త్వరలో మరిన్ని గ్రూప్-1, 2 పోస్టులకు నోటిఫికేషన్లు - గౌతమ్ సవాంగ్ వెల్లడి
గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్వ్యూల అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన వారి వివరాలను ఏపీపీఎస్సీ వెల్లడించింది.
గ్రూప్ 1 ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ విడుదల చేశారు. సెప్టెంబర్ 30, 2022న గ్రూప్ 1 నోటిఫికేషన్ ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) విడుదల చేసింది. నిర్ణీత సమయం ప్రకారం గ్రూప్ 1 నియామక ప్రక్రియ పూర్తి చేశామని, గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. 16 కేటగిరీల్లో మొత్తం 110 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఆయన వెల్లడించారు. స్పోర్ట్స్ కోటా కింద ఒక పోస్టు ఎంపిక వివరాలు తర్వాత ప్రకటిస్తామని తెలిపారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించామని, అత్యంత పారదర్శకంగా గ్రూప్ 1 ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తి చేసినట్లు వెల్లడించారు. బయోమెట్రిక్, ఫేషియల్ రికగ్నైజేషన్, సీసీటీవీ టీవీల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించామని తెలిపారు. 1:2 నిష్పత్తిలో మొత్తం 220 మంది అభ్యర్థులు ఇంటర్వూలకు ఎంపిక చేశామని వీరిలో 105 పురుషులు, 115 మహిళా అభ్యర్థుల చొప్పున ఎంపిక చేసి ఇంటర్వూలు నిర్వహించామని వివరించారు. ఏడాదిలోపే గ్రూప్ 1 నియామక ప్రక్రియ పూర్తి చేశామని పారదర్శక విధానంలో ఇంటర్వూలు నిర్వహించామని గౌతం సవాంగ్ అన్నారు.
ప్రతిభకు ప్రాధాన్యం
ప్రతిభ కలిగి ఉన్న అభ్యర్థులను ఎంపిక చేశామని, పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది అభ్యర్థులు ఎంపికయ్యారని అన్నారు. గ్రూప్ 1లో తొలి మూడు ర్యాంకులు మహిళా అభ్యర్థులే ఎంపికయ్యారని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ అన్నారు. భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష కు గ్రూప్ 1లో తొలి ర్యాంకు, భూమిరెడ్డి పావనికి రెండో ర్యాంకు, కంబలకుంట లక్ష్మీ ప్రసన్నకు మూడో ర్యాంకు, ప్రవీణ్ కుమార్ రెడ్డికి నాలుగు, భాను ప్రకాష్ రెడ్డికి ఐదో ర్యాంకు లభించిందని ప్రకటించారు.
త్వరలోనే మరిన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
త్వరలో 1,199 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ఇవి కాకుండా గ్రూప్ 1, 2 పోస్టులకు నోటిఫికేషన్లు త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. సెప్టెంబర్ లోపు గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని, త్వరలోనే గ్రూప్ 2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను కూడా విడుదల చేస్తామని ప్రకటించారు. గ్రూప్ 1 పోస్టులు 100, గ్రూప్ 2 - వెయ్యి పోస్టులకు పైగా ఖాళీలు భర్తీ చేస్తామని తెలిపారు. గ్రూప్స్ సిలబస్ లో మార్పులు చేస్తున్నామని, యూపీఎస్సీ విధానంలో ఏపీపీఎస్సీ నియామక ప్రక్రియ చేపడతామని అన్నారు. నిరుద్యోగులు గ్రూప్స్ ఉద్యోగాలకు సిద్ధం కావచ్చని సూచించారు. ఉద్యోగ నియామకాలపై వదంతులు, తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ పిలుపునిచ్చారు.