TG Venkatesh: రాయలసీమ మొనగాడు, అపర భగీరథుడు చంద్రబాబు – టి.జి వెంకటేష్
Kurnool: చంద్రబాబు అపర భగీరథుడు..రాయలసీమ మొనగాడు అంటూ కొనియాడారు మాజీ మంత్రి టి.జి.వెంకటేష్. తిరుపతిలో మాజీ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగిన సత్తా చంద్రబాబుకే ఉందన్నారు.
T.G.Venkatesh : చంద్రబాబు అపర భగీరథుడని..రాయలసీమ మొనగాడు అంటూ మాజీ మంత్రి టీజీ వెంకటేష్ కొనియాడారు. ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో కోటి శివలింగాలను మట్టితో తయారుచేసి కాశికి తీసుకుని వెళ్తున్న నేపథ్యంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. రాయలసీమనే కాదు రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేయగలిగిన సత్తా ఒక్క చంద్రబాబుకే ఉందని టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు. రాయలసీమలో పెండింగ్‌లో ఉన్న సాగు నీరు, తాగునీటి ప్రాజెక్టులు త్వరలో పూర్తి కానున్నాయని ఆయన స్పష్టం చేశారు. పెన్నా-గోదావరి నదుల అనుసంధానానికి సీఎం భగీరథ యజ్ఞం చేస్తున్నారని తెలిపారు. సిద్థేశ్వరం బ్యారేజ్‌ను ఐకాన్ బ్రిడ్జ్‌గా మార్చాలన్న ప్రతిపాదనను తాము స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. విభజన హామీల్లో వచ్చింది తీసుకోవాలి.. లేని దాని కోసం పాకులాడకూడదన్నారు
విభజన హామీలు వచ్చే వాటిపై కామెంట్ చేస్తే మనకే నష్టమంటూ పేర్కొన్నారు. ఫ్యాక్షన్‌ను అణచి వేయడంలో చంద్రబాబు దిట్ట అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని వెల్లడించారు. పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణం ఉందని టీజీ వెంకటేష్ తెలిపారు. మోడీ ఆశీస్సులు మనకు మెండుగా ఉన్నాయి.. మోడీ ఆశీస్సులు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతాయన్నారు. మదనపల్లి దగ్ధం కేసులో చట్టం తన పని తాను చేస్తోందని.. తప్పు చేసి ఉంటే ఎంతటి వారైనా శిక్ష అనుభవించక తప్పదన్నారు. ఒకటిన్నర నెలకే జగన్ ఎన్డీయే ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు హాస్యాస్పదం అన్నారు. జగన్ చేష్టలతో ప్రజల్లో ఉన్న కాస్త విశ్వాసాన్ని కోల్పోతున్నాడని టీజీ వెంకటేష్ తెలిపారు.
ఎన్నికల ముందే జోస్యం చెప్పిన టీజీ వెంకటేష్
అసెంబ్లీ ఎన్నికల్లో వంద శాతం అధికారం టీడీపీ అధినేత చంద్రబాబుదేనని టీజీ వెంకటేష్ అప్పుడే జోస్యం చెప్పారు. వెనుకబడిన రాయలసీమ హక్కుల సాధనే లక్ష్యంగా రాయలసీమ హక్కుల ఐక్యవేదికను ప్రారంభించారు. రాయలసీమలో సమ్మర్, వింటర్ క్యాపిటల్, మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ రాజకీయాల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న నేతగా ఆయన ఎదిగారు. 1999లో టీడీపీ తరపున కర్నూలులో ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీలు మారి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. కానీ ఆయన కొడుకు మాత్రం టీడీపీనే అంటి పెట్టుకుని ఉన్నారు. గత రెండు దశాబ్దాలుగా కర్నూలు సిటీ రాజకీయాల్లో తండ్రీ కొడుకులది చెరగని ముద్ర. 2014 , 2019 ఎన్నికలలో స్వల్ప తేడాతోనే ఓడిపోయారు. 2014లో టీజీ వెంకటేష్ మూడు వేల ఓట్ల తేడాతో.. 2019లో టీజీ భరత్ వైసీపీ వేవ్‌లోనూ ఐదు వేల ఓట్ల తేడాతోనూ పరాజయం పాలయ్యారు. ఈ సారి ఎమ్మెల్యేగా గెలిచి, పరిశ్రమల శాఖ మంత్రి అయ్యారు.