AP Projects:దంచికొడుతున్న వానలు...కళకళలాడుతున్న ప్రాజెక్టులు
సీజన్ మొత్తం కురవాల్సిన వానలు రెండు వారాల్లో దంచికొట్టాయి. భారీగా వరదనీరు చేరి ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. ఇప్పటికే ఆయా ప్రాజెక్టుల్లో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా వరదనీరు చేరడంతో ఆంధ్రప్రదేశ్ లో ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. శ్రీశైలం, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్, ధవళేశ్వరం వద్ద వరద ఉద్ధృతి కొనసాగుతోంది. అప్రమత్తమైన అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.
గుంటూరు జిల్లా పులిచింతల ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో ముందస్తు జాగ్రత్తగా అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు. ప్రాజెక్టులోకి 62వేల క్యూసెక్కులకుపైగా వరద నీరు వచ్చి చేరుతోంది. అందుకే ప్రస్తుతం మూడు గేట్లు ఎత్తిన అధికారులు 52వేల 393 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం 10 వేల క్యూసెక్కుల నీరు డైవర్ట్ చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు. ప్రస్తుతం ఇందులో 44.03 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దిగువకు నీరు విడుదల చేస్తున్నందున కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
శ్రీశైలానికి కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలానికి 87వేల521 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. 885 అడుగులు నీటి మట్టం ఉన్న శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 847.60 అడుగుల నీరు ఉంది. 215 అడుగులు నీటి నిల్వ కెపాసిటీ ఉన్న ప్రాజెక్టులో ప్రస్తుతం 74.9770 టీఎంసీల నీరు స్టోర్ అయి ఉంది. ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేసి నాగార్జున సాగర్‌కు 28వేల252 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
కృష్ణా జిల్లాలో వరదల ఉద్ధృతికి పొంగుతున్న వాగుల ద్వారా.. ఎగువ నుంచి కృష్ణానదికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. దీనితో ప్రకాశం బ్యారేజీలో పెరిగిన నీటిమట్టం పెరిగింది. పులిచింతల, మున్నేరు, పాలేరు, కట్లేరువాగు నుంచి భారీగా వరద ప్రవాహం వస్తోంది. 44,250 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ ఇన్‌ఫ్లో 33,061 క్యూసెక్కులు కాగా.. ఔట్‌ఫ్లో 31,500 క్యూసెక్కులుగా ఉంది. కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మున్నేరులో ప్రమాదకర స్థాయిలో నీరు ప్రవహిస్తోంది. పోలంపల్లి ఆనకట్ట వద్ద 12.5 అడుగుల నీటిమట్టం ఉండగా..50 వేల క్యూసెక్కుల నీరు కిందకి వెళ్తోంది.
గోదావరిలో పెరిగిన వరద ప్రవాహంఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరిలో నీటి ఉద్ధృతి పెరిగింది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 8.5 అడుగుల నీటిమట్టం ఉంది. పంట కాల్వలకు 2 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. లక్షా 10 వేల క్యూసెక్కులకు పైగా నీరు సముద్రంలోకి వెళుతోంది. వరద ప్రవాహం ఎక్కువ అవడంతో.. పోలవరం నిర్వాసిత ప్రాంతాల ప్రజలు భయపడుతున్నారు. ఇప్పటికే దేవిపట్నంలోని పరిసర గ్రామాలు నీటమునిగాయి.