Sangam Dairy : సంగం డెయిరీ పాలకవర్గంపై పెట్టిన కేసుపై హైకోర్టు స్టే !
సంగం డెయిరీ పాలకవర్గం కరోనా నిబంధనలు ఉల్లంఘించి సమావేశాన్ని నిర్వహించిందంటూ పోలీసులు పెట్టిన కేసుపై హైకోర్టు స్టే విధించింది.
సంగం డెయిరీ పాలకవర్గంపై పోలీసులు పెట్టిన కేసుపై హైకోర్టు స్టే ఇచ్చింది. దీనికి సంబంధించి తాము చెప్పే వరకూ తదుపరి చర్యలు నిలిపివేయాలని ఆదేశించింది. సంగం డెయిరీకి సంబంధించి ధూళిపాళ్ల నరేంద్రతో పాటు మరికొంత మందిని అరెస్ట్ చేసిన కేసుకు ప్రస్తుతం హైకోర్టు స్టే ఇచ్చిన కేసుకు సంబంధం లేదు. ఇది కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసు. ఈ ఏడాది మే 29న విజయవాడలోని ఓ హోటల్‌లో సంగం డెయిరీ పాలకమండలి సమావేశం జరిగింది. అప్పట్లో కొవిడ్ లాక్‌డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి ఒకే చోట 20 మంది సమావేశమయ్యారని విజయవాడ పడమట పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.
ఐపీసీ 188, 269, 270 సెక్షన్లతో పాటు మహమ్మారి వ్యాధుల చట్టం కింద సంగం డెయిరీ ఛైర్మన్ సహా 20 మందిని నిందితులుగా చేర్చారు. సమావేశం జరిగింది ధూళిపాళ్ల నరేంద్రకు బెయిల్ వచ్చిన తర్వాత. ఆయన నెల రోజుల పాటు విజయవడాలోనే ఉండాలని కోర్టు నిబంధన పెట్టింది. ఈ కారణంగా విజయవాడలోని ఆస్పత్రిలో సంగం డెయిరీ పాలక మండలి సమావేశాన్ని నిర్వహించారు. కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. పాలక మండలి సమావేశం జరిగిన దాదాపుగా వారం రోజుల తర్వాత పోలీసులే సుమోటోగా కేసు నమోదు చేశారు. సమావేశం జరిగినప్పుడు ఏ పోలీసులు అడ్డు చెప్పలేదు.
Also Read : పవన్‌కు అనుకూలమా ? వ్యతిరేకమా ? . "మా" ఎన్నికల అజెండా సెట్ చేసిన మంచు విష్ణు !
వారం రోజుల తర్వాత దీనిపై ఎస్ఐ ఫిర్యాదు చేస్తే.. ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, పాలకవర్గ సభ్యులపై ఐదు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. పోలీసులు విచారణకు పిలిస్తే కంపెనీ సెక్రటరీ వెళ్లి అన్నీ నిబంధనలు పాటించామని రాత పూర్వకంగా వివరణ ఇచ్చి వచ్చారు. 12 మంది పాల్గొంటే.. హోటల్లో 30 భోజనాలకు బిల్లు కట్టారని.. పోలీసులు ఆధారాలు చూపించారు. డ్రైవర్లకు కూడా భోజనాలు పెట్టించారని సంగం డెయిరీ సిబ్బంది సమాధానం ఇచ్చారు. కరోనా నిబంధనలను పాటించినట్లుగా ఆధారాలు సమర్పించారు. అయితే వేధించడానికే ఉద్దేశపూర్వకంగానే కేసు పెట్టారని సంగం డెయిరీ పాలక వర్గం హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన హైకోర్టు స్టే విధించింది.