీసం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయలేదు. యువతను గంజాయికి బానిసను చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 నెలల్లోనే గంజాయిని అదుపు చేశాం. పూర్తిగా కంట్రోల్ చేసేందుకు నార్కోటిక్ వ్యవస్థ ఏర్పాటు చేశాం. ఇలాంటి హత్యాచార ఘటనలకు సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. బాధితుల పక్షాన నిలబడడమే కాదు, ఎలాంటి సంఘటనలు జరగకుండా మహిళలకు అండగా చర్యలు తీసుకుంటున్నాం. మహిళా సాధికారత, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోంది. గత ఐదేళ్లలో పోలీసు వ్యవస్థను వైసీపీ నిర్వీర్యం చేసింది. ఈ ఘటనను రాజకీయం చేయడం విడ్డూరం. ఎక్కడ ఘటన జరిగినా ప్రభుత్వం వెంటనే స్పందిస్తోంది. చంద్రబాబు ప్రతి ఆడబిడ్డను సొంత బిడ్డగా చూస్తున్నారు. వైసీపీ హయాంలో మద్యం ఏరులై పారింది. అప్పుడు రోజాకు తెలియలేదా..?. మద్యంపై రోజా చేస్తున్న రాద్ధాంతం హాస్యాస్పదం.' అంటూ అనిత మండిపడ్డారు.
ఇదీ జరిగింది
తిరుపతి జిల్లా వడమాలపేటకు చెందిన దంపతులు కొన్నాళ్లుగా ఇక్కడే ఉండి కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి మూడున్నరేళ్ల కుమార్తె, ఏడాదిన్నర కుమారుడు ఉన్నారు. వీరికి ఇంటి సమీపంలోనే ఉంటున్న సుశాంత్ అలియాస్ నాగరాజు (23)కు తల్లిదండ్రులు లేరు. పెదనాన్న వద్ద పెరిగినా వ్యసనాలకు బానిస కావడంతో అతన్ని ఇంటి నుంచి గెంటేశారు. దీంతో చెంచయ్య కుమారుడు వెంకటేశ్ వద్ద సుశాంత్ ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం ఇంటి సమీపంలో ఆడుకుంటోన్న పాపకు చాక్లెట్లు కొనిస్తానని తీసుకెళ్లాడు. పాప అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారి విచారించి నిందితున్ని పట్టుకున్నారు. పాపపై దారుణానికి ఒడిగట్టి మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు అంగీకరించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Kurnool News: ‘డెలివరీ కోసం వెళితే ప్రాణం తీశారు’ - హాస్పిటల్ ఎదుట కుటుంబసభ్యుల ఆందోళన