(Source: ECI/ABP News/ABP Majha)
Minister Gummanur Jayaram: ఎంపీ టిక్కెట్ ఇచ్చినా జంపింగ్ ఆలోచనలో మంత్రి జయరాం - అసెంబ్లీ టిక్కెట్ ఇస్తే సరే !
YSRCP : ఆలూరు నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేయడానికి గుమ్మనూరు జయరాం రెడీ అవుతున్నారు. ఎంపీ టిక్కెట్ ఇచ్చినప్పటికీ ఆయన సంతృప్తిగా లేరు.
Minister Gummanur Jayaram To Join Congress : ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మనూరు జయరాం పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆలూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు కర్నూలు ఎంపీ టిక్కెట్ ను సీఎం జగన్ కేటాయించారు. ఆలూరు నుంచి జడ్పీటీసీగా ఉన్న విరూపాక్షికి టిక్కెట్ కేటాయించారు. అయితే తాను ఎంపీగా పోటీ చేయబోనని ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనకుంటున్నానని జయరాం చెబుతున్నారు. పార్టీ కార్యకర్తల సమావేశంలోనూ అదే చెప్పారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంఛార్జిల మార్పులు చేర్పుల్లో భాగంగా విడుదల చేసిన మూడో జాబితాలో ఆలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి జయరాంను కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం.. ఎంపీగా పోటీ చేయడం తనకు ఇష్టం లేదని, ఆలూరు ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని జయరాం అంటున్నారు. తనకు ఆలూరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. కాకర్యకర్తలతో సమావేశం తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. కొద్ది రోజులు బెంగుళూరులో ఉన్న జయరాం.. ఆ తర్వాత ఆలూరుకు వచ్చినా ఎవర్నీ కలవలేదు. వైసీపీ తాజా అభ్యర్థి విరుపాక్షి కలిసేందుకు ప్రయత్నించినా.. ఆయన అందుబాటులోకి రాలేదు .
ఎంపీగా పోటీ చేసే విషయంపై మాట్లాడేందుకు వైసీపీ ముఖ్య నేతల ప్రయత్నం చేసినా ఆయన ఆసక్తి చూపించడం లేదు. కాంగ్రెస్ లో చేరి అయినా పోటీ చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రి నాగేంద్రతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక మంత్రి నాగేంద్ర ఆయనకు సమీప బంధువు. కాంగ్రెస్ లో చేరితే ఆయనకు ఆలూరు టిక్కెట్ కేటాయించడం ఖాయమే. కర్నూలు జిల్లా బాధ్యతలు ఇచ్చే యోచనలో కాంగ్రెస్ ఉంది. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో జయరాం ఐదు సీట్లు అడుగుతున్నారు. వాల్మీకి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై దృష్టి సారించారు. కర్నూలు జిల్లాలో ఆలూరు, ఆదోని, మంత్రాలయం, పత్తికొండ.. అనంతపురం జిల్లాలో గుంతకల్లు, ఉరవకొండ, రాయదుర్గం ఫోకస్ పెట్టారు. రాయలసీమ జిల్లాల్లో వాల్మీకి సామాజిక వర్గం ఎక్కువగా ఉండడంతో జయరాంను ఉపయోగించుకుంటే పార్టీకి బలం చేకూరుతుందని అంచనా వేస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఇటీవల షర్మిల బాధ్యతలు తీసుకున్నారు. ఒక్క రోజులోనే ఆమె జిల్లాల పర్యటనలు ప్రారంభించబోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరితే జయరాంకు కావాల్సిన సీట్లు ఇస్తారు. అయితే గెలుస్తారా లేదా అన్నదానిపై సస్పెన్స్ ఉంటుంది. కానీ జయరాం నియోజకవర్గ వ్యాప్తంగా అనుచరులు ఉన్నారు. వారంతా తనతో నడుస్తారని నమ్ముతున్నారు. అందుకే కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.