Break For Yuvagalam: నారా లోకేష్ యువగళం పాదయాత్రకు బ్రేక్, మళ్లీ ఎప్పుడంటే?
Break For Yuvagalam: నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. మహానాడు కారణంగా నాలుగు రోజుల తర్వాత తిరిగి కొనసాగనుంది.

Break For Yuvagalam: టీడీపీ జాతీయ కార్యదర్శి, యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ నెల 27, 28 తేదీల్లో రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడు జరగనుంది. ఈ పార్టీ కార్యక్రమానికి హాజరయ్యేందుకే లోకేష్ తన పాదయాత్రకు విరామం ప్రకటించారు. తిరిగి ఈ నెల 30వ తేదీ నుండి పాదయాత్ర ప్రారంభించనున్నారు.
యువగళం పాదయాత్ర ఇవాళ జమ్మలమడుగులో ముగిసింది. 30 వ తేదీ మళ్లీ ఇక్కడి నుండి యువగళ పాదయాత్ర కొనసాగుతుంది. జమ్మలమడుగులో పాదయాత్ర ముగించుకున్న లోకేష్.. అక్కడి నుండి కడప ఎయిర్ పోర్టుకు వెళ్లారు. ప్రత్యేక విమానంలో నారా లోకేష్ అమరావతికి చేరుకున్నారు. రేపు అమరావతి నుండి బయల్దేరి రాజమండ్రిలో జరిగే మహానాడు ప్రాంతానికి వెళ్తారు.
గురువారం జమ్మలమడుగు నియోజవర్గంలోని పెద్దముడియం, పెద్దపసుపుల గ్రామాల మీదుగా నారా లోకేష్ యువగళ పాదయాత్ర సాగింది. ఈ పాదయాత్రకు పెద్ద సంఖ్యలో దళితులు, మైనార్టీలు, రైతులు, మహిళలు వచ్చి లోకేష్ కు స్వాగతం పలికారు. అడుగడుగునా ప్రజలకు యువనేతకు నీరాజనాలు పలికాలు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడిన లోకేష్.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే అందరి సమస్యలు పరిష్కరిస్తానని ఈ సందర్భంగా లోకేష్ హామీ ఇచ్చారు.
మహానాడుకు ముమ్మర ఏర్పాట్లు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరి వద్ద జరగనున్న మహానాడుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నెల 27, 28వ తేదీల్లో నిర్వహించే పార్టీ కార్యక్రమానికి నేతలు దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. 27వ తేదీన ప్రతినిధుల సభ, 28వ తేదీన మహానాడు బహిరంగ సభ జరగనుంది. వీటి కోసం వేర్వేరు వేదికలను సిద్ధం చేస్తున్నారు. 27న జరగబోయే ప్రతినిధుల సభకు 15 వేలకు మించి జనాభా హాజరు అవుతారని టీడీపీ పార్టీ అంచనా వేస్తోంది. అలాగే తరువాతి రోజు జరిగే మహానాడు బహిరంగ సభకు పార్టీ శ్రేణులు, తెలుగు దేశం అభిమానులు లక్షల్లో వస్తారని అంచనా. వీరి కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ప్రతినిధుల సభ, మహానాడు కార్యక్రమాలకు వచ్చే అతిథులకు గోదావరి రుచులతో ఆత్మీయ ఆతిథ్యం పలకనున్నట్లు నాయకులు చెబుతున్నారు.
Also Read: Chandrababu : కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై కీలక వ్యాఖ్యలు - చంద్రబాబు చేసిన ప్రకటనలో ఏముందంటే ?
ఎన్నికల శంఖారావం పూరించనున్న టీడీపీ
ఎన్నికలు ఏడాది కాలంలో రానున్న నేపథ్యంలో గోదావరి జిల్లాలో మహానాడు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల పట్టభద్రులు, ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా వరుస విజయాలు సాధించి, మంచి జోష్ మీద ఉన్న టీడీపీ.. మహానాడు నుండే ఎన్నికల శంఖారావం పూరిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలకు రాజమహేంద్రవరం రాజకీయ కేంద్రం లాంటిది. అక్కడి నుండే మహానాడు ద్వారా ఎన్నికల శంఖారావం పూరించడం శుభసూచకమని టీడీపీ నేతలు అంటున్నారు. ఎన్టీఆర్ శతజయంతి మహోత్సవాలు జరుపుకుంటున్న వేళ నిర్వహిస్తున్న ఈ మహానాడు ఎంతో ప్రత్యేకమైనదని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. 27, 28 తేదీల్లో జరగనున్న మహానాడుకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు నాయకులు చెబుతున్నారు.





















