JC Prabhakar Reddy: జేసీ సోదరుల నివాసాలలో ఏకకాలంలో ఈడీ సోదాలు, సెల్‌ఫోన్లు, పలు డాక్యుమెంట్స్ స్వాధీనం
ED Raids at JC Brothers Residence: అనంతపురం జిల్లా తాడిపత్రిలోని జేసీ సోదరుల ఇళ్లల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. సెల్ ఫోన్లు, డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు.
ED Raids at JC Prabhakar Reddy residence: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED Raids At JC Prabhakar Reddy Home) ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఈడీ తనిఖీలు చేపట్టిన సమయంలో జేసీ సోదరులు ఇంట్లోనే ఉన్నారు. శుక్రవారం తెల్లవారుజామున తనిఖీలు ప్రారంభించిన ఈడీ అధికారులు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి మొబైల్స్‌తో పాటు వారి కుటుంబసభ్యుల సెల్‌ఫోన్లను, కొన్ని డాక్యుమెంట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎవరినీ ఇంట్లోకి రానివ్వడం లేదు. క్లాస్ వన్ కాంట్రాక్టర్ చవ్వ గోపాల్ రెడ్డిఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి (JC Diwakar Reddy) నివాసంలోనూ ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.
హైదరాబాద్‌లోని నివాసాల్లోనూ సోదాలు
హైదరాబాద్‌లోని జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసాల్లోనూ ఈడీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఉమ్మడి ఆస్తుల వివరాలపై ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. తాడిపత్రిలోని కాంట్రాక్టర్ గోపాల్‌రెడ్డి ఇంట్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఈడీ తనిఖీల నేపథ్యంలో వీరి నివాసాలను సమీపంలో పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఏకకాలంలో జేసీ బ్రదర్స్ ఇళ్లు, ఆస్తులపై ఈడీ సోదాలు చేపట్టగా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
దివాకర్ ట్రావెల్స్ వివరాలపై ఆరా
తాడిపత్రితో పాటు హైదరాబాద్‌లోని జేసీ సోదరుల నివాసాలలో అధికారులు స్పెషల్ టీమ్ లుగా ఏర్పడి ఏక కాలంలో దాడులు నిర్వహించారు. వీరికి చెందిన దివాకర్ ట్రావెల్స్ గతంలో వివాదాలలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన వాహనాల కొనుగోలు లావాదేవీలపై అన్ని డాక్యుమెంట్స్‌ను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఉమ్మడి ఆస్తుల వివరాలు, వాహనాల కొనుగోలు లాంటి వివరాలపై ప్రశ్నిస్తున్నారు.