TDP MLA Gorantla : గౌరవం లేదు, అవమానిస్తున్నారు .. అందుకే రాజీనామా : గోరంట్ల
గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామాకే సిద్ధపడ్డారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన పార్టీలో గౌరవం దక్కకపోగా అవమానాలు ఎదురువుతున్నాయన్నారు.
ఈ నెల 25వ తేదీన తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. ఉదయం ఇప్పుడేమీ మాట్లాడబోనని మీడియా ప్రతినిధులతో వ్యాఖ్యానించిన ఆయన సాయంత్రం ఓ టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. తనకు పార్టీలో జరుగుతున్న అవమానాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన సూటిగా చెప్పారు. ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నా.. అవమానాలు ఎదురవుతున్నాయన్నారు. అదే సమయంలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎంతో మంది కార్యకర్తలు, నేతలు కష్టపడ్డారని వారెవరికీ సరిగ్గా గుర్తింపు రాలేదన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా క్యాడర్‌కు పదవులు ఇవ్వలేదని .. పదవులు ఇవ్వాలని తాను సూచించినా ఎవరికీ ఇవ్వలేదన్నారు.
కొన్ని లక్షల మంది కార్యకర్తలు సఫర్ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎవరెవరో వచ్చి పార్టీలో చేరారని వారందరికీ మంచి మంచి పదవులు ఇచ్చారని.. పార్టీలోనే ఉండి కష్టపడిన వారికి ఏం ఇచ్చారని బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేలు చేయలేదు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అందరూ సఫర్ అవుతున్నారన్నారన్నారు. తాను చెప్పాలనుకున్నది ముక్కుసూటిగానే చెబుతున్నానని అందుకే పలుమార్లు పార్టీలో తనకు ప్రాధాన్యం దక్కలేదన్నారు. గతంలో పార్టీ కార్యకర్తలను పట్టించుకోవాలని సలహా ఇచ్చినందుకు రెండేళ్ల పాటు తనను పట్టించుకోలేదన్నారు. అయినప్పటికీ.. తాము పార్టీ బలోపేతం కష్టపడ్డామని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా పార్టీలో చేరిన వారికి కొత్తగా పార్టీ పదవులు ఇస్తున్నారని ఎప్పట్నుంచో పార్టీలో ఉన్న వారికి మాత్రం గుర్తింపు.. గౌరవం ఉండటం లేదన్నారు.
రాజమండ్రి అంతర్గత సమస్యల గురించి గోరంట్ల పెద్దగా మాట్లాడలేదు కానీ ఆయన మాత్రం సమస్యన్నింటినీ చంద్రబాబుకు చెప్పినా పట్టించుకోలేదన్నారు. ఈ కారణంగానే తాను పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నారని స్పష్టం చేశారు. అయితే నిర్ణయం మార్చుకుంటారా అన్న ప్రశ్నకు గోరంట్ల సూటిగా సమాధానం ఇవ్వలేదు. మీడియాలో వార్తలు వచ్చిన తర్వాత కొన్నివందల మంది ఫోన్లు చేశారన్నారు. ఈ విషయంలో చంద్రబాబు,లోకేష్‌లతో మాట్లాడేదేమీ లేదని చెప్పాల్సినదంతా ఎప్పుడో చెప్పానన్నారు.
గోరంట్ల రాజీనామా చేస్తారనే ప్రచారం ఒక్క సారిగా జరిగే సరికి టీడీపీ నేతలు ఉలిక్కి పడ్డారు. ఆయన ఇంటికి సీనియర్ నేతలు వెళ్లారు. బుజ్జగించే ప్రయత్నం చేశారు. వారు గోరంట్ల పార్టీకి రాజీనామా చేయరనే మీడియాకు చెప్పారు. అయితే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాత్రం తన రాజీనామా విషయంలో వెనక్కి తగ్గుతానని చెప్పలేదు.