Godavari Water To Uttarandhra: ఉరకలై గోదావరి - ఉత్తరాంధ్రకు వెడలి - సాకారమయిన దశాబ్దాల స్వప్నం!
Polavaram Project: దశాబ్దాల కల నేడు నిజం అవుతోంది. గోదావరి నీరు ఉత్తరాంధ్రను తాకాయి. తాగు, సాగుకే కాదు పారిశ్రామికానికీ గోదావరి జలాలు గేమ్ చేంజర్.

AP Water Resources Projects: దశాబ్దాల తరబడి వలసలు, నీటి ఎద్దడి, పారిశ్రామిక నీటికొరతతో సతమతమవుతున్న ఉత్తరాంధ్ర నేలలకు గోదావరి జలాలు సరికొత్త జీవం పోస్తున్నాయి. పోలవరం ప్రధాన ప్రాజెక్టు 2027 నాటికి పూర్తయ్యేవరకు వేచి చూడకుండా, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను పంపింగ్ చేసి, పాయకరావుపేట సీతారాంపురం-పిఎల్ పురం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జలహారతి పట్టి పోలవరం ఎడమ ప్రధాన కాలువలోకి ప్రవహింపజేయడం ఒక చారిత్రాత్మక ఘట్టం. దశాబ్దాల కల సాకారమవుతూ సముద్రమట్టానికి ఎగువన జలధారలు ఉరకలెత్తుతుంటే, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సుదీర్ఘ స్వప్నం సాకారం దిశ తొలి అడుగు పడింది.
భారీ ఇంజనీరింగ్ ప్రణాళిక
ఈ నీటి తరలింపు వెనుక భారీ ఇంజనీరింగ్ ప్రణాళిక దాగి ఉంది. పోలవరం ఎడమ కాలువ పొడవు సుమారు 213 కిలోమీటర్లు ఉండగా, తూర్పు కనుమలను కోస్తూ భౌగోళిక సవాళ్లను అధిగమించి 4192 కోట్ల రూపాయలతో మొదటి ఫేజ్ పనులను పూర్తి చేశారు. ఎల్ఎంసీ మార్గంలో ఏలేరు, పంపా, తాండవ, శారద, వరాహ అనే ఐదు ప్రధాన నదులతో పాటు వాగులు అడ్డంగా వస్తాయి. వీటి కోసం అక్విడెక్టులు నదిపై నుంచి కాలువ వెళ్లే నిర్మాణాలు , సైఫన్లు నిర్మించారు. పంపా నదిపై 30 మీటర్ల లోతున పైల్స్తో, అలాగే తాండవ నదిపై 10,634 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం కలిగిన 447 మీటర్ల పొడవైన భారీ అక్విడెక్ట్ నిర్మాణాలను అధిగమించి గోదావరి ప్రవాహాన్ని అనకాపల్లి జిల్లా వైపు మళ్లించారు.
దాదాపుగా 5వేల క్యూసెక్కుల సామర్థ్యం
ప్రస్తుత ప్రణాళిక ప్రకారం, పురుషోత్తపట్నం లిఫ్ట్ నుంచి ఎడమ కాలువ ద్వారా దాదాపు 3,500 క్యూసెక్కుల నీటిని ప్రారంభ దశలో విడుదల చేస్తున్నారు. దీనికి తోడు 29 కోట్లతో పునర్నిర్మిస్తున్న పుష్కర లిఫ్ట్ పనులు పూర్తయితే అదనంగా మరో 700 నుంచి 1,500 క్యూసెక్కుల నీరు కాలువలోకి వచ్చి చేరుతుంది. పాయకరావుపేట, యలమంచిలి, అనకాపల్లి మీదుగా ప్రవహించే ఈ జలాలను తాగునీటికి, సాగుకు , పారిశ్రామిక అవసరాలకు విభజించి వినియోగించేలా జలవనరుల శాఖ కచ్చితమైన గణాంకాలతో మ్యాపింగ్ చేసింది.
ఏలేరు ఆయకట్టుకు రక్షణ కవచం
ఈ ప్రవాహం ద్వారా ఉత్తరాంధ్ర సాగు, తాగునీటి రంగం గొప్ప ఊరటను పొందనుంది. కాలువ పరివాహక ప్రాంతంలోని ఆయకట్టుకు సంబంధించి సుమారు 2.87 లక్షల ఎకరాలకు స్థిరమైన సాగునీరు అందనుంది. అలాగే, ప్రధాన మార్గంలోని చెరువులను, రిజర్వాయర్లను నింపడం ద్వారా అనకాపల్లి, విశాఖ పరిసర ప్రాంతాల్లో దాదాపు 9.23 లక్షల మంది ప్రజలకు తాగునీటి ఎద్దడి తీరబోతోంది. ఏళ్ల తరబడి వర్షాభావంతో ఎండిపోతున్న ఏలేరు ఆయకట్టుకు ఈ గోదావరి ప్రవాహాలు రక్షణ కవచంగా మారనున్నాయి.
పారిశ్రామిక అవసరాలను తీర్చడానికి 27 టిఎంసిల నీరు
దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా విశాఖపట్నం మహానగర దాహార్తిని, పారిశ్రామిక అవసరాలను తీర్చడానికి 27 టిఎంసిల నీటిని ప్రత్యేకంగా కేటాయించే ప్లాన్ సిద్ధమైంది. ఇందులో విశాఖ స్టీల్ ప్లాంట్ ఆవరణలోని కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లోకి 0.5 టిఎంసిల నీటిని నిల్వ చేయనున్నారు. మిగిలిన నీటిని పెంచెరువు, కృష్ణంపాలెం, కొండకర్ల ఆవా, గోపాలపట్నం ఆవా వంటి సహజ జలాశయాలకు మళ్లిస్తారు. మార్చి నాటికి కణితి నుంచి నరవ వరకు నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక పైప్లైన్ పూర్తయితే మేఘాద్రిగెడ్డకు కూడా నీరు చేరుతుంది.
ఉత్తరాంధ్రలో సరికొత్త ఆర్థిక విప్లవం
ఉరకలై గోదావరి కల కేవలం కాగితాల పరిధి దాటి క్షేత్రస్థాయిలో ప్రవహించడం ఉత్తరాంధ్ర అభివృద్ధి గ్రాఫ్ను మార్చబోతోంది. విశాఖ నగరంలో రూపుదిద్దుకుంటున్న భారీ పారిశ్రామిక కారిడార్లు, నిరంతర నీటి సరఫరా హామీతో రాబోయే విదేశీ పెట్టుబడులు ఈ ప్రాంత ముఖచిత్రాన్ని మార్చేస్తాయి. గోదావరి నికర జలాల మళ్లింపుతో సస్యశ్యామలమయ్యే ఈ నేలలు, రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర నుంచి జరిగే ఉపాధి వలసలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసి, సరికొత్త ఆర్థిక విప్లవానికి నాంది పలకనున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















