Guntur Janasena : గతంలో చించుకున్న మంత్రులు గొడ్ల చావిళ్లకు పరిమితం- మంత్రులపై జనసేన నేతలు ఫైర్
Guntur Janasena : పవన్ కల్యాణ్ రోడ్డుపైకి వస్తే జగన్ భయపడుతున్నారని గుంటూరు జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. పవన్ ను తిట్టేందుకే కొందరికి మంత్రి పదవులు ఇచ్చారన్నారు.
Guntur Janasena : పవన్ కల్యాణ్ తిట్టేందుకు సీఎం జగన్ కొందరికి మంత్రి పదవులు ఇచ్చారని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు విమర్శించారు. విమర్శలు చేసే వైసీపీ నాయకులకు దమ్ముంటే రైతుల్ని పరామర్శించడం తప్పు అని ప్రకటనలు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ అసమర్ధత వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ తిట్టడం కోసమే పదవులు ఇచ్చినట్టు మంత్రుల తీరు చూస్తే అర్ధం అవుతోందన్నారు. మంత్రి పదవుల్లో పాత పాలేర్ల స్థానంలో కొత్త పాలేర్లు వచ్చారని మండిపడ్డారు. సోమవారం గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి నయూబ్ కమాల్ లతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వం చేసిన హత్యలే
గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ "అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న కౌలు రైతు కుటుంబాల కష్టాలు చూసి చలించి, ఆ కుటుంబాలను ఆదుకునేందుకు కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టి ఒక్కో రైతు కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నారు. కౌలు రైతు భరోసా నిధి ఏర్పాటు చేసి ఆయన కష్టపడి సంపాదించిన సంపాదన నుంచి రూ.5 కోట్లు అందించారు. ఇప్పటికే రెండు జిల్లాల్లో 71 మంది రైతు కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. కష్టాల్లో ఉన్న కౌలు రైతు కుటుంబాలను ఆదుకోవడమే పవన్ కల్యాణ్ చేసిన తప్పా? ప్రభుత్వ విధానాల కారణంగా మూడేళ్లలో మూడు వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పవన్ కల్యాణ్ పర్యటన అనగానే పని కట్టుకుని ఆత్మహత్య చేసుకున్న ప్రతి కుటుంబం చుట్టూ పరిహారం ఇస్తామంటూ అధికారులు తిరుగుతున్నారు. చనిపోయిన వెంటనే ఆ రైతు కుటుంబాలను ఎందుకు ఆదుకోలేకపోయారు. " అని అన్నారు.
అంబటి చరిత్ర సీరియల్స్ తీస్తాం
పవన్ తిట్టడం కోసమే సీఎం జగన్ మంత్రి పదవులు ఇస్తున్నట్టున్నారని గాదె వెంకటేశ్వరరావు అన్నారు. ఈ మంత్రుల్లో ఎవరికైనా ప్రజా సమస్యల మీద అవగాహన ఉందా? అని ప్రశ్నించారు. గతంలో మంత్రులుగా ఉన్న పాతపాలేర్ల స్థానంలో ఇప్పుడు కొత్త పాలేర్లు వచ్చారన్నారు. అంతకు మించి మార్పు కనబడడం లేదన్నారు. అంబటి రాంబాబుకు ఆయన శాఖ గురించి ఏమైనా తెలుసా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన్ను గన్ మెన్ ఎందుకు కొట్టారో చెప్పాలన్నారు. ఎంత మంది మహిళలు చెప్పులతో కొట్టారో చర్చపెట్టాలన్నారు. వైసీపీ నేతల కోసం అద్భుతమైన టైటిల్స్ సిద్ధంగా ఉన్నాయన్నారు. నేరస్తుడు అనే టైటిల్ తో త్వరలో సినిమా రాబోతోందన్నారు. రాంబాబు రాసలీలలు, అరగంట రాంబాబు, పారిపోయిన అంబటి అనే పేర్లతో టైటిల్స్ రిజిస్టర్ అయ్యాయన్నారు. అంబటి రాంబాబు చరిత్రపై సినిమాలు తీయడానికి జలవనరుల శాఖ గెస్ట్ హౌస్ లు సరిపోతాయన్నారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే అంబటి చరిత్ర మొత్తం సీరియల్స్ గా తీయాల్సి వస్తుందన్నారు.
చించుకున్న మంత్రులు గొడ్ల చావిళ్లకు పరిమితం
పార్టీ ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... "రైతు సమస్యల గురించి మాట్లాడితే మహిళల్ని కించపరిచే విధంగా వైసీపీ కొత్త మంత్రులు మాట్లాడుతున్నారు. పవన్ కల్యాణ్ ను తిట్టడం కోసమే వీరికి కొత్తగా మంత్రి పదవులు ఇచ్చినట్టున్నారు. గతంలో చించుకున్న మంత్రులంతా గొడ్ల చావిళ్లకు పరిమితమయ్యారన్న సంగతి గుర్తుంచుకోవాలి. పవన్ జీవితం తెరిచిన పుస్తకం. అందులో రహస్యం ఏమీ లేదు. వైసీపీ నాయకుల్లా మాకెవ్వరికీ చీకటి బతుకులు లేవు. కాలేజీ రోజుల్లో అమ్మాయిలను ఏడిపించి రెండు రోజుల్లో పోలీస్ కస్టడీలో ఉన్న రోజులు సదరు మంత్రి మర్చిపోయినట్టున్నారు. విశాఖలో మంత్రి అమర్నాథ్ భూ కబ్జాలపై జనసేన పార్టీ పోరాటం చేస్తుంది. జనసేన పార్టీ ఏ కులానికీ కొమ్ము కాయదు. మంత్రులు నోరు అదుపులో పెట్టుకోకపోతే వారి ఇళ్లు ముట్టడిస్తాం. జనంతో తన్నులు తినే పనులు వైసీపీ నాయకులు మానుకుంటే మంచిది.
ఆలీబాబా 40 దొంగల ప్రభుత్వం
పార్టీ రాష్ట్ర కార్యదర్శి నయూబ్ కమాల్ మాట్లాడుతూ.. "వైసీపీ ప్రభుత్వ పరిపాలన ఆలీబాబా 40 దొంగల్లా ఉంది. ఈ ప్రభుత్వం మీద జగన్ రెడ్డి – 151 మంది దొంగలు అనే కొత్త టైటిల్ తో సినిమా తీయాలి. తిరుమల వెళ్తున్న కుటుంబాన్ని నడి రోడ్డు మీద దించి కార్లు ఎత్తుకెళ్లడం దొంగల ముఠా పని కాదా? రోడ్ల వెంట బారీకేడ్లు లేకుండా బయటకు వచ్చే ధైర్యం ముఖ్యమంత్రికి లేదు. జగన్ పర్యటన ఉంది బయటకు వస్తున్నారంటే జనం భయపడుతున్నారు. పవన్ కల్యాణ్ బయటకు వస్తే జగన్ భయపడుతున్నారు. సొంత డబ్బు రైతులకు ఇస్తున్న గొప్ప నేత పవన్ కల్యాణ్. ఆయన గురించి మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని అన్నారు.