Chinta Mohan Comments: ఏపీలో కూటమిదే అధికారం, బీజేపీతో పొత్తు చంద్రబాబు చేసిన తప్పు: చింతా మోహన్
Andhra Pradesh Elections 2024: ఏపీ ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుందని, వైసీపీ ఓడిపోతుందని కాంగ్రెస్ నేత చింతా మోహన్ అన్నారు. చంద్రబాబు మరోసారి సీఎం అవుతారని ఢిల్లీలో చింతా మోహన్ చెప్పారు.
Chinta Mohan predicts TDP BJP Janasena will win AP Elections 2024| ఢిల్లీ: ఏపీ ఎన్నికల్లో చంద్రబాబుకు అనుకూల పవనాలు వీచాయని, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి రావడం ఖాయం, చంద్రబాబు సీఎం అవుతారని చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఏకంగా రూ.4000 కోట్ల నుంచి రూ.5000 కోట్లు ఖర్చు పెట్టిందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆరోపించారు. ఈ నగదు ఎక్కడ నుంచి వచ్చింది, ఎవరిచ్చారో దర్యాప్తు సంస్థలు చెప్పాలన్నారు. జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆ మొత్తంలో 5 శాతం కూడా ఖర్చు చేయలేక పోయిందన్నారు.
తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఓ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థి రూ.80 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. రిజర్వ్‌డ్ నియోజకవర్గం గూడురు నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి రూ.45 కోట్లు ఎన్నికలకు ఖర్చు చేశారని చెప్పారు. ఈ డబ్బును ఓ పోలీస్ అధికారి హోటల్లో పెట్టుకుని డిస్ట్రిబ్యూట్ చేశారని, పోలీస్ వ్యవస్థ ఇలా ఉంటే ప్రజలకు ఏం ప్రయోజనం ఉందని ప్రశ్నించారు.
నోట్లతో అద్భుతాలు చేసినా జగన్ ఓటమి!
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన అధికారం కోసం అద్భుతాలు చేశారని, ఎన్నికల్లో రూ.4 వేల నుంచి రూ.5 వేల కోట్లు ఎలా తీసుకువచ్చి ఖర్చు చేశారో అని చింతా మోహన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అధికారంలోకి రావడానికి జగన్, పార్టీ నేతలు అక్రమాలు, అధికార దుర్వినియోగం చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత ఆరోపించారు. వారి పేపర్లో ఏపీలో అధికారంలోకి వచ్చేది వైసీపీ అని వార్తలు వచ్చాయన్నారు. కానీ ఏపీలో సీఎం జగన్, ప్రధాని మోదీపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్నారు. ఏపీలో వైసీపీ ఓడిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. జగన్ ను పెంచి పోషిస్తున్న ప్రధాని మోదీకి పరాభవం తప్పదన్నారు. బీజేపీకి 150 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు.
బీజేపీతో పొత్తు, చంద్రబాబు చేసిన తప్పు..
చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకుని పొరపాటు చేశారని, లేకపోతే ఒంటరిగా పోటీ చేస్తే చంద్రబాబుకు 150 సీట్లు వచ్చేవని చింతా మోహన్ అభిప్రాయపడ్డారు. బీజేపీతో పొత్తు వల్ల కూటమికి సీట్లు తగ్గుతాయి, కానీ చంద్రబాబు అధికారంలోకి వస్తారని స్పష్టం చేశారు. ఏపీలో ఎంత ఖర్చు చేసినా, జగన్ ఓడిపోవడం ఖాయమైందన్నారు. జగన్ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ అంతగా క్యాష్ చేసుకోలేకపోయిందని, చంద్రబాబు పార్టీ దాన్ని క్యాష్ చేసుకుందని చెప్పారు. ఓడిపోతున్నామని తెలిసినా తమదే విజయమని జగన్ ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
జగన్ కు ఇచ్చిన ఒక్క ఛాన్స్ అయిపోయింది కానీ, వ్యతిరేక ఓటు కూటమికి వెళ్లిందన్నారు. తిరుపతి లోకసభ నియోజకవర్గం పరిధిలోనే వైసీపీ 200 నుంచి 300 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిందని ఆరోపించారు. అధికారం ఉంటే డబ్బు వస్తుందని, డబ్బు ఉంటే అధికారం వస్తుందని జగన్ భావించారని చెప్పారు. అన్నీ తెలిసి కూడా, వ్యవస్థలన్నీ విఫలమయ్యాయని, ఎన్నికల సంఘం పూర్తిగా బలహీన పడిపోతోందన్నారు. పోలీసులు సైతం వైసీపీ నేతలకు సహకరించగా, వారికి ఆధారాలు తామెందుకు ఇస్తామని చింతా మోహన్ ప్రశ్నించారు. ఏది ఏమైతేనేం వైసీపీ ప్రభుత్వ వ్యతిరేఖ ఓట్లు, జగన్ ను వ్యతిరేకించే వారు కూటమి అభ్యర్థులకు ఓట్లు వేశారని పేర్కొన్నారు.