Tenali Council Fight : తెనాలి మున్సిపల్ కౌన్సిల్ లో రసాభాస, చొక్కాలు చిరిగేలా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు
Tenali Council Fight : గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసాభాస నెలకొంది. టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు పరస్పరం దాడి చేసుకున్నారు.
Tenali Council Fight : గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఉద్రిక్తతంగా మారింది. టీడీపీ కౌన్సిలర్ యుగంధర్ పై వైసీపీకి చెందిన కౌన్సిలర్లు దాడి చేశారు. నవరత్నాల పథకంలో భాగంగా చేపట్టిన పనుల్లో సింగిల్ టెండర్ ఆమోదం అంశంపై టీడీపీ సభ్యుడు యుగంధర్ అభ్యంతరం తెలిపారు. తాము ప్రతిపాదించిన ఆంశాలపై వైసీపీ కౌన్సిలర్లు మాట్లాడకుండా కూర్చోమని వినాలని ఎదురుదాడికి దిగారని టీడీపీ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. టీడీపీ సభ్యుడు తనకు మాట్లాడే అవకాశం లేదా మీరు మాత్రమే మాట్లాడతారా మీరే కూర్చోండని బదులిచ్చారు. దానితో వైసీపీ 33వార్డ్ కౌన్సిలర్ ఒక్కసారిగా టీడీపీ కౌన్సిలర్ల మీదకు దూసుకొచ్చారు. మిగతా కౌన్సిలర్లు అడ్డుకున్న ఆగకుండా వెంటపడి దాడి చేశారు. అనంతరం తమపై జరిగిన దాడికి నిరసగా పోడియం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు టీడీపీ కౌన్సిలర్లు. దాడి అనంతరం కౌన్సిల్ సమావేశం నుంచి వైసీపీ కౌన్సిలర్లు వెళ్లిపోయారు. ఈ గొడవలో పలువురి కౌన్సిలర్ల చొక్కాలు కూడా చిరిగిపోయాయి. మున్సిపల్ ఛైర్ పర్సన్ గొడవ ఆపడానికి ప్రయత్నించినా ఎవరూ తగ్గలేదు.
సమస్యలు చర్చించకుండా తన్నుకున్న సభ్యులు
తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. ఈ వాగ్వాదం ముదరడంతో వైసీపీ, టీడీపీకి చెందిన ఇరుపార్టీల కౌన్సిలర్ల ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఈ గొడవలో పలువురు కౌన్సిలర్లు చొక్కాలు చిరిగిపోయేలా కొట్టుకున్నారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఈ గొడవను ఆపడానికి చాలా ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఎంత వారించినా గొడవ సద్దుమణుగకపోవడంతో ఛైర్‌పర్సన్ సభను ముగించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మున్సిపాలిటీలోని సమస్యలపై చర్చించాల్సిన కౌన్సిలర్లు ఇలా సభలోనే కొట్టుకోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ గొడవకు దిగిన సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కౌన్సిల్ లో సభ్యులు విచక్షణ మరిచి దాడికి పాల్పడిన ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులే ఇలా వ్యవహరిస్తుంటే ప్రజాసమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని ప్రశ్నిస్తున్నారు. పార్టీల పేరుతో కొట్టుకోకుండా సమస్యపై దృష్టిపెట్టాలని కోరుతున్నారు.
కన్నీళ్లు పెట్టుకున్న కౌన్సిలర్
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాడి వేడిగా జరిగింది. ఈ సమావేశంలో 9వ వార్డ్ కౌన్సిలర్ సంకు సురేష్ పెట్రోల్ బాటిల్ తో సమావేశానికి హాజరయ్యారు. నాలుగేళ్ల నుంచి తన వార్డ్ లో అభివృద్ధి పనులు చేపట్టలేదని, వార్డులో ప్రజలు అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నానని కన్నీళ్లు పెట్టుకున్నారు సురేష్. నాలుగు సంవత్సరాలుగా పనులు చేయండి అంటూ అడుగుతున్నప్పటికీ ఒక అధికారి గాని చైర్మన్ గాని పట్టించుకోవడం లేదంటూ సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధిగా తనను ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నానని ఆవేదనతో వంటిపై పెట్రోల్ పోసుకోబోతుండగా పక్కనున్న సభ్యులు అడ్డుకుని బాటిల్ లాగేసుకోవడంతో పెనుప్రమాదం తప్పింది.
ఇటీవల అసెంబ్లీలో దాడి
ఏపీ అసెంబ్లీలో ఇటీవల టీడీపీ నేతలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళన తెలిపారు. జీవో నెంబరు 1ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు.. టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామిపై దాడికి దిగారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరిపైనా వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారని ఆరోపించారు. అయితే ఈ ఉద్రిక్తత ప్రారంభం అవుతుండగానే, అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేశారు. ఈ గందరగోళ పరిస్థితుల్లో సభను స్పీకర్ వాయిదా వేశారు. మరోవైపు, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు మాత్రం.. తనపై చంద్రబాబు దాడి చేయించారని, అందుకే డోలా బాలవీరాంజనేయులు తనపై దాడి చేశారని ఆరోపించారు. ఆ క్రమంలో తన చేతికి గాయం కూడా అయిందని అసెంబ్లీ బయట మీడియాకు చూపించారు. దానికి సంబంధించిన విజువల్‌ను స్పీకర్ వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.